Friday, June 28, 2024

 *ప్రేమలేఖ - 6*
💌

రచన : పొత్తూరి విజయలక్ష్మి 

అనుకున్న ప్రకారం వర్జ్యం లేకుండా మంచి శకునం చూసుకుని బయల్దేరింది టాక్సీ. ముందు సీట్లో డ్రైవరు పక్కన సూర్యం, అతని పక్కనే కామేశ్వరి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా వున్నారు. వెనక సీట్లో ఓ చివరన పరంధామయ్య పొందూరు ఖద్దరు పంచె, తెల్లటి షర్టు, పైన జరీ ఉత్తరీయం - గంభీరంగా కూర్చుని ఆ వెళ్ళబోయే పెళ్ళి వారింట్లో ఎంత బెట్టుగా వుండాలో ప్లాను వేసుకుంటున్నాడు. ఆయన పక్కన మాణిక్యాంబ జానెడు వెడల్పు జరీ  అంచు చీర కట్టుకుంది. 'ఎలా ఉంటుందో ఆ పిల్ల? కట్నాలు, కానుకలూ పెద్దగా లేకపోయినా ఫరవాలేదు. పిల్ల చక్కగా, వినయంగా వుంటే చాలు' అనుకుంటూ కూర్చుంది.

రెండో చివర ఆనందరావు 'సోనీ సోనీ' అని మనసులోనే ఆక్రోశిస్తూ, అన్యమన స్కంగా 'భగవంతుడా! ఏవిటి నాకీ పరీక్ష' అనుకుంటూ పైకి ఏడవలేక లోపలే ఏడుస్తూ కూర్చున్నాడు. ముఖంలో కళా కాంతీ లేవు. మధ్య మధ్య సూర్యం వెనక్కి తిరిగి బావమరిదిని మాటల్లోకి దింపాలని ప్రయత్నం చేస్తున్నాడు. రెండు నిమిషాలకోసారి “ఏవిటా ఏడుపు మొహం? ఏదో నీ సొమ్మంతా పోయినట్లు బిక్కమొహం వేస్తావేం?” అంటూ పరంధామయ్య గదుముతున్నాడు. కానీ ఆనందరావులో ఏ మాత్రం మార్పు లేదు.

టాక్సీ గమ్యం చేరింది. పెళ్ళివారు గొప్ప వంశానికి చెందినవారు. పెళ్ళికొడుకు మంచి హోదాలో వున్నాడు. కాబట్టి అమ్మాయి ఇంట్లో ఏర్పాట్లు పాత కొత్తల మేలికలయికలా వున్నాయి. టాక్సీ ఆగగానే అందరూ పరుగున వచ్చి తీసుకువెళ్లారు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు అందించారు. లోపలికి తీసికెళ్ళి మగవాళ్ళందర్నీ హాల్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళను లోపలికి తీసుకెళ్ళారు.

కుశల ప్రశ్నలు, లోకాభిరామాయణం, రాజకీయ చర్చలు అనేకం సాగుతున్నా యి మగవారి మధ్య. పరంధామయ్య గారు బెట్టుగా ఏదో తూచి తూచి మాట్లాడుతూ వుంటే ఆనందరావు అసలు నోరెత్తడంలేదు. ఎక్కువ భాగం సూర్యమే మాట్లాడుతున్నాడు.

లోపల ఆడవాళ్ళు చీరలు, నగలు, పిండి వంటలు, ఆవకాయలు మొదలగు విషయాలు చర్చిస్తున్నారు. కాసేపయ్యాక కాఫీ, ఫలహారాలు ముగిశాక పెళ్ళి కూతుర్ని తీసుకువచ్చి మాణిక్యాంబగారి ఎదురుగుండా చాప మీద కూర్చోబెట్టారు. పొందికగా కూర్చుంది అమ్మాయి.

"నీ పేరేమిటమ్మా?" అని అడిగింది కామేశ్వరి.

"కమలకుమారి" అందా అమ్మాయి వినయంగా.

"ఏం చదువుకున్నావు?" అంది కామేశ్వరి.

“బి.ఏ. పాసయ్యాను”

“పాటలు వచ్చా?”

“రావండీ”

“మరి కుట్లూ... అల్లికలూ?”

"వచ్చు"

ఇక ఇంటర్వ్యూ అయిపోయింది. 'ఆడవాళ్ళిద్దరికీ అమ్మాయి నచ్చినట్టే. ముఖాలు ప్రసన్నంగానే వున్నాయి అనుకున్నారు అమ్మాయి వైపు వాళ్ళు. మరో రెండు నిమిషాలు గడిచాయి మౌనంగా.

