💐💐అందం-ఆనందం💐💐
అందమైన ప్రకృతిని చూసి ఆనందించడం అందరి జన్మ హక్కు. ఈ సృష్టికి మూలకారణం సచ్చిదానందం. ఎలా ఆ ఆనందరసాన్ని జీవితంలో ఆస్వాదించాలో తెలియకపోవడం వల్ల దుఃఖానికి లోనుకావాల్సి వస్తున్నది.
ఈ ప్రపంచం మాయ, మిథ్య అంటారు వేదాంతులు. ఇల ఒక కల అంటారు కవి కుమారులు. కల కంటున్నంత కాలం నిజంగానే అందులోని వస్తువులు, సన్నివేశాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రపంచమూ ఇంతే. అందమైన ప్రకృతిలో అది కలకలలాడుతున్నప్పుడు కాదని లేదని ఎలా అనగలం? మెలకువ రాగానే కల కరిగిపోయినా అది మనలో ఒక చెదరని ముద్రవేస్తుంది. కలగానే అది చిరకాలం మన మదిలో కదలాడుతూ ఉంటుంది. మనసు ఆడే దాగుడుమూతలాంటిది మనం కంటున్న కల.
రంగస్థలం పైన ఒక నాటకం జరుగుతున్నంత సేపు ప్రేక్షక జనం రసానుభూతికి లోనై పరవశం చెందుతుంటారు. శృంగార, కరుణ, బీభత్స, భయానక, వీర మొదలైన నవరసాల పాత్రలు ప్రదర్శించాక చివరకు ప్రేక్షకులకు ఆనందరసం ఏం లేకపోతే, ఆ నాటకం వృథా ప్రయాస కాక తప్పదు. రసజ్ఞత లేని ప్రేక్షకులు నవరసాలలోని ఆనందాన్ని పొందలేక పెదవి విరుస్తారు. కాని, ఆ రసాను భూతులన్నీ ఏకమై రసహృదయుడైన ప్రేక్షకుణ్ని తప్పకుండా ఆనంద రసమై అలరిస్తుంది. ఆనంద రసానుభూతి ఒక వ్యక్తి యోగ్యత అర్హతలను బట్టి మారుతుంది.
నిజానికి దుఃఖం దృష్టి లోపంవల్ల కలిగిందే తప్ప, సృష్టిలో ఎలాంటి దుఃఖానికీ చోటులేదు. మనం ఆనందంగానే ఉంటున్నాం, పానకంలో పుడకలా దుఃఖం అలా అడ్డుపడగానే... అంతా అయిపోయిందే అని గుండెలు బాదుకోవడం మనిషికి అలవాటే. ఈ దుఃఖానికి బాధకు బాధ్యులు ఎవరు? ఆత్మ విమర్శ అంతర్దర్శనం జరిగినప్పుడే అసలు తత్త్వం బోధపడుతుంది. ఈ సృష్టి అంతులేని వింత.
పులిని చూడగానే లేడి భయంతో గజగజలాడుతుంది. లేడి కంటపడగానే పులిలో క్రౌర్యం పురివిప్పుతుంది. లేడికి ఆత్మరక్షణ తక్షణ కర్తవ్యం అయితే, పులికి దేహపోషణ తక్షణ కర్తవ్యం. సచ్చిదానందం తననుతాను వ్యక్తీకరించుకోవాలంటే పులిలాగా గాండ్రించాలి. ఇది మృగదశ. మానవదశలో ఈ గాండ్రింపు అనైతికం.
ఆనందంగా జీవించడం ఒక కళ. మన అస్తిత్వానికి అదే మూలాధారం. ఈ ఆనందం ఎక్కడ ఉంది? దాన్ని మనం ఎలా పట్టుకోవాలి? మనం మనుషులం. మన మనుగడకు ఆధారమైన కీలక యంత్రాంగం మనసే. మన అస్తిత్వానికి అదే పునాది.
‘కృష్ణా! మనసు చంచలమైనది. దీన్ని ఎలా పట్టుకోవాలి?’- ఈ ప్రశ్నతోనే కృష్ణార్జున సంవాదం మొదలై ఆ తరవాత గీతామృతం మనకు దక్కింది. ‘మనసును మచ్చిక చేసుకో. ప్రయత్నిస్తే అలవాటులో పొరపాటుగా ఏదో ఒక రోజు ఆ మనసు నీ మాట వింటుంది. ఆ తరవాత లొంగుబాటు తప్ప’దని బోధించాడు భగవాన్ కృష్ణపరమాత్మ.
ఆధ్యాత్మిక సాధన అంటే ఒక రకమైన ఆత్మార్పణా ప్రక్రియ. ఆత్మతోపాటు భావనలను, చిత్త వృత్తులను, చిత్తవృత్తులతో పాటు హృదయ స్పందనలను ఆనంద మందిరంలో నివేదించాలి. పారదర్శకమైన ప్రవర్తన, పరోపకార బుద్ధి అలవరచుకోవాలి. మహారాజులు, మేధావులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. ఆనందంగా జీవితకాలాన్ని అనుభవించడానికి కావలసినవి సిరిసంపదలు, కీర్తి కిరీటాలు, పేరుప్రతిష్ఠలు కావు. ప్రశాంతమైన మానసిక స్థితి.
No comments:
Post a Comment