Thursday, June 13, 2024

****తెలివితో శాంతిని గుర్తించాలి

 [6/13, 05:36] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 11🌹
👌తెలివితో శాంతిని గుర్తించాలి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 11. తెలివితో శాంతిని గుర్తించాలి 🌹

✳️ అన్ని ప్రాణులకు నిద్ర శాంతి కోసమే. సుషుప్తి అవస్థగా పిలువబడే గాఢ నిద్రలో మనకి ఈ శాంతి లభిస్తుంది. శాంతినిచ్చే ఈ సుషుప్తి అవస్థ మనలో నిరంతరాయంగా ఉండేదే! నిద్రలో ఆలోచనలు ఆగటం చేత ఆ 'శాంతి' మనకు అనుభవంలోకి వస్తుంది. మెళకువలో మనకి ఉండే స్పృహతో ఉన్న శాంతిని తెలుసుకుంటే అదే సాధన అవుతుంది. సాధనలో భాగంగా అంతర్ముఖం కావడం, వెలుపలికి రావడం అంటే శాంతిని అనుభవించడం, దూరం కావడమే! 

✳️ అజ్ఞానంలో కలిగే బాహ్యవ్యామోహాల వల్ల ప్రకృతి మనని శాంతంగా ఉండనివ్వదు. ఒక్కొక్కసారి నిద్రకూడా పట్టనివ్వదు. టి.వి. పై ఇష్టంతో ఇది చాలా మందికి అనుభవమే. దృశ్య ప్రపంచం బయటి ప్రకృతి అయితే, మన ఇష్టాయిష్టాలే మన లోపల ప్రకృతిగా ఉంటాయి. ఈ ఇష్టాయిష్టాలతో కూడుకున్నదే 'నేను' అనిపించే అహం. ఇది ప్రతిరోజు నిద్రలో అణిగి, తిరిగి మెళకువతో మళ్ళీ లేస్తుంది. దాన్ని మూలంలోకి నెట్టివేయడమే సాధకుడు చేయాల్సిన తెలివైన పని. ప్రారబ్ధంవల్ల ప్రకృతి మన ప్రయత్నాన్ని సాగనివ్వదు. అయినా నిరంతర సాధన మాత్రం సాగుతూనే ఉండాలి. 

✳️ జ్ఞానిలోనూ, అజ్ఞాని లోనూ నేను అనే ఈ అహమిక తప్పదు. అజ్ఞానికి దేహభావన అహం అయితే జ్ఞానికి ఆత్మభావనే అహం. జ్ఞాని, తనకి ఏర్పడ్డ పనుల కోసం బాహ్య ప్రకృతిలోకి వస్తే అజ్ఞాని పనులు కల్పించుకొని మరీ లేస్తాడు. జ్ఞానికి కర్తవ్యం ఎదురు వెళ్తుంది. మనం పనులకు ఎదురు వెళ్తాం. జ్ఞానికి నిద్రలేస్తూనే కలిగే అహమిక భావన కూడా తాను ఆత్మననే స్పృహగానే ఉంటుంది. అందుకే ఆయనికి ఏదీతాను చేసే పనిగా ఉండదు. ప్రకృతి చేయించుకొనే పనిగా ఉంటుంది. సామాన్యుడికి అలా కాదు. కర్తృత్వ భావం చేత ప్రతీదీ పనిగానే తోస్తుంది. 

✳️ వాస్తవానికి మనకి శాంతినిచ్చే సుషుప్తి అవస్థ కొత్తగా వచ్చేది కాదు. జాగృతి, స్వప్నావస్థలలోనూ, అది అంతర్లీనంగా ఉండేదే. అందుకే జ్ఞాని అన్ని అవస్థలలోనూvసుషుప్తి సుఖాన్ని కొనసాగించగలడు. సామాన్యుడికి అహమిక అంటే రూపానామాలే. అవి శాశ్వతం కాదు కనుక భయం తప్పదు. జ్ఞాని దేహభిమానం కాల్చిన తాడులా కేవలంగా మనకి కనిపించేందుకే తప్ప అందులో పటుత్వం ఉండదు. సముద్రంలో ఉప్పు బొమ్మ కరిగిపోయి వ్యాపకత్వాన్ని పొందినట్లు అహమిక ఆత్మలో కరిగి ఆ విశ్వాత్మ ఉనికిని పొందుతుంది. అప్పుడు జరిగే కర్మలన్ని ప్రకృతి చేత జరిగే లీలగా ఉండి జ్ఞాని మాత్రం సాక్షిగానే ఉంటాడు. మనం కూడా ఈ ప్రకృతి నుండి అలాంటి స్వేచ్ఛను పొందాలి. అంటే ఈ ప్రపంచం నుండి విడిపోనక్కరలేదు. సాక్షిత్వం అలవాటు చేసుకుంటే చాలు. 

