Thursday, May 23, 2024

పొగడ్తల మత్తు తలకెక్కి.

 *పొగడ్తల మత్తు తలకెక్కి.*
              

*వినే మాటల్లో కొన్ని పొగడ్తలు కూడా ఉంటాయి. పొగడ్తకు లొంగని వారు చాలా అరుదుగా ఉంటారు. అది మన బలహీనతయితే    దాని వల్ల  మనం నష్టపోతాం. సకాలంలో గుర్తించకపోతే దారుణంగా దెబ్బతింటాం.*

*కాకినోట్లో మాంసం ముక్కమీద కన్నేసిన నక్క ఒకటి "కాకిబావా, కాకిబావా నీవు చాలా బాగా పాడతావు గదా.. ఏదీ ఒక పాటపాడు” అంటే మురిసిపోయిన కాకి పాడడానికి నోరు తెరవగానే మాంసం ముక్క జారి కిందపడడం, నక్క దానిని నోట కరుచుకుని     వెళ్ళిపోవడం చిన్నప్పుడు కథల రూపంలో పిల్లలకు చెబు తుంటాం. అవి కాలక్షేపం కథలు కావు. జీవిత సత్యాలు.* 

*పొగడ్త మత్తు తలకెక్కితే విచక్షణ ఉండదు. చెయ్యకూడనివి చాలా చేస్తారు... తీరా అది గ్రహించేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.*

*ఈ విషయంలో మహాభారతంలో శల్యుడికి మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. నకుల సహదేవులకు మేనమామ.     కాబట్టి పాండవులకు మేనమామ.     కృష్ణ పరమాత్మతో సమానంగా రథ సారథ్యం చేయగల నేర్పరి.*

*కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు సహాయపడదామని బయల్దేరాడు.                 ఈ విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు మార్గమధ్యంలో   అద్భుత స్వాగత సన్నాహాలు చేసాడు. అది పాండవులే చేశారనుకున్నాడు శల్యుడు.*

*తీరా దుర్యోధనుడని తెలుసుకుని పిలిపించాడు.. అతని పొగడ్తలకు, మర్యాదలకు శల్యుడు మురిసి పోయి ఏం కావాలో కోరుకో... అన్నాడు.*

*“మీరు నా పక్షాన యుద్ధం చేయాలి" అన్నాడు దుర్యోధనుడు.*

*పొగడ్తల మత్తులో సరేనని శల్యుడు మాటిచ్చాడు.   అయినా ఒకసారి ధర్మారాజును చూసి వస్తా అని అటు వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు కూడా వేగుల ద్వారా అప్రమత్తమై ఉన్నాడు.*

*ధర్మరాజాదులు కూడా శల్యుడిని ఆకా శానికి ఎత్తేసారు, పొగడ్తలతో. “మీకేం కావాలో చెప్పండి తీర్చేస్తా" అని వారికీ మాటిచ్చాడు.*

*"అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహిస్తాడు కాబట్టి దుర్యోధనుడు నిన్ను కర్ణుడికి రథసారథ్యం చేయమంటాడు. నువ్వు రథం ఎక్కిన దగ్గరనుంచి అతనిని మానసికంగా హింసించు, నిందించు, అప్పడు బాణ ప్రయోగంలో ఏకాగ్రత కోల్పోతాడు. మేం అతనిని పడగొట్టేస్తాం!” అని పాండవులు అంటారు.*

*అంటే సరేనని శల్యుడు వారికీ మాటిచ్చాడు. కర్ణుడి చావుకు తానూ ఒక కారణమయ్యాడు.*

*ఇటువంటి అనుభవాలూ మనం నిత్యజీవితంలోనూ చూస్తూ ఉంటాం.*

*అటువంటి బలహీనతల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే కాదు... ఇతరులను కూడా కాపాడుతూ ఉండాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment