. *స్నేహము*
. **********
1. ఏ భోగమునకు పొంగని
ఏ రోగమునకు క్రుంగని
ఏ మోహమునకు లొంగని
ఏ ద్రోహమునకు వంగని
2. స్నేహము కడు ముదావహం.
దానిలోన ఉండదు అహం.
అది ఎఱుగదు ఆగ్రహం.
అందు తరగదనుగ్రహం.
3. శత్రులకది జ్యేష్ఠమాత.
మిత్రులకది పుష్టిదాత.
బాధను ఎడబాపునదీ.
భేదమనిన సహించనిది.
4. కలిమి లోన - లేమి లోన
కలిసి ఉండనిచ్చునదీ.
ఇరువురి మనసొకటేయను
అనురాగాంభుది మయమది.
5. లంచము నెపుడాశించదు.
కొంచెపు తనముంచుకోదు.
కీడొనరించడమనునది
దీని జాతకములొ లేదు.
6. ఐక్యతకది మారు పేరు.
అది లేని చోట చేరు పోరు.
అది అనురాగ నికేతనం.
సహనము దాని కేతనం.
7. సహృదయం మంచితనం
దానికి మన వేతనం.
అంతరాలు లేని తనం
ఇదే స్నేహ పనితనం.
8. అందులోన అందమైన
బంధం, అనుబంధముంది.
అది మన ఎదకాభరణం.
మమతాభరితావరణం.
9. ఉపకారమె దాని విధి.
అపకారము నెఱుగనిది.
అందు ఉంది తృప్తి నిధి.
అందుకె అది మన పెన్నిధి.
10. కలిమి కన్న చెలిమి మిన్న.
అన్నా ! ఎవరేమన్నా !!
అదరదు బెదరదు చెదరదు.
ఉలికి పడదు. వెలితి కాదు.
11. ధరిత్రిలో మైత్రి కన్న
మనకు మిన్న ఏమున్నా
దీనికి సరిసాటి రాదు.
దేనికి ఇది తీసిపోదు.
12. స్నేహ రహిత బ్రతుకు నాస్తి.
స్నేహమె అసలైన ఆస్తి.
ఒకరి నొకరి అనురక్తీ
ముక్తికి సోపాన యుక్తి.
13. చెలిమిని ఏమని అందము !?
చెలిమి వలెనె బతుకందము.
చెలిమిలొ కలదానందము !
చెలిమియె సుకర సుగంధము !
14. గ్రహముల స్థితి గతులనైన
చెలిమియె నిర్దేశించును.
భక్తులు , దేవతలునైన
చెలిమి వలనె కలిసుందురు.
15. దేవుడైన జీవుడైన
ఎంతటి సంపన్నుడైన
చెలిమి లేక నిలుచునా !?
నిలిచి వెలుగ గలుగునా !?
16. బతికి బట్ట కట్టినా
చితికి చితిని ముట్టినా
ఏముండును ఇహము పరము ?!
అంత జుగుప్సాకరమూ.
17. అనుభవింప కష్టమయెడి
నరకమె ఆజన్మాంతము.
ఆవహించు నపకీర్తియె.
ఇక మరణానంతరం.
18. మిత్రుడనని చెప్పుకొనుచు
మోసగించ నేరమౌను.
నిస్వార్థముతో చేసెడి
స్నేహమె నిజమైన దగును.
19.
స్నేహమె లేకుంటె ఎవరి కెవరు ఏమి ఔతారూ ?
ఏముండును నీకు నాకు ఇంకొకరికి సంబంధం ?!
అదియే ఈ మనిషీ నిజమగు మనిషయె మూలం !
అది చెదిరి ఎదురు తిరిగెనా ! ఔతుందిక శూలం !
20. స్నేహమునకు ఊతమిచ్చి
వికసించెడు జన్మె జన్మ !
ఖర్మ గాలి చెలిమి చెడితె
అధోగతే ! ఖర్మ ! ఖర్మ !
21. అందుకె స్నేహము వరమై
అవతరించె శుభకరమై !
మన సన్నిధి పెన్నిధియై
ఘన సంపన్నపు నిధియై !!
22. అందుకొరకె దీన్ని మనము
పెంచవలెను అనుదినమ్ము !
దీనిలోనె పరమాత్ముని
స్వరూపమును కనవలెనూ !
23. అపుడె కదా ఈ జన్మకు
సార్థకతా సౌజన్యము !
బతికి ఉన్న మరణించిన
శాశ్వత కీర్తి కిరీటము !
24. సృష్టి సదా సజీవమునకు
ప్రకృతిలొ ఏర్పడెను చెలిమి !
ఇదే సృష్టి సమాజమును
నడిపించెడు సంజీవని !
25. దేవుని సృష్టిలొ చెలిమికి
ఉంది అంత ప్రాధాన్యత !
చెలిమి వలెనె ఎవరిదైన
నిజము జన్మ ధన్యత !!
26. ఇదె కద మన స్నేహమనిన!
పెంచుతు మనుమనుదినమ్ము !
సంతోషము, సంతృప్తితొ
మనుగడ కొనసాగించుము !
**************************
రచన :---- రుద్ర మాణిక్యం.(కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
*************************************
No comments:
Post a Comment