Wednesday, April 17, 2024

నవ్విస్తూనే... సమాజపు డొల్లతనాన్నీ చూపించిన దేశ దిమ్మరి(Tramp) చార్లీ చాప్లిన్

 *నవ్విస్తూనే... సమాజపు డొల్లతనాన్నీ చూపించిన దేశ దిమ్మరి(Tramp) చార్లీ చాప్లిన్* 
~~~

పుడుతూనే నడకతోపాటుగా నటన నేర్చుకున్నవాడు చార్లీ చాప్లిన్! 

వేదిక మీద ఆగిపోయిన తల్లి పాటను అందుకుని గొంతెత్తి పాడితే, దానికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందిస్తుంటే, తనుమాత్రం మీదకు విసిరిన చిల్లరడబ్బుల్ని ఏరుకోవడంలో మునిగిపోయాడు. చప్పట్లు ఆకలి తీర్చుతాయా! 

ఆకలికి మాడినవాడు కాబట్టే, ‘బూట్లను ఉడికించి, తినాల్సివచ్చిన’ సన్నివేశాన్ని(గోల్డ్ రష్) సృజించగలిగాడు.
 
 తాగుబోతు తండ్రి, మతిస్థిమితం తప్పిన తల్లి, అనాధాశ్రమాల్లో గడపాల్సిన పరిస్థితి, రెండేళ్లు మాత్రమే చదివిన చదువు... ఖరీదైనదిగానే తప్ప మరోలా మన ఊహకు అందని లండన్ నగరంలోని అతిపేదరికాన్ని చిన్న వయసులోనే చాప్లిన్ అనుభవించాడు. 

అందుకేనేమో, ‘‘నేనెప్పుడూ వాననీటిలో నడవడానికి ఇష్టపడతాను, నా కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా’’ అన్నాడు.
 
పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడకముందు చాప్లిన్ చాలాపనులు చేశాడు. 

స్టేషనరీ స్టోరులో, డాక్టర్ ఆఫీసులో, గ్లాసు ఫ్యాక్టరీలో, షాండ్లియర్ షాపులో, ప్రింటింగ్ ప్లాంటులో..

అయినా అదంతా జీవితం ఇవ్వగలిగే అనుభవంగానే లెక్కించాడు.అసలంటూ బతక్కపోవడంకంటే అది మేలే కదా!
 
 ‘‘జీవితంలో ట్రాజెడీ ఒక భాగం. కానీ దాన్ని ఎదుర్కోవడానికి పుట్టిందే కామెడీ’’ అన్నాడు చాప్లిన్.

 కానీ ఆ కామెడీ ఎలా ఉండాలి? ‘‘నా బాధ ఒకరి నవ్వుకు కారణమైతే కావొచ్చుగాక, కానీ నా నవ్వుకు మాత్రం మరొకరి బాధ కారణం కారాదు’’. 

‘‘ఒక వృద్ధుడు అరటితొక్క మీద కాలువేసి జారి పడితే- దానికి మనం నవ్వం. అదే కొంచెం అతిశయంతో నడుస్తున్న వ్యక్తి పడితే మాత్రం నవ్వుతాం’’. 

ఇదీ చాప్లిన్ హాస్యం!  #PDSO

కానీ ఆయన సినిమా అంటే హాస్యమొక్కటేనా? నలుపు తెలుపు చిత్రాల్లోనే జీవితంలోని అన్ని రంగుల్నీ చూపించాడు.

నిశ్శబ్ద సినిమాల్లోనే జీవితపు అన్ని పార్శ్యాల్నీ వ్యాఖ్యానించాడు.
 
 బ్యాగీప్యాంటు, టైటుకోటు, పెద్ద తల, చిన్న టోపీ, వెలిసిపోయిన బట్టలు, అయినా హుందాతనాన్ని కాపాడుకునే యత్నంగా చేతికర్ర, చేసేది కామెడీయే అయినా సీరియస్‌నెస్ తేవడానికి చిన్నమీసాలు, పెద్దబూట్లు, పెంగ్విన్ లాంటి నడక... 

ఆయన నిజంగా దిమ్మరిగా గడిపినప్పుడు ఆదరణ లేదు; కానీ దిమ్మరి వేషానికి (ట్రాంప్) మాత్రం జేబుల్నిండా డబ్బులు కుక్కింది హాలీవుడ్.
 
పెట్టుబడిదారీ  వ్యవస్థ చేసే దోపిడీని,అది సృష్టించే నిరుద్యోగాన్ని,పేదరికాన్ని,దారిద్య్రాన్ని.." మోడర్న్ టైమ్స్," లో చూపితే...

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో (1940) తీసిన "ద గ్రేట్ డిక్టేటర్‍"లో చాప్లిన్ హిట్లర్‍ను,ఫాసిజాన్నీ అద్భుతంగా సెటైర్ చేశాడు. 

కాని కేవలం సెటై‍ర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుడిని విముక్తుడిని చేయగలగేది సమసమాజమేనని ఘంటాపథంగా చెప్తాడు. 

ఈ చిత్రంలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు.

 ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర. రెండవది ఒక సామాన్య క్షురకుని పాత్ర. 

ఇద్దరూ ఒకే పోలికలో వుంటారు. నియంతగా అందరు పొరబడిన క్షురకుని అధ్బుత ప్రసంగంతో చిత్రం ముగుస్తుంది. 

" మబ్బులు విడిపోతున్నాయి, మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు, చీకటి నుంచి విముక్తులమై మనం ఒక నవ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాము. 

అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు, దురాశను జయిస్తారు, పాశవికతను జయిస్తారు.

మానవుడి ఆత్మ రెక్కలు తొడుక్కుంది. 
ఎట్టకేలకు అతడు ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. 

ఒక ఆశల ఇంద్రధనుస్సులోనికి, 
ఒక కాంతివలయంలోకి,
ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు. 

ఆ భవిష్యత్తు నీది , నాది, మనందరిది....... " 

అని మహావేశంతో ప్రసంగం ముగిస్తాడు.

                           ******
1889 ఏప్రిల్ 16 న ఇంగ్లాండ్ లో జన్మించిన చాప్లిన్,1977 డిసెంబర్ 25 న స్విట్జర్లాండ్ లో మరణించాడు.చివరి వరకు పేద ప్రజలపక్షానే నిలిచిన చార్లీ చాప్లిన్ కు జోహార్లు అర్పిద్దామ్.💐💐💐

No comments:

Post a Comment