Tuesday, April 16, 2024

కలలు ఎందుకు వస్తాయంటే

 కలలు ఎందుకు వస్తాయంటే పచ్చి నిజాన్ని, పరమసత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజూ మీకు గుచ్చి గుచ్చి వివరించడానికే. ఆ పచ్చి నిజం ఆ పరమ సత్యం అర్ధం చేసుకుంటే పక్షికి రెండు రెక్కలొచ్చినట్లుగా వుంటుంది. లేకపోతే "ఎందుకిలా? ఎందుకలా?" అంటూ సతమతమయిపోతుంటాము.  ఎందుకంటే మనకు ఏది పచ్చినిజమో, ఏది పరమ సత్యమో తెలియదు.

ఎవరో చంపడానికి మన వెంటపడుతుంటారు, మనం చాలా కష్టపడి పరిగెడుతుంటాము. తీరా కళ్ళు తెరచి చూసేసరికి అంతా మాయమైపోతుంది. అప్పుడనిపిస్తుంది “అరే! ఇదంతా కలేనా!”... అని

అలాగే 20 సం॥, 30సం॥, 70సం॥ జీవించి జీవించి రకరకాల కష్టాలు, సుఖాలు అనుభవించి ఎప్పుడైతే మనం మన శరీరం విడిచి పెడతామో అప్పుడు “అరే! ఇదంతా కలేనా!" అనిపిస్తుంది.

మీరు కలలోంచి లేవగానే మీకొక పచ్చినిజం అర్ధమవుతుంది. “ఇదంతా... జరిగిందంతా... కలేనా! నీటి మీద గీత, రాయి మీద గీత కాదు" కనుక “ఈ జీవితమంతా కూడా నీటి మీద గీత" అని స్వప్నం యొక్క అనుభవం ద్వారా అర్ధమవుతుంది.

“ఇదే పచ్చినిజం, పరమ సత్యం" అని చనిపోయాక మీకు తెలుస్తుంది. ఇది చెప్పడానికే ప్రతిరోజూ కలలు వస్తూంటాయి.

వేదం యొక్క అంతం వేదాంతమని గ్రహింప జేయడానికి ప్రతిరోజూ కలలు వస్తుంటాయి. "భవబంధాలన్నీ నీటి మీద గీతలు" అని తెలుసుకొని బ్రతకాలి. ఇదంతా ఒక గొప్ప నాటకరంగం. కలల్లో వచ్చే లాంటి మాయా ప్రపంచమే ఈ జీవితం ఈ జీవితంలో జరిగేదంతా కలే. మనకు చావు లేదన్న వేదాంతాన్ని తెలియజెప్పేదే కల.

జననమరణాలన్నీ కలలవంటివే. పైలోకంలో నిద్రపోతే ఈ లోకంలో మేల్కొంటాము. ఈ లోకంలో నిద్రపోతే పైలోకంలో మేల్కొంటాము. ఎరుక వస్తే గతంలో జరిగిన మంచి చెడులన్నీ కూడా కలలు అనే పచ్చి నిజం మనకు అర్ధమవుతుంది.

"మనం చూసేదంతా కలే" అన్న దృక్పధం ఎప్పుడూ కలిగి వుండాలి. ఎందుకంటే అదే పరమ సత్యం. కలలో చేసే మంచి నిజ జీవితంలో చెయ్యాలి. "కలలో ఆనందం వుంది మరి జీవితంలో కూడా ఆనందంగా వుండాలి". ఎందుకంటే చివరికి మనకు మిగిలేది ఆనందమే.

ఆత్మజ్ఞానం వున్నవాళ్ళంతా మేల్కొన్నవాళ్ళు, దుఃఖంలో వున్న వాళ్ళంతా నిద్రపోతున్న వాళ్ళు. నా దగ్గరకొచ్చి కష్టాలు చెప్పుకొనే వారందరికీ నేను చెప్పేదేమంటే "కళ్ళు తెరచి చూడండి, ఈ కష్టాలన్నీ ఒక కల మాత్రమే!”

No comments:

Post a Comment