"అమ్మాయిని ముందు గదిలోకి తీసుకెళ్ళండి. మగవాళ్ళు చూస్తారు" అంది మాణిక్యాంబ.

“లే... కమలా” అంటూ లేవదీసి చీర కుచ్చిళ్ళు సవరించి ముందు హాలులోకి నడిపించారు. చెమటలు పడుతున్న అరిచేతులతో మెల్లిగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది కమల. అప్పటిదాకా మాట్లాడుతున్న మాటలు ఆపేశారు అందరూ.

"నీ పేరేమిటి అమ్మాయ్?" అన్నారు పరంధామయ్యగారు.

"కమలకుమారి” అంది వినయంగా.

"ఏం చదువుకున్నావు?”

"బి.ఏ. పాసయ్యానండీ" అంది మరింత వినయంగా. మళ్ళీ ఇంటర్వ్యూ ముగిసింది. నిశ్శబ్దం, మెల్లిగా తలెత్తి పెళ్ళికొడుకుని చూసింది కమల. కొద్దిగా తల వంచుకుని కూర్చుని వున్నాడు. 'చాలా అందంగా వున్నాడు' అనుకుంది.

"అబ్బాయి ఏమైనా అడగాలంటే అడగమనండి" అన్నారు పెళ్ళికూతురు తండ్రి. చివాల్న తల ఎత్తి మావయ్య వంక చూశాడు ఆనందరావు. అప్పటి దాకా అతన్నే చూస్తున్న సూర్యం చిన్నగా నవ్వి తల తిప్పుకున్నాడు. పరంధామయ్య గారు కంఠం సవరించుకుని “వాడు ప్రత్యేకంగా అడిగేది ఏముంటుందిలెండి" అని చెప్పేసే లోపలే ఆనందరావు నోరు విప్పాడు.

"నేను ఆవిడతో ఒంటరిగా మాట్లాడతా ను" అన్నాడు.

పరంధామయ్యగారు కాల్చేసే లాగ చూశారు. సూర్యం అనుమానంగా, ఇబ్బందిగా చూశాడు. కమల సిగ్గుగా చూసింది. పెళ్ళికూతురి తండ్రి అభిమానంగా చూశాడు.

ఆనందరావు మాత్రం ఎవరినీ చూడలేదు. తలవంచుకుని తన కాళ్ళ వంక చూసుకున్నాడు.

పెళ్ళికూతురి తండ్రి లేచి “రండి” అంటూ పక్కనే వున్న మరో గదిలోకి దారి తీశాడు. అతని వెంటే వెళ్ళాడు ఆనందరావు.

“రామ్మా” అంటూ కూతుర్ని పిల్చాడు తండ్రి, వచ్చింది.

"వెళ్ళమ్మా! ధైర్యంగా సమాధానాలు చెప్పు” అని చెప్పి ఇవతలకి వచ్చి తన జాగాలో కూర్చున్నాడు.

ఇదంతా చూస్తున్న పరంధామయ్యకి ఒంటికి కొరివి కారం రాసుకున్నట్టుగా వుంది. కోపం పట్టలేక-

"ఏవిటో దిక్కుమాలిన రోజులు వచ్చాయి. పెళ్ళికి ముందే కూతుళ్ళకి చాలా స్వతంత్రాలు ఇచ్చేసి గదుల్లోకి పంపేస్తున్నారు" అన్నాడు కసిగా.

పెళ్ళికూతురి తండ్రికి ఒళ్ళు మండింది. కానీ బలవంతాన ఓర్పు వహించాడు. 'మంచి సంబంధం, అబ్బాయి బావున్నా డు. మంచి ఉద్యోగం. అన్నింటినీ మించి అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు. అంటే తొంభై పాళ్ళు కుదిరి పోయినట్లే. కాబట్టి కాస్త శాంతంగా వ్యవహారం నడుపుకుంటే పెళ్ళయ్యాక ఈయనని ఒక ఆట ఆడించవచ్చు' అనుకుని వూరుకున్నాడు.

గదిలో కమల కుర్చీలో కూర్చుంది. ఆనందరావు ఎదురుగా మరో కుర్చీలో కూర్చుని వున్నాడు. అతని చేతులు, కాళ్ళు వణికిపోతున్నాయి. చెమటలు పట్టేస్తున్నాయి. బుద్ధి తెలిశాక ఏ ఆడపిల్ల తోను ఒంటరిగా కాదు కదా, పదిమందిలో కూడా మాట్లాడిన పాపాన పోలేదు. కానీ పరిస్థితుల ప్రభావానికి తల ఒగ్గి ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి 'తప్పదు' అనుకుంటూ తనికి తనే ధైర్యం చెప్పుకుంటున్నాడు. కానీ అంతలోనే పిరికితనం ఆవహించేస్తోంది. మెల్లిగా కుర్చీలోంచి లేచి అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టాడు. మధ్యలో ఆగి-

"చూడండి మిస్" అన్నాడు.

