*తెలివితో కొట్టాలి దెబ్బ* (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరి కిషన్-9441032212
***************************
ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు వుండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు. ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు.
పల్లవుడు చానా చెడ్డోడు. చుట్టుపక్కల వున్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు. ఏవైనా వినకపోతే దాడి చేసేవాడు. దాంతో వానికి భయపడి అన్నీ అలాగే చేసేవి.
మనోహరుడు చానా మంచివాడు. తన గుంపులోని ఎలుకలను సొంత బిడ్డలలాగా చూసుకునేవాడు. వాటికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు. తోడునీడగా వుండేవాడు. దాంతో ఎలుకలన్నీ మనోహరాన్ని ఎంతగానో అభిమానించేవి.
మనోహరునికి మంచి పేరు రావడం చూసి పల్లవుని కన్ను కుట్టింది. ఎలాగైనా సరే ఆ గుంపును దెబ్బ తీయాలని రకరకాల ఆయుధాలు తయారు చేయించినాడు. ఒకసారి మనోహరునితో ''నాకు లొంగిపోయి ఈ అడవి వదలి పారిపోతావా లేక యుద్ధానికి సిద్ధపడతావా'' అంటూ సవాల్ విసిరినాడు.
మనోహరుడు ఆలోచనలో పడినాడు. పల్లవుని దగ్గర చానా ఆయుధాలు వున్నాయి. యుద్ధం వల్ల అనవసరంగా ఇరువైపులా చానామంది చనిపోతారు. పిల్లలకు నాన్నలు, పెళ్ళాలకు మొగుళ్ళు దూరమైపోతారు. అనేక మంది వికలాంగులు అవుతారు. సంపదంతా నాశనం అవుతుంది. యుద్ధం ఎలా చూచినా మంచిది కాదు. తనవల్ల పదిమందికి మేలు జరగాలే గానీ కీడు జరగకూడదు అనుకోని అడవి వదలి వెళ్ళడానికి సిద్ధపడినాడు.
అది చూసి ఆ గుంపులోని ఎలుకలన్నీ కన్నీరు పెట్టుకున్నాయి. అప్పుడు ఆ గుంపులోని ఒక చిన్న ఎలుక ''రాజా... ఎవరికీ ఎటువంటి ఆపద కలగకుండా... ఆ పల్లవుడే అడవిని వదలి పారిపోయేలా నేనొక ఉపాయం చెబుతా వింటానంటే'' అనింది.
''మంచిమాట చెప్పడానికి వయసుతో పనిలేదు. తెలివితేటలు ఎవరి సొంతమూ కాదు. చెప్పు'' అన్నాడు మనోహరుడు.
''రాజా... మన ఎలులు అన్నింటికీ పిల్లి అంటే భయం. అందుకే మనం అచ్చం పిల్లిలాగా ఒక పెద్ద నడిచే బొమ్మ తయారు చేద్దాం. యుద్ధంలో దాన్ని ముందు పెట్టి బైలుదేరుదాం'' అంటా ఏం చేయాలో చెప్పింది.
అందరికీ ఆ ఉపాయం నచ్చింది.
వారం లోపల ఒక పెద్ద పిల్లి తయారయిపోయింది. దాని మెడలో ఒక పెద్ద గంట కట్టినారు. వెంటనే అడవిలో ఒక పుకారు లేవదీసినారు. మనోహరుని మంచితనం చూసి సాయంగా యుద్ధం చేయడానికి పక్క వూరు నుంచి ఒక పెద్ద పిల్లి వచ్చింది. అది మామూలు పిల్లుల కంటే పదింతలు పెద్దగా వుంది. దెబ్బకు వంద ఎలుకలని చంపుతుంది'' అని. ఆ మాటలు అడవంతా పాకిపోయినాయి. పల్లవుని వైపు వున్న ఎలుకలన్నీ భయంతో వణికి పోసాగినాయి.
తరువాత రోజు... యుద్ధంలో ముందు పిల్లి అడుగులో అడుగు వేసుకుంటా భయంకరంగా మియావు అని అరుచుకుంటా రాసాగింది. దాని మెడలో వున్న గంట గుండెలు అదిరిపోయేలా గణగణమని మోగసాగింది. దాని వెనుకే మనోహరుని సైనికులు. దూరం నుంచి దాన్ని చూసిన పల్లవుని సైనికులు అదిరిపడినారు. ''అమ్మో ... నిజమే... ఎంత పెద్దగుంది. ఇది కొడితే దెబ్బకు పదిమంది పచ్చడి పచ్చడి అయిపోతారు'' అనుకుంటా వెనక్కి తిరిగి ఆగకుండా పారిపోయినారు. అంతే ఒక్క నిమిషంలో పల్లవుడు తప్ప అక్కడ ఎవరూ లేరు. పల్లవుడు అదిరిపడినాడు. ''ఇంక ఇక్కడ ఒక్క క్షణం వున్నా నాకు చావు తప్పదు. బుద్ది పొరపాటై అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాను. ఇంగెప్పుడూ మంచివాళ్ళతో గొడవ పెట్టుకోగూడదు'' అనుకుంటా వెనక్కి తిరిగి అడవి వదలి పారిపోయినాడు.
*****************************డా.ఎం.హరి కిషన్-కర్నూలు-94410 32212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment