Friday, April 12, 2024

 ‘‘వినదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్‌ ....’’ అంటున్నారు బద్దెన. మాట వినడం అనేది ఒక కళ. ఎవరు సారవంతమైన మాట చెబుతారో, వాళ్ళ అనుభవంలోంచి ఏ మాట వస్తుందో ... కాబట్టి తప్పకుండా వినాలి. కానీ ‘కనికల్ల నిజము తెలిసిన...’ .. వినడం జాగ్రత్తగా వినాలి. విన్నతరువాత దాని గురించి బాగా ఆలోచించి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అంతే తప్ప వినగానే అదే నిజమని నమ్మి ఒక నిర్ణయానికి రాకూడదు. అది మనకు ప్రతికూలంగా ఉంటే ఉద్రేకపడిపోయి ప్రతిచర్యకు దిగకూడదు. అది చాలా ప్రమాదకరం. ఎవరు ఏది చెప్పినా, ఏది చూసినా అది నమ్మడం, దానికి ప్రభావితుడై  దానికి వశపడిపోవడం అలవాటయితే జీవితంలో వృద్ధిలోకి రాలేరు.
వెనకటికి ఒకాయన ముంగిసను పెంచుకున్నాడు. అది కూడా ఆయనకు బాగా అలవాటయి ఇంట్లోనే తిరుగుతూ వారికి అనుకూలంగా ఉండేది. అది ఉన్న చోట విష కీటకాలు వచ్చేవి కావు. ఇంటికి కాపలాగా కూడా ఉంటున్నదని దాన్ని మరింత ప్రేమగా చూసుకుంటుండేవారు. ఒక రోజు పనిమీద బయటికి పోతూ, చంటిపిల్లాడిని ఊయలలో పడుకోబెట్టి బయటికెళ్ళాల్సిన పరిస్థితి. ముంగిస ఉందికదా అనే ధీమాతో వెళ్ళిన వారు రావడం కొద్దిగా ఆలస్యమయింది.
తీరా ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వస్తుండగా ముంగిస నెత్తుటి నోటితో ఎదురుపడ్డది. యజమాని కీడును శంకించాడు. ఊయలవైపు చూస్తే అంతా రక్తసిక్తంగా కనిపించింది. తన బిడ్డను అది కొరికి చంపిందనుకొని ఒక కర్రతీసుకొని దాన్ని కసితీరా కొట్టాడు. అది చచ్చిపోయింది. కోపం చల్లారాక బిడ్డ పరిస్థితి చూద్దామని ఊయల దగ్గరకు వెళ్ళి చూసి అవాక్కయిపోయాడు. బిడ్డ క్షేమంగా ఉన్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. ఊయల చుట్టు పక్కల పెద్ద తాచుపాము ముక్కలుముక్కలయి పడి ఉంది.
అప్పుడు తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడో తెలిసొచ్చింది. తన తొందరపాటుకు చింతిస్తూ... తన బిడ్డను కాపాడి, ఇప్పడు తన కోపానికి ఆహుతయిపోయిన ముంగిస ముందు కూర్చుని భోరుమన్నాడు. ఎంత ఏడ్చినా దిద్దుకోలేని తప్పు అది. అంత ప్రేమ, అంత నమ్మకం చూపిన ఆ ప్రాణి మళ్ళీ సజీవం గా తిరిగొస్తుందా ?
అందుకే మనం కళ్ళారా చూసిన, చెవులారా విన్న విషయాలలో కూడా తొందరపడి నిర్ణయానికి రాకూడదు. చూసినవాటిలో, విన్నవాటిలో నిజమెంతో పరిశీలించాలి.
అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. ‘గురుబుద్ధిర్విశేషతః’’ అంటారు. గురువు గారు చెప్పిన విషయానికి సంబంధించి నీవు మరోమారు ఆలోచించనక్కరలేదు. ఆయన చెబితే అది ఆదేశం. నీవు మరుక్షణం దానిని ఆచరించవచ్చు. కొన్ని కొన్ని విషయాలు తప్ప తండ్రి చెప్పినా అంతే... తల్లి చెప్పినా అంతే. లోకంలో సర్వసాధారణంగా వారు తప్పు మాట చెప్పరు.
వారు ఏది చెప్పినా నీ శ్రేయస్సుకోరి మాత్రమే చెబుతారు. వాటిని తిరస్కరించకూడదు. వీరు తప్ప స్నేహితులు, బంధువులు ఎవరు చెప్పినా.... దానిలోని మంచి చెడులను విచారించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. వారిని అనుమానించనక్కర లేదు. వారు చెప్పే విషయాల్లోని నిజానిజాలు వారికి కూడా తెలియకపోవచ్చు. నీవు మాత్రం. వారు చెప్పిన మాటలలో నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలా వివేకం, విచక్షణ చూపిన వాడే నిజమైన మనిషి... అనేది బద్దెనగారి సందేశం.🌹

No comments:

Post a Comment