తలెత్తి చూసి మళ్ళీ సిగ్గుగా తల వంచు కుంది కమల. నిట్టూర్చి మళ్ళీ తిరగడం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక -

"ఒకసారి ఇటు చూస్తారా?” అన్నాడు.

తలెత్తి చూసి చిన్నగా నవ్వి తల దించుకుంది కమల. మళ్ళీ నిట్టూర్చి పచార్లు మొదలుపెట్టాడు ఆనందరావు. కమలకి అతని ధోరణి అంతుపట్టడం లేదు. 'సుఖంగా కూర్చుని అతను చెప్ప దల్చుకున్నదేదో చెప్పక గడియారం పెండ్యులం లాగ ఎందుకు తిరుగుతున్నా డో' అనుకుంది.

ఆనందరావు ఆగి “చూడండి మిస్" అన్నాడు మళ్ళీ. వెంటనే తల ఎత్తింది కమల. ధైర్యంగా, సూటిగా అతని వంక చూసింది. తల వంచుకోలేదు. ఆనంద రావు నోరు తడారిపోయింది. కానీ వెంటనే ధైర్యం మొండి ధైర్యం, ఆవేశం- వీరావేశం వచ్చేశాయి.

వెంటనే టకటక నడుచుకుంటూ వచ్చి కమల కుర్చీకి అడుగు దూరంలో నిలబడి సూటిగా చూశాడు. ఈ అమ్మాయికి చెప్పేయాలి. 'నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. నిన్ను పెళ్ళి చేసుకోవడం అసంభవం' అని చెప్పాలి. అసలు ముందు ప్రేమ అంటే ఏమిటో తెలుసో తెలీదో? అందుకే సూటిగా అడిగేయాల నుకున్నాడు. ఆ క్షణాన అతనికి ఆ అమ్మాయి పెళ్ళికూతురి లాగ, పరాయి పిల్లలాగ అనిపించలేదు. తన దగ్గర పని చేసే ఒక లేడీ క్లర్కులాగ అనిపించింది. అందుకే-

"మీరు ఎవరినైనా ప్రేమించారా?" అన్నాడు సూటిగా చూస్తూ, అదిరిపడింది కమల, తల అడ్డంగా ఆడించింది.

"పోనీ మీకు 'ప్రేమ' అంటే ఏమిటో తెలుసా?" అన్నాడు కఠినంగా. 

బెదిరిపోయింది కమల. గభాల్న లేచి నుంచుని తల గబగబ ఆడించింది. మరింత కోపం వచ్చింది ఆనందరావుకి.

“తెలీదా? ప్రేమంటే తెలీదా? నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? చెప్పు. నీకెందుకు తెలీదు? ప్రేమంటే ఎందుకు తెలీదు నీకు? చెప్పు" అని గద్దించాడు. ఆఫీసులో లేడీ క్లర్కుని “వాటీస్ దిస్? వై సో డిలే? ఐవాంట్ యువర్ ఎక్సప్లనేషన్” అని అడిగే రీతిలో.

కమలకు వెన్ను లోంచి వణుకు పుట్టుకు వచ్చింది. కెవ్వున కేక వేసి 'పిచ్చాడు పిచ్చాడు' అని అరుస్తూ గది లోంచి పరిగెట్టుకు వచ్చేసింది. మరుక్షణం అల్లకల్లోలం. ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు.

తనను కావలించుకుని ఏడుస్తున్న కూతురిని ఓదారుస్తూ అసలు సమాచారం సేకరించింది కమల తల్లి. భర్తకు చెప్పింది. ఆయన మండిపడుతూ పరంధామయ్య దగ్గరికి వచ్చాడు.

"ఏమయ్యా పరంధామయ్యా! నీ కొడుకు పిచ్చిని దాచి పెళ్ళి చేద్దామనుకున్నావా? నీకు బుద్ధి లేదుటయ్యా? నా పిల్ల లాంటి ఆడపిల్ల నీకూ వుందిగా. చూస్తూ చూస్తూ దాని గొంతు కొయ్యడానికి నీకు మనసెలా వొప్పింది?” అన్నాడు.

