Sunday, June 30, 2024

 *శ్రీరమణీయభాగవత కథలు- 17*
( బాపు-రమణ )

జరిగిన కథ:
అమృతాన్ని రాక్షసులు పాతాళానికి తీసుకెళ్తారు. నాకు ముందు అంటే నాకు ముందని పోట్లాడికుంటుంటే, *మోహినీ అవతారం* లోని శ్రీ మహావిష్ణువు రంగప్రవేశం చేస్తాడు.

ఇక చదవండి
******
మోహిని:
మా అన్నయ్య ధన్వంతరి. ఇక నేను వారి కొరకై
అమృతము ప్రసాదించెదను గాక! అని గొప్పలు చెప్పగా నేను వారనేక దివ్య ఓషధులు వేసి చిలికినందువలన గదా ఈ అమృతము వచ్చినది! నా గొప్ప ఏమున్నది' అని నిలదీశాను.

అందరూ ఘొల్లున నవ్వారు.

మోహిని:
అందుకే నామీద కోపం వచ్చి వుంటుంది. స్వయంవరం జరపకుండా ఎక్కడో దాంకొని ఏడిపిస్తున్నాడు. నాకు చాలా దుఃఖంగా వుంది. చచ్చిపోదామంటే ఇందాకే అమృతం తాగేశాను. చావుకూడా రాదుకదా!

రాక్ష:
నిజమా? ఈ మందు నిజంగా పని చేస్తుందా?

నువు తాగావు కదా పని చేసిందా మరి? ఎలా తెలుసు?

మోహని వాడి వైపు కోపంగా చూసింది. తటాలున వాడి చేతిలోని కత్తి లాక్కుని పాడుచుకుంది. మెడ కోసుకుంది. అంతా అదిరి పడి చూశారు, 

మోహిని లక్షణంగా వుంది. చెక్కు చెదర లేదు. విరక్తిగా కత్తి వాడి మొలలో దోపింది. అందరూ భక్తితో చూశారు. కొందరు దణ్ణాలు కూడా పెట్టారు.

ఒకడు:
మోహినీ దేవీ! నువ్విటురావడం మా అదృష్టం.

మరొకడు:
అమృతం కోసం మేము కొట్టుకుంటున్నాం. ముందు ఒక తండ్రి ఇద్దరు తల్లుల బిడ్డలుగా పోరాడాం.

ఇంకొకడు: ఇపుడు ఒక్కమ్మ బిడ్డలుగా కూడా పొత్తు కుదరడం లేదు.

ఒకడు: నువ్వు మాకు అమృతం పంచు నీ యిష్టం వచ్చిన వాడిని వరించు.

మోహిని :ఇంతకీ మీరు దేవతలా దానవులా?

ఒకడు;
ఏం దానవులయితే పెళ్లాడవా? చంపేస్తాను.

మో:
(పకపకా నవ్వి) చావనుగా!

వాడు తెల్లబోతాడు - మిగతా వాళ్లు నవ్వుతారు

మో:
(కలశం పట్టుకున్న వాడికి తగుల్తూ) (గోముగా) దానవులయితేనే పెళ్లాడతాను. పైకి వచ్చే ముందు మా సముద్ర దేవతలు చెప్పారు. అమ్మా దేవతలను నమ్మకు. వారు వేదములూ అవి చదివేసి పైకి నవ్వునటించి తరువాత దగాచేయుదురు. దానవులు మాత్రం కల్లాకపటం లేనివారు. ముద్దోస్తే ముద్దు పెట్టుదురు; కోపము వచ్చిన ఫెడేలుమని కొట్టుదురు (అని ఒకడిలెంప వాయగొడుతుంది.) అని చెప్పారండి.

అంతా మురిసి పోయారు.

మంచిది! ఓ పని చేదాం మీరు కోరి నట్టే నేను అమృతం పంచుతాను. కానీ మీరంతా గట్టిగా కళ్లుమూసుకోవాలి. ఎందుకో చెప్తా.

అంటూ పొడుగు వాడిని ముట్టుకుంది. వాడు మంత్రముగ్ధుడిలా కలశం ఇచ్చేశాడు. వయ్యారంగా నడుమున వుంచుకుంది. రాక్షసులందరూ అనుకరిస్తూ తామూ వయ్యారంగా నడుములు వంచి చేతులు పెట్టుకున్నారు. ఎముకలు పటపట మన్నాయి.

మో:
మీ అందరికీ ప్రతి ఒక్కరికి వడ్డిస్తాను. కానీ మీరందరు- ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవరాదు.

అంతా ఆనందంతో తలలూపి నెత్తిన చేతులు పెట్టుకుని

అందరూ: ఉహూఁ!  ఒట్టు!

మేమ స్వయంవర పరీక్షలో ఒకొక్కరినీ చూసుకుంటూ వెడతాను. నచ్చక పోతే అమృతం పోసేస్తా అంటే- నచ్చని వాళ్లకే ముందు అంటే అమృతం దోసిట పోశానంటే నేను
వరించలేదన్నమాట!

అంతా అర్థమయినట్లు తలలూపారు.

మో:
నేను వరించలేదని కోపగించి అమృతం వద్దన కూడదు.

అంతా అబ్బే అన్నట్టు అడ్డంగా తల లూపారు..

