🚩🚩-"ఆదిభిక్షువు వాడినేది కోరేది...‼️
#శివుడిని ఆరాధించే సీతారామశాస్త్రి, కె.విశ్వనాథ్ గార్లు నిందించే "ఆదిభిక్షువు" పాట ఎందుకు చేశారని ఒకరు అడిగిన ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ "ఆదిభిక్షువు వాడినేది కోరేది" పాట అర్థం అంతరార్థం చెప్తూ సమాధానం రాసి, దాన్నొక యూట్యూబ్ వీడియో చేశాను గతంలో. ఆ విశ్లేషణనే మీతో పంచుకుందామని ఈ పోస్టు.
నిందాస్తుతిలో నింద తేలికగా బయటకు కనిపిస్తుంది. కానీ, స్తుతి కనిపించదు. అందువల్ల అలా మనం పొరబడతాం. నిజానికి ఆ పాట చాలా గొప్ప తాత్వికమైన అర్థంతో విలసిల్లే గీతం. ఉదాహరణకు దాని పల్లవి తీసుకుందాం:
ఆదిభిక్షువు వాడి నేది కోరేది
బూడిదిచ్చే వాడి నేది అడిగేది
ఏది కోరేది - వాడి నేది అడిగేది
సామాన్యమైన అర్థం ఏమిటి దీనికి - ఆ శివుడనే వాడే లోకంలో మొట్టమొదటి భిక్షువు. భిక్షపాత్ర పుచ్చుకుని వస్తాడు. అటువంటివాడిని మళ్ళీ మనం ఏం అడుగుతాం, ఆయనేమి ఇస్తాడని. పోనీ, ధైర్యం చేసి అడిగామా ఆయన ఇచ్చేదల్లా బూడిద అదే విభూది. అలాంటివాడిని అడిగీ ఏం ఉపయోగం. ఇంతే కదా మనకు పైపైన వింటే అనిపించేది.
ఐతే, కవిత్వంలో ఇది నిందాస్తుతి అన్న అలంకారం. భగవంతుడంటే ఎక్కడో ఆకాశంలో దూరంగా ఉన్నవాడు కాదు. మనవాడు, మనమధ్యనే ఉన్నవాడు - కాబట్టి సరదాగా మేలమాడుతూ, హాస్యం చేస్తూ, చెణుకులు వేస్తూ నిందిస్తున్నట్టుగా ఒక అర్థం ఉంటూ, అంతరార్థంలో మాత్రం అందుకు బదులుగా ఏదో గొప్ప తాత్త్వికార్థాన్ని తీసుకువచ్చి ఆ భగవత్ స్వరూపాన్ని పొగుడుతూ ఉండేలాంటి కవితా ప్రక్రియ. మన పూర్వ కవులు ఈ పద్ధతిలో తమ తమ ఇష్ట దైవాలను తిడుతున్నట్టుగా పొగుడుతూ అద్భుతమైన కవిత్వాన్ని రాశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అదే పద్ధతిని అనుసరించారు ఇక్కడ. కాబట్టి, ముందు చెప్పుకున్న అర్థానికి భిన్నంగా అంతరార్థం వెతకాల్సి ఉంటుంది మనం.
అలా వెతికేప్పుడు మనకు ఊతగా పనికివచ్చేది ఆయన వాడిన పదం. ఆదిభిక్షువు- అసలు శివుడు ఆదిభిక్షువు ఎలా అయ్యాడు అన్నదానికి పురాణాలు చెప్పేదేమంటే లోకమంతా దుర్భిక్షంతో జీవులు బ్రతికేందుకు మార్గం లేకపోతే లోకాలకు ఆహారాన్ని ఇచ్చి జవ జీవాలను కల్పించడానికి శివుడు భిక్షాపాత్ర ధరించి అమ్మవారి దగ్గరకు వెళ్ళి భిక్ష అర్థించాడు. ఆవిడ శాకంబరీదేవి రూపం ఎత్తి తన శరీరాన్నించే ఆహారాన్ని సృష్టించి ఆయనకు భిక్ష పెట్టినట్టుగా లోకాలకు తొలి భిక్ష పెట్టింది. ఆ దయామయి అయిన దేవీ స్వరూపాన్నే మనం అన్నపూర్ణ అంటాం. అంటే శివుడు ఆది భిక్షువు అయింది ఆయన తెచ్చుకు తినడానికి కాదు, మనకు అన్నం పెట్టడానికి, లోకాలకు జవజీవాలను కల్పించి క్షేమాన్ని ప్రసాదించడానికి. ఇప్పుడు కవి అనేదేమిటో చూద్దాం. ఆదిభిక్షువు వాడినేది కోరేది. అంటే ఆయన నీతో పాటుగా లోకానికంతటికీ జీవాన్ని ప్రసాదించడానికి భిక్షువుగా మారిన ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళి, ఆయనకేదో తెలియదన్నట్టు ఓ బుల్లి భిక్షాపాత్ర పెట్టుకుని నాకు ఈ కష్టం తీర్చు, ఈ సుఖం ఇవ్వు అని చిన్నా చితకా అడుగుతున్నావా? ఎంత హాస్యాస్పదంగా ఉందో చూశావా? అని.
శివుడిచ్చే బూడిద గురించి చూద్దాం. లోకంలో ఏదైనా వస్తువు నాశనమైతే అయ్యే చివరి దశ బూడిద, అదే విభూది. ఆ రూపాన్నీ, ఈ రూపాన్నీ ధరించి ధరించి అలసిపోయిన జీవులకు ఆఖరున లభించే మోక్షానికి అది సంకేతం. శివుడు జ్ఞానాన్నీ, వైరాగ్యాన్నీ, అంతవరకూ దేనికి సాక్షాత్తూ మోక్షాన్నే ప్రసాదించగల దక్షిణామూర్తి. అలా మోక్షమనే విభూదిని ప్రసాదించేవాడి దగ్గరకు వెళ్ళి చిన్న చిన్న కోరికలు కోరడమేమిటయ్యా? అదే ఇవ్వగలిగినవాడు ఇది ఇవ్వడా? అదే ఇచ్చేవాడిని ఈ బుల్లిబుల్లి కోర్కెలు అడిగి మన కొంచెం బుద్ధి చూపించుకోవాలా? అని అంతరార్థం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ అన్నట్టుగా శూన్యానికి సంకేతంలా కనిపించే ఆ భస్మమే విశ్వంలోని సమస్త సంపదకీ ప్రతిరూపం కూడాను.
No comments:
Post a Comment