తాడెత్తున లేచాడు పరంధామయ్య. “ఏవిటీ నా కొడుక్కి పిచ్చా? లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ నెల తిరిగేసరికి మూడు వేలు కళ్ళజూసే వాడికి పిచ్చా? నీ కూతురు వాడిని ఏం చేసిందో ఏమో? అసలు పెళ్ళికి ముందే అంత ధైర్యంగా వాడితో మాట్లాడ్డానికి గదిలో దూరిందంటే నే తెలిసిపోతుంది నీ కూతురు ఎలాంటిదో. ఛీ దిక్కుమాలిన సంబంధం మా కొద్దు” అంటూ లేచి “పదండి రా” అన్నారు.

కమల తండ్రి రెచ్చిపోయాడు. "అసలు ఇవ్వమని కాళ్ళు పట్టుకుని బతిమాలు కుంటే మాత్రం నీ పిచ్చి కొడుక్కి పిల్లనెవరిస్తారు? పోండి బైటికి" అని అరిచాడు.

అలా మరి కాసేపు ఆ ఇద్దరూ హోరా హోరి పోట్లాడుకున్నాక టాక్సీలో తిరుగు ముఖం పట్టారు. పరంధామయ్య అసలే కోపిష్టి. దానికి తోడు ఈ రభస, నిప్పు తొక్కిన కోతిలా అరుస్తున్నాడు.

"ఏం పుట్టింది ఈ వెధవకి నోరు మూసుకుని కూర్చోక? అసలు మా ఇంటా వంటా లేవు ఈ బుద్ధులు. ఇదిగో ఉందిగా వీడి తల్లి... దీని వంశం వారివే ఈ తల తిక్క వేషాలు. వెధవ వంశం నేరకపోయి కట్టుకున్నాను” అంటూ మాణిక్యాంబ తల్లిదండ్రుల్నీ, ఆవిడని, అవిడ అన్నద మ్ములని ఏకధాటిగా తిట్టిపోశాడు. కాసేపు సహించింది కామేశ్వరి. ఇక వినలేక విరుచుకుపడింది.

“మీ కొడుకు చేసిన పిచ్చిపనికి మమ్మల్నీ మా వంశాన్ని అంటే నేనూరుకోను” అంది.

“ఊరుకో” అంటూ భార్యను శాంతింపజే శాడు సూర్యం. భర్త మాట కాదనలేక వూరుకుంది కామేశ్వరి. సూర్యం పని అయోమయంగా వుంది. వేరే ఏ దోవా లేకపోతే మెల్లిగా ఆ అమ్మాయితో 'నాకు పెళ్ళి చేసుకునే వుద్దేశం లేదు' అని మర్యాదగా చెప్పరా అని మేనల్లుడికి సలహా ఇచ్చింది అతనే. కానీ అది ఇలా పరిణమిస్తుందనుకోలేదు. ఆనందరావుకి మాత్రం పీడ విరగడైందని సంతోషంగానే వుంది.

కారు ఇల్లు చేరాకా పరంధామయ్య, మాణిక్యాంబ, ఆనందరావు దిగేశారు.

కానీ కామేశ్వరి మాత్రం దిగనని మొండి కేసింది. “అయిన భాగవతం చాలు. ఇంటికిపోదాం పదండి" అంది విసురుగా. కాసేపు బతిమాలాడు సూర్యం. ఐనా కామేశ్వరి వినలేదు.

చేసేది లేక "సరే ఒక్క నిమిషం దిగు" అని ఆవిడ వెనకే తనూ దిగాడు. లోపలికెళ్లి
బావమరిదితో ఓ రెండు నిమిషాలు మాట్లాడి వచ్చి వెనక సీట్లో భార్య పక్కనే కూర్చుని 'పోనీ' అన్నాడు టాక్సీ డ్రైవర్తో.

మాణిక్యాంబ నీరసంగా లోపలికి వెళ్ళింది. కొడుకు మరింత నీరసంగా కూర్చుని తండ్రి చేత చివాట్లు తింటున్నా డు.

'పిచ్చి సన్నాసి దిష్టి తగిలింది. వీడి రూపం, చదువు, అంత పెద్ద ఉద్యోగం - చూసి చూడగానే కళ్ళుకుట్టేలాగ ఉంటాడు. సాయంత్రం మంత్రాల బసవయ్యను పిలిపించి దిష్టి తీయించాలి' అనుకుంది.

ఆ సాయంత్రం బసవయ్య కొబ్బరికాయ దిగదుడిచి పగలగొట్టి వెళ్ళాక తండ్రి పెట్టిన చివాట్లతో తలవాచిపోయి వున్న ఆనందరావు ఆ రాత్రి బస్సులోనే హైదరాబాదుకి ప్రయాణం అయ్యాడు.
💌
*సశేషం* 
    
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆

No comments:

Post a Comment