ఓ మనిషీ!!! ఎందుకురా నీకింత పొగరు?-
*(ప్రకృతి ఆక్రోశం)*
******///**********************///***
ప్రకృతికి తెగ చిరాగ్గా వుంది .
అనంత విశ్వంలో భూమి అనేది ఒక అణువు .
కానీ ఈమధ్యన అక్కడ తన పద్ధతి ప్రకారం ఏదీ జరగటం లేదు.
అక్కడ వున్న ప్రాణులన్నింటి నుండీ ఒకటే ఫిర్యాదులు. ప్రతి ఫిర్యాదూ ఒక్కడి పైనే,
వాడే 'మనిషి'.
భూమిని సర్వ నాశనం చేస్తున్నది వాడే, మిగిలిన ప్రాణులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నదీ మనిషే! కొన్నిరోజులకైనా మారక పోతాడా ? ఆని చూసి చూసి విసుగెత్తి మనిషి తో మాట్లాడాలి అని అనుకున్నది. ఇక మారడు అని నిశ్చయించుకొని ఎలాగైనా మనిషిలో మార్పు తేవాలి అని మాట్లాడాలని ప్రయత్నిస్తున్నది.
మనిషి వల్ల ప్రకృతి ఎలా నాశనం అయిపోయిందో,చూసి తనలోని ఆగ్రహం కట్టలు తెంచు కుంటుంది.
అన్ని ప్రాణులూ బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంటాయి, ఒక్క మనిషి మాత్రం అంతా తనకే తెలుసు అన్నట్టు విర్రవీగుతావున్నాడు. ఇంతకీ వీడికేందుకు ఇంత పొగరో కనుక్కోంధాం అని, వొక వూళ్ళో తనే మేధావి అని మనసా వాచా నమ్మే ఒక మూర్ఖుడు వుంటాడు, వాడి దగ్గరికి వెళ్లి సంభాషణ మొదలుపెడుతుంది.
ప్రకృతి: "ఏరా ఎలా వున్నావు?"
మనిషి : "నాకేం, చాలా బాగున్నాను"
ప్రకృతి : "ఎలా వున్న భూమిని ఎలా చేసావురా వెధవా"
మనిషి: "నేనేం తప్పు చేసాను? నేను చేసిందంతా అభివృద్ధి.
ప్రకృతి: "అబ్బో, దీన్ని అభివృద్ధి అంటార్రా?" అని ఫేడేల్ మని మూతి పైన ఒక్కటి ఇచ్చింది
మనిషి: "నన్నే కొడ్తావా, నీ అంతుచూస్తా" అని రంకేలేసాడు
ప్రకృతి: "చ్చి, చ్చీ నోర్మూసుకొని కూర్చోరా" , అని గదమాయించేటప్పటికి, నోరు మూసుకున్నాడు. "అసలు నీకెందుకురా ఇంత పొగరు?"అని అడిగింది
మనిషి: "నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఎక్కువ, అన్ని ప్రాణులకన్నా నాకు తెలివి ఎక్కువ, అందుకే"
ప్రకృతి : "సరే, అది ఏమో నేనూ కూడా తెలుసుకుంటాను. నీకు సంబంధించిన కొన్ని సులభమైన ప్రశ్నలు వేస్తాను, నీకున్న అపారమైన జ్ఞానాన్ని ఉపయోగించి సమాధానాలు చెప్పు" అని అంది
మనిషి: సంతోషంగా "సరే" అన్నాడు
ప్రకృతి : "నీవు ఎప్పడు పుడతావో నీకు తెలుసా?"
మనిషి: "తెలియదు"
ప్రకృతి: "నీవు ఎవరికి పుడతావో నీకు తెలుసా?"
మనిషి: "తెలియదు"
ప్రకృతి : "ఎప్పుడు చస్తావో నీకు తెలుసా?"
మనిషి: "తెలియదు"
ప్రకృతి: "నీవు చేస్తున్న పనికి ఖచ్హితంగా ఇదే ఫలితం వస్తుంది అని చెప్పగలవా?"
మనిషి: "లేదు"
ప్రకృతి: "పోనీ, రేపు ఏమి జరుగుతుందో నీకు తెలుసా?"
మనిషి: "తెలియదు"
ప్రకృతి: "పోనీ మరుక్షణం ఏమి జరుగుతుందో నీకు తెలుసా?"
మనిషి: "తెలియదు"
ప్రకృతి ఒక దుడ్డుకర్ర తీసుకొని మనిషిని చితకబాదింది. "ఇదేరా మరుక్షణం జరిగేది" అని అరిచింది.
మనిషి: "చూడూ నీవు నన్ను అవమానపరుస్తున్నావు, నేను చదువుకున్నాను, నా దగ్గర చాలా పట్టాలు వున్నాయి , అందులోనుంచి ఏమైనా అడుగు నేను చెప్తాను" అని అన్నాడు
ప్రకృతి : "అబ్బో అదొకటి వుందా? సరే నీకు అర్థం అయ్యేలాంటి ప్రశ్నలే వేస్తాను. ఈ భూమి పైన నీతోపాటు నివసిస్తున్న ప్రాణులు ఎన్ని రకాలు?"
మనిషి: "తెలియదు"
ప్రకృతి: పోనీ, నీవు మనుషులతో కాకుండా వేరే ప్రాణులతో మాట్లాడగాలవా?
