Monday, April 1, 2024

****🧘‍♂️నేను – నాది అనే భావన నుంచి బయటపడాలి🧘‍♀️*_

 

















_*🧘‍♂️నేను – నాది అనే భావన నుంచి బయటపడాలి🧘‍♀️*_
🕉️🌞🌍🌙🌟🚩

*_నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు. నేను మొదలవుతుంటే నాది అనేది దాని వెనక తోకల్లాగవస్తుంది._* 


*_స్వార్థానికి 'నేను-నాది’ రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని” ఆ రెక్కలు వదులుకో అని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే._*


*_‘నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో ! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు. అప్పుడు లోకం కూడా ఉండదు._*


*_ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది._*


*_అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా ? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మిక వాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు._*


*_ప్రార్ధనచేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే 'నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది._*


*_ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది. అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం._*


*_దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది._*


*_చాలా మందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా ? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకు తింటూ ఉంటాయి._*


*_అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచంబాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే. నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది._* 


*_నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను. ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు._*


*_సమబుద్ది కలవాడి కంటే మించినవాడు ఈ లోకంలో లేడు. ఈ సమత్వమే యోగం !_*

🕉️🌞🌍🌙🌟🚩

No comments:

Post a Comment