Saturday, April 13, 2024

ఆశలు రేపిన అడియాశలు చూపిన, సాగే జీవితం అడుగైనా ఆగదుగా!!

 🌺🌺🌺
"ఆశలు రేపిన అడియాశలు చూపిన,
సాగే జీవితం అడుగైనా ఆగదుగా!!"

తూర్పు ఆకాశం తలుపులు తెరుచుకుంటున్న సమయం, అలా వెనకనుండి "శాస్త్రి" గారి మాట ఏదో హితవు చెప్తోంది. "అమ్మ" గురించి ఏదో రాయాలన్న ప్రయత్నం, ఏదో బరువైన  'భావం' చెప్పాలన్న తపన, కానీ ఇదంతా 'అక్షరంగా' మారట్లేదు! ఒకవేళ మారిన ఎక్కడో ఏదో అసంతృప్తి!  సాయం కోసం నేను 'చదివిన' కొన్ని పుస్తకాల కూడా వెతికాను, కొన్నిమాటలు కూడా దొరికాయి,  కానీ అవి నాదైనదిగా అనిపించట్లేదు. "నిజంగా కొత్త భావాలంటూ ఉండవోయ్" 'చివరికి మిగిలేదిలో',  బుచ్చిబాబు రాసిన ఒక వాక్యంకూడా నావైపు చూస్తోంది??

అలా చాలా సేపు ప్రయత్నించాక ఇక లాభంలేదని ఆ ప్రయత్నం వదులుకొని, సమ్మర్ వెకేషన్  ప్లాన్ కోసం హోటల్స్  బుక్ చేయడం  మొదలుపెట్టాను. ఈసారి వెళ్ళేది కొంచం హిల్ స్టేషన్ కావడం అందులో హాలిడే సీజన్ ;కావడం వల్ల ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి టాక్సీ రేట్లు మండిపోతున్నాయి,ట్రైన్ సౌకర్యం లేదు , వాళ్ళని వీళ్ళని కనుకుంటే  పొద్దునే ఒక ఆర్డినరీ  బస్సు సౌకర్యం ఉందని తెలిసింది, హమ్మయ్య అనుకోని  మా ఆవిడకి ప్లాన్ అంతా వివరించి బస్సు తెల్లవారే కావడంతో ఎప్పుడు లేవాలి, ఎక్కడ ఏం తినాలి అని మాట్లాడుతుండగా??

"మనసుకి  ఒక నిశ్శబ్దపు శబ్దం వినపడింది, "గమ్య స్థలం వేరు కానీ, ఇప్పుడు నేను ప్లాన్ చేస్తోందంతా ఎప్పుడో చేసేసిన ప్రయాణం గురించి  అనిపిస్తోంది", జ్ఞాపకం చాలా విచిత్రమైనది  దాని వెనక పరిగెత్తినంత సేపు వెయ్యి కాగడాలతో సముద్రం మధ్యలో ప్రయాణించినట్లు ఉంటుంది, దానిని వదిలి వేరొక లక్ష్యం వెనుక పరిగెడుతున్నపుడు మాత్రం నల్లటి మేఘాల మధ్య ఒక  మెరుపులా తడుతుంది."

 ఆ జ్ఞాపకం, 'అమ్మతో' చిన్నపుడు నేను చేసిన ప్రయాణాలు, అప్పట్లో వేసవి సెలవలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది అమ్మమ్మగారి ఇల్లు. ఆ పల్లెటూరు,  అమ్మమ చారు, మామయ్య పిల్లలతో ఆటలు, అక్కలు చెప్పే కబుర్లు. ఇవ్వన్నీ నాకు చాలా ఇష్టమైన విషయాలే అయినా,  అన్నిటికన్నా 'చాలా' ఇష్టమైన విషయం 'అమ్మమ్మ' ఇంటికి వెళ్ళడానికి అమ్మతో నేను చేసే ఆ బస్సు ప్రయాణం.

ఇంకా గుర్తు మిగితా రోజుల్లో పొద్దునే లేవడానికి తెగ మూలిగే నేను, ఆ రోజు మాత్రం ఎక్కడలేని ఉత్సాహంతో అలారం కన్నా ముందే లేచేవాడిని! అప్పటికే కుక్కరు చప్పుడు వినపడేది,  ఆపాటికే నాన్నకి బాక్స్ రెడీ అయిపోయేది. బస్టాండ్ దాకా దింపడానికి నాన్న సైకిల్ మీద వస్తే, మేము ఆటోలో వెళ్ళేవాళ్ళం. ఆ బస్సు ఎక్కించే ఆ కొద్దీ సేపు అమ్మ నాన్నల మధ్య సంభాషణ చాలా చిత్రంగా అనిపించేది. అప్పటివరకూ, ఎప్పుడెప్పడు 'వాళ్ళ అమ్మ' వాళ్ళ ఇంటికి  వెళ్తానో  అని ఎదురుచూసే 'అమ్మ', వెళ్లే సమయం వచ్చినప్పుడు మాత్రం మాటకి పదిసార్లు 'తొందరగా వచేస్తానండి అనేది'?  అప్పటిదాకా పెద్ద పెద్ద అడుగులతో కదిలే నాన్న పాదాలు బస్సు కదిలి వేగం పుంజుకుంటున్నపుడు మాత్రం, నెమ్మదిగా, అడుగులు చిన్నవిగా మారేవి?