మనిషి: "లేదు"
ప్రకృతి: "సరే వొక చిన్న ప్రశ్న వేస్తా, నీకు అత్యంత ఇష్టమైన కుక్కతో ఎప్పుడైనా భౌ భౌ అని దాని భాషలో మాట్లాడేకి కనీసం ప్రయత్నం చేసావా? ఎంతసేపూ నీ భాష దానిపైన రుద్ధడమే కానీ దాని భాష కనీసం నేర్చుకున్నావా?"
మనిషి: "లేదు"
ప్రకృతి: "అంటే , కుక్క కూడా నీకంటే తెలివైనది. ఎందుకంటే దానికి కుక్క భాష, మనిషి భాష రెండూ వస్తుంది.ఇంకా నిన్నేమిరా అడిగేది", అని మళ్ళీ రెండు పీకింది
మనిషి: "నీవు నన్ను చాలా అవమాన పరుస్తునావు, నా దగ్గర చాలా డబ్బు వుంది" అన్నాడు ఉక్రోషంగా
ప్రకృతి : పగలబడి నవ్వుతూ "ఇప్పుడు విషయానికి వచ్చావురా మూర్ఖుడా" అని
"నీ డబ్బుతో ఏమేమి చెయ్యొచ్చో చెప్పరా?"అని అడిగింది
మనిషి: కులాసాగా "డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చు, ధనమూలం మిధం జగత్" అన్నాడు
ప్రకృతి: "ఎలాగేలగా మీ ధనం లేకపోతే మా జగత్తే లేదా?"అని నవ్వింది
మనిషి: గర్వంగా "అవును" అని అన్నాడు
ప్రకృతి : "సరే ఒక్కరోజు నేను నీకు ఇస్తున్న గాలి, వెలుతురు, నీరు, విద్యుత్, ఇంధనం, తిండి అన్ని నిలిపెస్తాను నీవు నీ డబ్బుతో బతకగలవా?"
మనిషి: "లేదు లేదు అలా చెయ్యవొద్ధు, నన్ను క్షమించు" అని కాళ్ళ బేరానికి వచ్చాడు .
ప్రకృతి : "మరి డబ్బు డబ్బు డబ్బు అని విర్రవీగుతున్నావు కదరా అయోగ్యుడా" అని దుడ్డు కర్ర తీసుకొని మళ్ళీ చితక్కొట్టింది.
మనిషి: తప్పు అయిపోయింది నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో చెప్పు అని వేడుకున్నాడు
ప్రకృతి: "నీ నీచ బుద్ధులవల్ల భూమిపైన వేరే ప్రాణులు ఏదీ సుఖంగా బతకటం లెదు . నావరకు నీవుకూడా ఒక ప్రాణితో సమానం అంతే. నీలోని స్వార్థాన్ని వదిలెయ్యి . ఈ భూమి నీ ఒక్కడిదే కాదు. నీతో పాటు బ్రతుకుతున్న ప్రాణులన్నిటికీ దీనిపైన సమానమైన హక్కు వుంది. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో! ఈ భూమి మీద బతకడానికి నీకెంత హక్కు ఉన్నదో !అన్ని ప్రాణులకు అలాగే ఉంది. ఇప్పటికైనా మారు. మారకపోతే త్వరలో నీవు అనుకున్న సంపదలు, ఈ భూమి అంతా సర్వ నాశనం అయిపోతుంది. అన్యాయం,అక్రమం, దౌర్జన్యం హింస వల్ల కోటానుకోట్ల ధనము కూడబెట్టినా నీచావును ఆపలేవు! చచ్చేటప్పుడు ఏమి తీసుకు పోవు. పరిస్థితులు చేతులు దాటేస్తున్నాయి. వెళ్లేముందు ఇంకోవిషయం సకల ప్రాణులకు అవసరమైన నీటిని భూమిని,
వాతావరణాన్ని మొత్తం కలుషితం చేస్తున్నావు.
ఈ భూమిపై ప్లాస్టిక్ పొరలు పొరలుగా ఉండి భూమి శోషించుకునే స్థాయికన్నా పరిశ్రమలు స్థాపించావు. ఒకే చోట వందలాది పరిశ్రమలు ఉన్నవి. చెట్లను కొట్టివేస్తూ వర్షాలు లేకుండా చేస్తున్నావ్. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి.
పరిశ్రమల యొక్క గాలి,వ్యర్థ జలాలు భూమిని, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. మతాల పేరుతో మానవ మారణ హోమం చేస్తున్నావు. ఇప్పటికే తిండి కల్తీ,గాలి కల్తీ,నీరు కల్తీ అయింది.నీకు,నీవే మరణశాసనం రాసుకుంటున్నావు. నీవు తవ్వుకున్న గోతిలో నీవే పడతావు జాగ్రత్త!!!
ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో, ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలో ప్రకృతి సూత్రాలను ఎలా పాటించాలో నేర్చుకో, అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే,నీ అంత దరిద్రుడు ఈ సృష్టి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకడు. జాగ్రత్త." అని చెప్పి మాయం అయిపోయింది.
విని విననట్టున్న మానవుడు లేచి, బట్టలు దులుపుకొని, మళ్ళీ మామూలుగా తన దారిలో తాను పోయాడు. వాడు మారడు.
ఎందుకంటే వాడు "మనిషి". గనక.
-----------అడియాల శంకర్.
No comments:
Post a Comment