Friday, April 12, 2024

స్నేహం అంటే ఏమిటి?

 స్నేహం అంటే ఏమిటి?

సంస్కృత సాహిత్యంలో నిజమైన మైత్రి అంటే ఏమిటి అని చర్చించబడింది. మైత్రి అనేది పాలకీ నీళ్ళకీ మధ్య ఉన్నట్లు ఉండాలి. మాధుర్యం, తెలుపు అనేవి పాలలో ఉండే సహజ గుణాలు. అవి ఆ విధంగా నీళ్ళలో లేవు. నీళ్ళు వచ్చి "నేను నీతో కలవవచ్చునా?" అని పాలను అడిగినప్పుడు పాలు తన గుణాలు నీళ్ళకి ఇవ్వడానికి వెంటనే అంగీకరిస్తుంది. ఏవి పాలు, ఏవి నీళ్ళు అని తెలియడానికి కూడా వీలుకానంతగా అవి కలిసిపోతాయి. పాలను కాచినప్పుడు అవి బాధపడతాయి. తన మిత్రుని బాధ చూడలేక నీరు ఆవిరిగా అయిపోయి తన దేహాన్ని త్యజించడానికి ప్రయత్నిస్తుంది. ఇది నన్ను శరణు పొందింది. నా బాధ చూడలేక తన శరీరమే విడిచి వేస్తూన్నది అని గ్రహించి పాలు పైకిపొంగి తన శరీరాన్ని త్యజించడానికి ప్రయత్నిస్తాయి. ఈ విషయం పాలు ఎక్కువగా కాచినప్పుడు మనం గుర్తించవచ్చును. అప్పుడు ఆ పాలమీద నీళ్ళు చల్లగానే మన మిత్రుడు తిరిగి వచ్చాడు అని గ్రహించి పాలు శాంతిస్తాయి. నిజమైన మైత్రి అంటే ఇలా ఉండాలి. జనం మైత్రిని గూర్చి మాటలాడుతూంటారు. వాళ్ళు తమ మైత్రిని పాలకూ, నీళ్ళకూ మధ్య ఉన్న మైత్రితో పోల్చిచూచుకోవాలి. అలాంటి మైత్రి ఎవరికైతే ఉంటుందో వారికి సుఖశాంతులుంటాయి.

No comments:

Post a Comment