"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - ప్రశ్నోపనిషత్తు - 06వ భాగము.
ఐదవ ప్రశ్నగా సత్యకాముడు బ్రహ్మవేత్తయైన పిప్పలాదునుద్దేశించి, గురుదేవా! మరణించేవరకు ఓంకారాన్ని ధ్యానంచేసే జీవుడు ఏయే లోకాలను పొందుతాడు? అని ప్రశ్నించేడు.
అందుకు పిప్పలాద మహర్షి, ఋషులారా! బ్రహ్మము రెండు రకాలుగా వ్యక్తమౌతోంది. ఒకటి పరము, రెండవది అపరము. పరము అంటే నిర్గుణ, నిరాకార, నిరంజన తత్వాలతో కూడిన బ్రహ్మము. ఇది సచ్చిదానంద స్వరూపంగా వ్యక్తమౌతోంది. అపరము అంటే సగుణ, సాకారాలతో (గుణ, రూపాలతో) వ్యక్తమయ్యే బ్రహ్మము. ఓంకారాన్ని, జీవుడు ఏ రీతిలో ధ్యానిస్తాడో ఆ రీతిలో ఈ రెండింటిలో ఎదో ఒక స్థితిని పొందుతాడు.
ఓంకారంలో "అకార, ఉకార, మకార (అ + ఉ + మ)" అనే మూడు మాత్రలున్నాయి. వీటిలో మొదటి ఒక మాత్రను (అ కారాన్ని) జీవితాంతము ధ్యానించువాడు మానవునిగా జన్మించి బ్రహ్మచర్యము, శ్రద్ధ, తపస్సు ఆచరించి మహిమను పొందుతాడు.
మొదటి రెండు మాత్రలను అ కార, ఉ కారాలను (అ + ఉ) కలిపి జీవితాంతము ధ్యానించువాడు, యజస్సుల ద్వారా ఉత్తమ లోకాన్ని పొంది, కొంత సుఖమును అనుభవించి తిరిగి మానవలోకంలో జన్మిస్తాడు.
మొత్తం మూడు మాత్రలను కలిపి "ఓమ్" అనే ప్రణవాన్ని జీవితాంతం ధ్యానించువాడు, పాము తన పొరలను విడిచిపెట్టునట్లు, తన పాపములన్నింటిని విడిచిపెట్టి, సామముల ద్వారా బ్రహ్మమును పొంది, తనలో నెలకొన్న పరమాత్మను గ్రహిస్తాడు. ఆ జీవునికి మరుజన్మ వుండదు.
ఓంకారాన్ని విడివిడిగా కాకుండా, ఒకే పదంగా జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలలో నిర్విరామంగా ఉపాసించువాడు స్థితప్రజ్ఞుడవుతాడు. సులువుగా చెప్పాలంటే ఆ మూడు అక్షరముల తత్వాన్ని (సృష్టి, స్థితి, లయ తత్వాన్ని) గ్రహించి, తదనుగుణంగా సాధన చేయువాడు ఆత్మానుభూతిని పొందుతాడని అర్ధము.
ఆరవ ప్రశ్నతో, వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻
No comments:
Post a Comment