సమాజం లో కొంతమంది, బతుకు తెరువు కోసం, దొరికిన ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారు. దానిలో వారికి సంతృప్తి ఉండదు. ఇంతకుమించిన ఉద్యోగం, చెయ్యాలనే, చెయ్యగలనని తాపత్రయపడుతూ, దీర్ఘాలోచన చేస్తూ, నిరుత్సాహంగా ఉండడంతో, చేస్తున్న పనిలో శ్రద్ధ చూపలేకపోవడం వల్ల, చేస్తున్న ఉద్యోగం కూడా, పోగొట్టుకునే పరిస్థితి దాపురించి, రోడ్డున పడే అవకాశం ఉంది....... మరికొందరు ఏదో వ్యాపారం ప్రారంభించి, మొదట్లోనే ఎంతెంతో లాభాలు గడించాలనే ధోరణిలో, అది నెరవేరక, నిరుత్సాహానికి గురై, ఆ వ్యాపారాన్ని అలసత్వం చేసి, నష్టాల ఊబిలో కూరుకుపోతారు. నిరంతరం కృషితో, రోజురోజుకీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం, వీరిలో మచ్చుకైనా కనిపించదు..... చేస్తున్న పనిలో మమేకమై, ఏవిధమైన నిరుత్సాహానికి గురికాకుండా, పాజిటివ్ దృక్పథం తో, సదరు పనిలో పరిపూర్ణంగా కేంద్రీకృతం చేస్తే, విజయం తప్పకుండా లభిస్తుంది.... అలాగే మనం ప్రేమిస్తూ, ఆప్యాయత అనురాగాలు పంచే వ్యక్తి, మనతో ఉన్నా, వారిని అసలు పట్టించుకోం. సదరు వ్యక్తి మనకు దూరమైన రోజున, వారి విలువ తెలుసుకుని, పశ్చాత్తాపపడి, వారి ప్రేమ కోసం వెంపర్లాడటం గమనార్హం..... మనకు కళ్ళున్నంత వరకు, మన ఆలోచనా దృక్పథం లోని అంధత్వం వల్ల, కనిపించే వాటిని కూడా గుర్తించలేం. దాని వల్ల కళ్ళున్నా, ప్రయోజనం శూన్యం. వివేకం తో, ఉన్నది ఉన్నట్లుగా చూడటం, వాటిపై శ్రద్ధ పెట్టడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే జీవిత గమనం ఉల్లాసభరితంగా సాగి, సార్థకమవుతుంది........ పోలిన రామకృష్ణ భగవాన్.... రాజమండ్రి.
No comments:
Post a Comment