వీటన్నిటికీ దూరంగా నా 'ఆలోచన' మాత్రం బస్సు ఆగే నాలుగు చోట్ల ఏం తిందామా అని ఉండేది.  ఆ మూడు, నాలుగు గంటల ప్రయాణం అమ్మతో బలే సరదాగా సాగిపోయేది.  బాగా 'రద్దీ బస్సు' ఎక్కితే నేను నిలబడి అమ్మకి సీట్ ఇచ్చినప్పుడు ఏదో ప్రపంచాన్ని ఉద్దరించా అని కలిగే గర్వం, బస్సు ఆగే పదినిమిషాలలో హోటల్ వాడు పార్సెల్ కట్టడం లేట్ అయితే ఎక్కడ బస్సు వెళ్లిపోతుందా అని కంగారు పడడం ఆ దిగినంతసేపు అమ్మ కిటికీకి దెగ్గరగా జరిగి నా వైపే చూడడం, అమ్మ భుజానికి దేగ్గెరగా జరిగి పడుకోవడం, కొంత వయసు వచ్చాక 'నాన్నతో' నువ్వే ఇది చెప్పరా అని 'అమ్మ' నాతో పంచుకున్న సంగతులు, పెద్ద సమోసా రెండు కాగితాలలో తీసుకుంటే మధ్యలో తనకి నచ్చని ఆ కుర్మాని నా కాగితంలో పెడితే ఏంటే అమ్మ అలా తింటావ్ సమోసాని అనడం, ఊరు దెగ్గరేయే కొద్దీ కండక్టర్ ఇవ్వాల్సిన చిల్లర కోసం ఆయన వైపే తదేకంగా చూడడం, ఊరిలో దిగాక ఆటో కోసం ఎదురు చూపులు, ఊరులో దిగిన రోజే అమ్మతో కలిసి వేణుగోపాలస్వామి గుడికి వెళ్లడం, ఇలా అనుభూతులుగా మారిన ఎన్నో జ్ఞాపకాలు, ఇవ్వన్నీ నేను జీవించిన క్షణాలు.

 జీవితం ఎంత చిత్రమైనదంటే నాకు అప్పుడు తెలీదు ఆ ఆర్డినరీ బస్సు ప్రయాణం అంత ప్రత్యేకమని! ఏ కెమెరాలోనూ బందించని ఇన్ని జ్ఞాపకాలు, నా మనసు పొరలలో సజీవంగా మిగిలిపోయాయి

 ఎలాగైతే తనతో చిన్నప్పటినుండీ నేను చేసిన జ్ఞాపకాలు గుర్తొ, అలాగే, తనతో ఆఖరి ప్రయాణం కూడా గుర్తుంది?

 ఎప్పుడు తను ఇంటికి వచ్చినా ఆనంద పడే మేము, ఆ రోజు డాక్టర్ గారు ఇంక ఇంటికి తీసుకువెళ్ళిపోండి అంటే మాత్రం తట్టుకోలేకపోయాం. ఆ రాత్రి అంబులెన్సులో హైదరాబాద్ నుండి తనతో ఆఖరి ప్రయాణం, అంతా అయిపొయింది అని  చుట్టాలందరూ మైల బట్టలు కూడా  తీసుకోవడం ప్రారంభించారు. కానీ, ఒక్క నాన్న మాత్రం, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా నీకు అంతా తగ్గిపోతుంది అని తనకి చెప్పడం,  తను నా చెయ్యి గట్టిగా పట్టుకొని అలా నావైపు చూడడం, నాన్న కళ్ళ నుండి వస్తున్న బాధని గట్టిగా ఆపడానికి ప్రయత్నిస్తూ ఆయనకి తెలిసిన ప్రతి దేవుడికీ బ్రతికించమని మొక్కడం, కానీ ఏ దేవుడు ఆయన మొక్కుని చెల్లించకపోవడం, తనని పున్నామ నరకం దాటించడానికి నా చేతులతో చితి అంటించి నేను నరకం చూడడం.

 ఆ రోజు మాతో, 'తన' ప్రయాణం అక్కడితో ముగిసిపోయింది అనిపించింది, కానీ రోజులు సంవత్సరాలుగా మారుతున్నప్పుడు అర్ధమవుతోంది తన అంశతో నా ప్రయాణం నా కడదాకా ముగియదని.

