Sunday, April 14, 2024

నేటి చిట్టికధ..

 నేటి చిట్టికధ..

శివపురం జమీందారుగారి దివాణంలో నౌకరీ చేసే చలమయ్య  దగ్గర పనిఒక పాడిగేదె తప్ప వేరే ఎలాంటి ఆస్తులూ ఉండేవి కావు.

ఒకసారి చలమయ్య కొడుక్కి జబ్బు చేసింది. వైద్యుడికి చూపిస్తే ఆ జబ్బు నయం కావడానికి ఐదువేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పాడు. కాని చలమయ్య దగ్గర అంత డబ్బు లేదు. 

చలమయ్య స్వతహాగా నెమ్మదస్తుడు. ఏం చేయాలో తెలీక బాధపడసాగాడు.
చూస్తూండగానే జమీందారు కొడుకు పెళ్ళి జరిగింది. పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు జమీందారు గారు. అక్కడి పాత్రలు-పరిశుభ్రత బాధ్యతలు చలమయ్యకే అప్పగించారు.

పెళ్లి ముగిశాక ఆ కుడితి నీటిని చలమయ్య తన గేదెకు ఇప్పించాడు.గేదె ఆ కుడితిని తాగేసింది ఇష్టంగా. అటుపైన కుడితి తొట్టిని శుభ్రం చేస్తున్న చలమయ్యకు దాని అడుగున మెరుస్తూ కనిపించింది ఒక బంగారు ఉంగరం!

"అయ్యో, పాపం. ఎవరిదో, ఈ ఉంగరం! పెళ్ళి భోజనం చేశాక చెయ్యి కడుక్కునేటప్పుడు జారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎంత కంగారు పడుతున్నారో" అనుకున్నాడు చలమయ్య.

 అంతలోనే జబ్బుతో ఉన్న కొడుకు గుర్తుకువచ్చాడు. ఈ ఉంగరాన్ని అమ్మేస్తే ఐదువేలేం ఖర్మ- పదివేల రూపాయలు కూడా వస్తాయి. తను ఇక ఎవ్వరినీ అప్పు అడగాల్సిన అవసరం ఉండదు..

అయినా ఇతరుల సొమ్మును అమ్మి కొడుకు జబ్బు నయం చేయించుకోవడం సరైన పని అనిపించలేదు చలమయ్యకు.

 కొంచెం సేపు ఆలోచించి, నేరుగా జమీందారు గారినే కలిసి ఉంగరాన్ని ఆయన చేతిలో పెట్టాడు- తనకు అది ఎలా దొరికిందో చెబుతూ...

 ఆయన ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమంటే అది ఆయన భార్యదే! ..

చలమయ్య కొడుకు పరిస్థితి బాగాలేదని, డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నాడనీ అప్పటికే జమీందారుగారి దృష్టికి తీసుకెళ్లారు, తోటి పని వాళ్లు. అలాంటి పరిస్థితిలో కూడా చలమయ్య నిజాయితీగా ఉంగరాన్ని అప్పగించటంతో జమీందారు-గారికి చలమయ్య అంటే చాలా గౌరవభావం కలిగింది.

 చలమయ్య నిజాయితీని సభాముఖంగా ప్రశంసించి, సొంత ఖర్చుతో వాళ్ళ అబ్బాయికి వైద్యం చేయించారాయన.

జమీందారుగారి ఆదరణకు చలమయ్య కూడా ఎంతో సంతోషించాడు. సకాలంలో వైద్యం జరగడంతో చలమయ్య కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. 'చలమయ్య నిజాయితీనే అతని కొడుకుని కాపాడింది' అని అందరూ మెచ్చుకున్నారు.

జమీందారు గారు చలమయ్య మీది అభిమానంతో అతనికి మరికొన్ని పాడి గేదెల్ని బహుమతిగా ఇచ్చారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో చలమయ్య ఆనందంగా జీవించసాగాడు.

ఆత్మశుద్ధి  లేని యాచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

ఆత్మ, మనసు మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు?
వంట చేసేటపుడు పాత్ర శుభ్రంగా లేకపోతే వంట చేయడమెందుకు?
చిత్తం అనగా మనసు లోని ఆలోచనలు, బుద్ధి నిర్మలంగా లేకపోతే శివ పూజ చేయడం ఎందుకు?
చక్కగా, నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము.
అని వేమన భావం .

No comments:

Post a Comment