Friday, June 14, 2024

 *"జీవనగీత" (నిత్యజీవితంలో భగవద్గీత)* 
*16.భాగము.* 

శ్రీకృష్ణుని ఉపదేశమంతా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆలకించిన పార్థునికి, శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మగా గోచరించేడు. తనకు అత్యంత ఆప్తుడైన అతని విభూతిని ప్రత్యక్షంగా చూడాలన్న కొరిక కలిగింది.
వెంటనే అర్జునుడు, హే కృష్ణపరమాత్మ! తొలిసారిగా నీ ద్వారా నీ విభూతులను విన్న నాకు, విశ్వవ్యాపకమైన నీ దివ్యస్వరూపాన్ని ఒక్కసారి దర్శించే యోగ్యతను ప్రసాదించమని భక్తితో వేడుకున్నాడు.
తన సృష్టిలో తనతో సమానంగా సృష్టించిన, దివ్యాత్మ స్వరూపులైన మానవుల యొక్క ప్రతినిధియైన అర్జునుని కోరికను మన్నించి, తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము తన విశ్వరూపాన్ని ప్రదర్శించుటకు పరమాత్మయైన శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు.
అర్జునా! ప్రతి మానవుడు నా విశ్వరూపాన్ని దర్శించే యోగ్యత కలవాడే కానీ ఆ రూపాన్ని ఈ చర్మ చక్షువులు (తోలు కళ్ళు) చూడలేవు. అందుకు జ్ఞాన చక్షువు (జ్ఞాన నేత్రము) కావాలి. అవి పొందాలంటే, అన్నింటా నన్ను దర్శించే స్థితికి రావాలి. కారణం ఈ భౌతిక ప్రపంచంలోనే కొన్ని సూక్ష్మ వస్తువులను చూడలేని జీవుని కళ్ళు, అతి సూక్ష్మాతిస్మూక్ష్మ మైన నా విభూతిని అస్సలు చూడలేవు.
సత్యశోధనతో, తత్వసాధనతో ఆత్మజ్ఞానం పొందినవారికి ఈ జ్ఞాననేత్రము తనంతట తానే విచ్చుకుంటుంది. కావలసిందల్లా పరమాత్మ యెడ అనన్యమైన భక్తి. నా ప్రియ స్నేహితునిగా నీకు ఆ దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను, తనివితీరా గాంచుమని శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించేడు.
లెక్కకు సాధ్యపడని అనేకానేక రూపములు కలిగిన ముఖములతో, బాహువులతో, నేత్రములతో, పరమాణువు నుంచి అతిపెద్ద గోళములవరకు, కోటిసూర్యుల కాంతితో దేదీప్యమానంగా వెలుగుతున్న అఖండమైన చైతన్యశక్తిని ఎంతో సుస్పష్టంగా ఆ విశ్వరూపంలో గాంచేడు పార్ధుడు. ఆ విశ్వరూపము యొక్క ఉఛ్వాసనిశ్వాస ప్రక్రియలో ఎన్నో కోట్లకొలది జడజీవ పదార్ధములు బయటకు రావడం, తిరిగి అందులో లీనమవడం జరుగుతోంది. ఆ దివ్యరూపం యొక్క మొదలుగాని, మధ్యగాని, తుదిగాని తెలియడం లేదు. అసంఖ్యాకములైన హస్తములు వివిధ ఆయుధములు ధరించియున్నవి. వక్ష స్థలమంతయు రుద్రులు, ఆదిత్యులు, వసువులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులతో నిండియున్నది, ఉదరమున అనేక నక్షత్రమండలములు గోచరించుచున్నవి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఆ విశ్వరూపమును ఆవహించివున్నవి. అమితమైన ఆశ్చర్యముతో ఆనందముతో, భయముతో క్షణకాలంపాటు ఆ విశ్వరూపమును సందర్శించిన అర్జునుడు, కనులనుండి ఆనందబాష్పములు జాలువార, చేతులు జోడించి శ్రీకృష్ణుని పాదాక్రాంతుడయ్యెను.
విశ్వరూపమును ఉపసంహరించిన శ్రీకృష్ణుడు మందహాసముతో పార్ధునుద్దేశించి, అర్జునా! నీవు గాంచిన ఈ విశ్వరూపము వేదాధ్యయనమువలనగాని, యజ్ఞయాగాదిక్రతువులవలనగాని, కఠిన తపస్సులవలనగాని, దానధర్మములవలనగాని సిద్ధింపదు. నాయందు అనన్యభక్తి గలవారికి మాత్రమే ఈ విశ్వరూపసందర్శన భాగ్యము లభించి, తుదకు నాలో ఐక్యమయ్యెదరు. కావున నీవు అనన్యభక్తితో నాకు ప్రీతిపాత్రుడవు కమ్ము. నీ యోగక్షేమములకు నేను బాధ్యత వహించెదనని అభయమిచ్చెను.

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*

No comments:

Post a Comment