 ఇలా ఆలోచిస్తూ ఉండగా, మలి సంధ్య సమయాన ఒక దూరపు చుట్టం ఇంటికి వెళ్ళాము. ఇంటి డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతుండగా మొన్నీమధ్య జరిగిన వాళ్ళ అబ్బాయి పెళ్లి వీడియో పెట్టారు, బాగా గ్రాండ్ గా చేశారనిపించింది, అందులో కొన్ని కొన్ని చోట్ల ఎడిటర్లు పెట్టిన పాటలకి, ఆ ఫోటో ఫోజులకి అక్కడే ఉన్న వాళ్ళ అబ్బాయి  కొంచం సిగ్గుపడి ఏదో ఫోన్ వచ్చినట్లు లివింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు.  ఇంటికి తిరిగి వస్తున్నపుడు అమ్మతో ఒక తమాషా జ్ఞాపకం గుర్తుకు వచ్చింది, ఎవరైనా కొంచం దూరపు చుట్టమో, లేక కొంచం ప్రత్యకమైన వ్యక్తుల్లో ఇంటికి వస్తే అమ్మ మా ఇంట్లో ఆల్బం వాళ్ళ  ముందు పెట్టేది! అమ్మ నాన్నల పెళ్లి ఫోటోలు, నా చిన్నప్పటి ఫోటోలు, మేము ముగ్గురం  కలిసివున్నపటి ఫోటోలు, అమ్మమవాళ్ళ  ఇంట్లో దిగిన ఫోటోలు అన్నీ అందులో ఉండేవి. అందులో ముఖ్యంగా చిన్నపుడు నాతో 'నాలుగు'  సంవత్సరాల వయసులో ఆడపిల్ల వేషంలో అమ్మ తీయించుకున్న ఫోటో కూడా ఉండేది, ఆ ఫోటో నేను ఎన్ని సార్లు మాయం చేసిన మళ్ళీ ఎలా వచ్చేదో, వచ్చేది. అది ఎక్కడ చూసి నవ్వుతారేమో అని ఎదో పని ఉన్నట్లు నా రూంలోకి వెళ్లిపోయేవాడిని.

 ఇవాళ మళ్ళీ అదే ఆల్బం చూస్తున్నప్పుడు, మొదటి పేజీలో అమ్మ పెళ్లినాటి ఫోటోలు, నా చిన్నపటి ఫోటోలు  తిరగేస్తున్నపుడు నాన్న అమ్మ పెళ్ళైన కొత్తల్లో ఎట్లా ఉండేదో చెప్పిన విషయాలు స్మరణకు వొచ్చాయి. నాన్నమోసపోయి చిరిగిపోయిన పట్టు చీర తీసుకువచ్చినా అందులోని ప్రేమని గమనించి మురిసిపోయిన అమ్మ, పదినిమిషాలు నేను తప్పిపోతే ఆ బాధని తట్టుకోలేక నాన్నఇంటికి రాగానే ఏడ్చేసిన అమ్మ, ఎంత మంది తనని తేలికగా చూసినా వాళ్ళని తిరిగి ఒక మాటైనా అనడం చేతకాని అమ్మ, నీ కొడుకుకి చదువు అబ్బదు మాన్పించే అంటే కళ్ళు పెద్దవి చేసి నిటూర్చిన  అమ్మ, చిన్న జీతం అయినా ఉద్యోగం వస్తే మురిసిపోయిన అమ్మ, నా భవిష్యత్తునే తన భవిష్యత్తుగా ఊహించుకున్న అమ్మ, మృత్యువు తనని గడ్డి పోచగా చూస్తే మా గురించే కుమిలిపోయిన అమ్మ.

 ఇలా ఆలోచిస్తూ ఉండగా, మెట్రో రైలు చివరి స్టేషన్ చేరుకుంది, మెట్రో దిగి  మెట్రో నగరపు వీధుల్లో నడుస్తూ ఉండగా, ఒక చిన్న పిల్ల తన అమ్మని కౌగిలంచుకొని "HAPPY MOTHERS DAY" అని చెప్పడం చూసాను, బలే అనిపించింది. చిన్నపుడు ఈ సోషల్ మీడియా లేని కాలంలో, సండే వసుందరలో కవర్ స్టోరీలో చూసి ఆ రోజు 'Mother's Day' అని తెలిసేది ఎప్పుడూ అమ్మకి విషెస్ చెప్పాలనిపించేది కాదు, ఏదో సిగ్గు, చెప్పకపోయినా నా ప్రేమ తనకి అర్ధమవుతుందన్న నమ్మకం. ఇప్పుడు తను లేనప్పుడు ప్రతి ఏటా అదే రోజు ఒక చిరునామా లేని ఉత్తరం రాస్తున్న. రోజంతా తననే తలుచుకుంటూ తనని, తన జ్ఞాపకాలని ఒక అక్షరంలా మారే ప్రక్రియ నాకు చాలా ఆనందాన్నిస్తోంది. అలా ఆలోచిస్తూ ఉండగా దూరంగా ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది
Whatsapp /courtesy

No comments:

Post a Comment