Thursday, May 23, 2024

****వంట గది..ఆప్యాయతలు.‼️

 🚩🚩-వంట గది..ఆప్యాయతలు.‼️

*కొనే్నళ్ళ క్రితం అంటే నలభై, యాభై సంవత్సరాల
క్రితం గ్యాసు పొయ్యిలు, కరంట్
పొయ్యిలు ఎక్కడివి? 
*కట్టెలు, బొగ్గులు లేదా
ఊకతోచేసిన పొయ్యిల మీద వంట చేసేవారు.
కళాయి
పూసిన ఇత్తడి పాత్రలు వాడేవారు.
(ఇపుడు ఇత్తడి అంటే ఇరవై
ఆమడలు పారిపోతున్నారు అతివలు). ఉచితంగా
ఇచ్చినా ఇత్తడి
గిన్నెలు తీసుకోవట్లేదు ఎవరు కూడా. అప్పటి
వంటిల్లు మట్టి గోడలతో ఉండేది. రోజూ రాత్రి
పడుకునేముందు గృహిణులు వంటిల్లు శుభ్రం చేసి,
పొయ్యిలో బూడిదంతా తీసేసి పడుకునేవాళ్లు.
ప్రతి గురువారం రాత్రి పేడతో గోడలు అలికి
ముగ్గులుపెట్టి శుక్రవారం ప్రత్యేకంగా వంట
ప్రారంభించేవాళ్లు. ఇప్పట్లా భోజనాలు బెడ్
రూముల్లోనో, టీవీ చూస్తూనో తినేవాళ్లు కాదు.
వంటింట్లో లేదా మరో పెద్ద గదిలో విస్తరాకులు కాని
అరిటాకులు వేసి నేలమీదే కుటుంబ
సభ్యులందరూ ఒకే వరుసలో కూర్చుని
తినేవాళ్లు మగవాళ్లైనా, ఆడవాళ్లైనా. అప్పుడే
కష్టసుఖాలు మాట్లాడుకునేది. ఆ రోజుల్లో
ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కాబట్టి
పిల్లలుకూడా ఎక్కువగా ఉండేవారు.
అందరూ తినడానికి కూర్చుంటే
పోట్లాడుకుంటూ సరిగ్గా తినరని అమ్మకాని,
బామ్మగాని పెద్దపళ్లెంలో అన్నం పెట్టి వేడి వేడి
నెయ్యి వేస్తూ, పిల్లలందరినీ
చుట్టూ కూర్చోబెట్టి పప్పన్నం, చారన్నం,
కూరన్నం చివరలో
పెరుగన్నం అంటూ ముద్దలు కలిపి పెట్టేది.
చిన్నపిల్లలకైతే నోట్లో, పెద్దపిల్లలకైతే చేతిలో పెట్టేది.
ఇలా తినిపిస్తూనే పసివాళ్లకు ఎన్నో కథలు కూడా
అమ్మ చెప్పేది కదా! పిల్లలు ఆసక్తిగా కథ వింటూ,
పోటీపడుతూ తినేసి ఆటలకు పరిగెత్తేవాళ్ళు.
ఇప్పట్లా పిల్లలు తినడానికి సతాయించేవారు కాదు.
అప్పుడు ఎవరింట్లోనూ ఫ్రిజ్ లేదు, కాబట్టి
రోజూ వండుకోవాల్సిందే. తాజా పచ్చళ్ళు,
ఊరగాయలు, అప్పడాలు, పండగలొస్తే తప్పనిసరిగా
చేసే పులిహోర, పాయసం ఉండేవి.
ప్రతి పండక్కీ పలు రకాల పిండి వంటలు,
ప్రసాదాలు బోలెడు ఉండేవి. తినేటప్పుడుకూడా
కొన్ని నిబంధనలు ఉండేవి. ఏదైనా చెప్పగానే
ఎందుకు? అని ఎదురు మాట్లాడకుండా
పాటించేవాళ్లు అందరూ భోజనం చేసేటప్పుడు ఎడమ
చేతిని నేలపై ఉంచడం తప్పని, కంచాన్ని చేతిలో
పెట్టుకుని తినడం కూడా తప్పని చెప్పేవారు. తినే
పదార్థాలను ఎడమ చేత్తో తాకడం అనాచారమని
చెప్పేవారు పెద్దలు. తినేటపుడు తుమ్ము వస్తే
పళ్లెం కింద కొన్ని నీళ్లుపోయాలి అనేది ఇంకో
నియమం. అలాగే విస్తరాకులో కాని అరిటాకులో కాని
వడ్డించేటపుడు ప్రతి పదార్థాన్ని ఒక వరుస
క్రమంలో వడ్డించాలి. పచ్చడి నుండి మొదలుపెట్టి
చివరగా అన్నం, నెయ్యి వడ్డించేవారు. అన్ని
పదార్థాలు వడ్డించేవరకు ఎవ్వరూ భోజనం మొదలెట్టకూడదు.
భోజనం ముగిశాక కొంపలు మునిపోయినట్టు లేచి
వెళ్లిపోకూడదు.
మరికొందరు తినేవరకు కూర్చోవాలి. ఇది ఒక
క్రమశిక్షణలాంటిది.
వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా
చాలా ముఖ్యమైన పనే. స్థిమితంగా కూర్చుని
ఒకరు వడ్డిస్తే భోజనం చేయడంలో తేడా
ఉంటుంది. వడ్డించేవారు ఆప్యాయతతో, ప్రేమతో
కావలసినంత వడ్డించడం, మరికొంచెం వేసుకోండి
ఫర్లేదు అని మారు వడ్డన చేయడం ఒక
ప్రత్యేకమైన కళ, ఇంత ఆప్యాయంగా వడ్డిస్తే
ఎంత మొహమాటస్తుడైనా మరికొంచెం వడ్డించుకోక
తప్పదు. అలాగే, వడ్డించేటప్పుడు అవతలి
వ్యక్తి ఎవరు, ఏమిటి, వారి హోదా, దర్జా ఇవన్నీ
దృష్టిలో ఉంచుకొని వడ్డించడం మహాపాపం.
ప్రతివారికీ సమభావంతో వడ్డించడం అనేది
ముఖ్యమైన విషయం. సహజ సిద్ధంగా ఓర్పు,
సున్నితత్వం, లాలన లాంటి లక్షణాలు కలిగిన
 స్త్రీయే ఇందుకు సమర్థురాలని తలచే
పెద్దలు ఈ మహత్తరమైన బాధ్యతని
అప్పగించారేమో! అన్నం ప్రాణుల జీవాధారం. కోటి
విద్యలు కూటి కొరకే. ఆనాటినుండి ఈనాటివరకు ఏ
మనిషైనా పొద్దుటినుండి రాత్రివరకు గానుగెద్దులా
కష్టపడేది పట్టెడన్నం కోసమేకదా..!
ఎంత బిజీగా ఉన్నా కుటుంబ
సభ్యులందరూ రోజులో ఒక్కసారన్నా కలిసి
మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తే అదివారి మధ్య
అనుబంధాన్ని మరింత పెంచుతుంది.♥️

No comments:

Post a Comment