అలా పంచి పంచి నాకు నచ్చిన వాడికే అమృతం వడ్డించను (సిగ్గు అభినయిస్తూ) ఆయనను భుజం తట్టి బుగ్గగిల్లి మేల్కొలుపుతాను. అప్పుడు ఆయన చేత అమృతం తాగిస్తాను అదే నా స్వయంవరం. అదే నాపెళ్లి,

రాక్షసులు ఎవరికి వారు తామే అన్నట్లు మురిసి పోతున్నారు.

మో:
(కంటనీరు పెట్టుకుని గద్గదంగా) దానవాగ్రణులారా! నేను పెళ్లాడబోయే ఆ ఒక్కడూ తప్ప మిగతా వారందరూ నా అన్నటి తలి దండ్రులే (దుఃఖంతో) ఆ ప్రేమతో నన్ను దీవించండి.

ఆమె దుఃఖం చూసి అందరికీ కంట నీరు తిరిగింది. పసిబిడ్డల్లా వెక్కివెక్కి ఏడ్చారు.

మో: (కష్టంగా) కళ్ళు తుడుచుకోండి.

అంతా కళ్లు తుడుచుకున్నారు.

మో:

కళ్లు మూసుకోండి. ఇహ తెరవకండి.

అంతా కళ్లు మూసుకున్నారు. తలలూపారు. మోహిని నిశ్శబ్దంగా నవ్వి అమృత భాండంతో మాయమైంది. స్వర్గంలో దేవతలంతా మోకరిల్లి కూచున్నారు అమృత కలశంతో మోహిని అమృతం పంచసాగింది.

*రాక్షసుల పాతాళ గుహ*
మసక వెలుతురు. దిగులుగా వుంది. నిశ్శబ్దం. రాక్షసులంతా కళ్లు మూసుకుని కూచున్నారు. అందెల రవళి- గాజుల చప్పుడు మాత్రం వినిపిస్తున్నాయి. అంతా తమలో తామే నవ్వుకుంటూ...

ఆహా! ఇంత సేపైంది

ఇంకా నా వంతు రాలేదు.

మిగతా అందరికీ ఇచ్చేస్తోంది.

నా ఒక్కడికే ఇవ్వలేదు.

నేనే వరుణ్ణి

నన్నే పెళ్లాడుతుంది.

నన్నే!

నన్నే!

రాహువుకి అనుమానం వచ్చింది. కళ్లు మూసుకునే చేత్తో తడిమి కుడివాడిని అడిగాడు...

రాహువు:
నీకిచ్చేసిందా?

ఒకడు:
లేదు. నీకు?

రాహు:
నీకు?

మరొకడు;
అబ్బే లేదు

రాహు :
(ఇంకోడితో) నీకు?

ఎదుటివాడు: నా వంతు అప్పుడే ఎక్కడ! ఇన్ని వేలమందికి ఇచ్చాక చివరికదా! రాహువుకి అనుమానం వచ్చింది. మెల్లగా ఓ కన్ను తెరచి చూశాడు. అంతా కూచుని వున్నారు. మోహిని కనబడలేదు. భయమేసి ఒక్కసారిగా రెండు కళ్లు తెరచి చూశాడు. అంతా లొట్టలువేస్తూ కళ్లుమూసుకుని కూచున్నారు. 

మోహిని లేదు. గ్రహించాడు. నెమ్మదిగా లేచి మాయమయ్యాడు. కేతువు కూడా మాయమై వెంటవెళ్లాడు.

ఇద్దరూ స్వర్గంలో రూపుదాల్చారు. మోహిని దేవతలకు అమృతం పోస్తోంది. ఇద్దరూ కామరూప విద్యతో కోరి దేవతల రూపం ధరించారు. నెమ్మదిగా దేవతల వరసలో కలిసిపోయారు. 

చంద్రుడు గమనించాడు. సూర్యునికి చెవిలో చెప్పి చూపించాడు. ఇద్దరూ కలసి మోహిని వంక చూశారు. మోహిని వారిని చూసింది. వారు ఆ వరసలో కూచున్న రాహుకేతువులను చూపించి నోట్లో వేళ్లు పెట్టుకుని కోరలు సూచిస్తూ రాక్షసులు అని తెలిసేలా సైగ చేశారు. 

మోహిని కన్నులర మోడ్చింది. నుదుటి తిలకం లోంచి సుదర్శనం వచ్చింది. రాహుకేతువులిద్దరూ పక్కవాడి దోసిట్లో చెయ్యి పెట్టి ఒక చుక్క నోటిలో వేసుకున్నారు. చక్రం వచ్చి వారి తలలు నరికింది. ఒక్క చుక్క అమృతం పొందడం వల్ల ఆ తలలు మాత్రం ప్రాణంతో వున్నాయి.

రాహు:
సూర్య చంద్రులారా! మా మొండెం చచ్చినా- తలమిగిలింది. మేము మిగిలాము. మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష వేసితీరతాము. కలకాలం అనుభవిస్తారు.

*పరీక్షిత్తు యాగశాల*

శుక: ఓ రాజా! ఆ రాహు కేతువులు నాటి నుంచి నేటికీ ఏటేటా సూర్య చంద్రులను నోట పట్టి విడుస్తూవుంటారు. 

అవే ఈ నాటి గ్రహణాలు. కాస్త అమృతాన్ని నోట పెట్టిన పుణ్యానికి వారి నోటి మాట పొల్లు పోకుండా శ్రీహరి వారిని ఇందుకు అనుమతించాడు. 

మోహినీ దేవిగా అవతరించిన విష్ణు భగవానుడు అందమే ఆయుధంగా నడిపిన మరొక
మధురమైన కథ విను.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

No comments:

Post a Comment