✳️ జ్ఞానికైనా ప్రారబ్ధం ఉంటుంది. అది దేహానికే గానీ తనకి కాదన్న వివేకం వల్ల అది తిరిగి కర్మకు దారి తీసేదిగా ఉండదు. ప్రమిదలో ఉన్న నూనె చివరి చుక్కవరకూ వత్తి వెలిగినట్లే జ్ఞానికైనా ఈ ప్రకృతిలో ఋణాను బంధం తీరే వరకు దేహం, దాని సహజ లక్షణాలు తప్పవు. అందుకే ఏ జ్ఞాని అయినా జీవితకాలం నిర్వికల్ప సమాధిలో ఉండరు. ఎందుకంటే వారి ప్రకృతి మన కోసం ఏర్పడ్డది కాబట్టి కళ్ళు తెరిచినా మూసినా మన కోసమే. నిప్పు ఊదితే మంట పుట్టినట్లే మనలోని 'ఆత్మ' కు స్ఫురణ రాగానే ప్రకృతి అవుతుంది. ఈ స్ఫురణే జననం. ఇదే కొనసాగితే జాగృతం. కృష్ణుడైనా, రామకృష్ణుడైనా, శంకరాచార్యులైనా, వివేకానందుడైనా ఈ ప్రారబ్దాన్ని గౌరవిస్తూనే వెళ్ళారుగానీ జ్ఞానులం కదా అని ప్రారబ్దాన్ని తృణీకరించలేదు. 

✳️ జ్ఞానికి జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు ఆవల ఉన్న తురీయావస్థ కూడా తెలుస్తుంది. కనుక స్ఫురణ రావడంతో సహ అంతః ప్రవృత్తి అంతా ఆయనకు అనుభవంలో ఉంటుంది. సామాన్యుడికైతే ఈ స్ఫురణ నిద్రలేచిన వెంటనే ఏదో ఒక విషయంగా మారి ప్రకృతితో మమైక్యం పొందేలా చేస్తుంది. ఆత్మను స్ఫులింగం అంటారు. అంటే స్ఫురణము లింగంగా కలది. ఈ స్ఫురణ ఉన్నంత కాలమే ఈ దేహము ఉంటుంది. మన జననానికి జాగృతికి కారణమైన ఈ స్ఫురణ మూలం అన్వేషిస్తే మన అహమిక వెనుక ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతాం. 

✳️ మనకి దుస్తులు, నగలు తగులుతున్న స్పర్శజ్ఞానం చర్మానిది. కానీ మన దృష్టి దుస్తులు, నగలపై ఉండటం వల్ల మన స్పర్శ భావన వాటినే గుర్తు చేస్తుంది. కానీ అందుకు కారణమైన చర్మాన్ని గుర్తుకు తీసుకురాదు. అలాగే మనం స్నానం చేసేటపుడు, చల్లని గాలి.  

✳️ జిల్లెళ్ళమూడి అమ్మవారు అన్నట్లు... “అదేమిటో తెలియక్కర్లేదు. అదొకటి తగిలినపుడు చర్మాన్ని అనుభవిస్తున్నాం తప్ప అందుకు కారణమైన ఆత్మశక్తిని గమనించుటలేదు. మనసు నిదానముగా ఉండి గమనిస్తే మన పంచేంద్రియాల ద్వారా శరీర అవయవాలు ఆత్మశక్తిని నిరంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేహ స్పర్శను కాక ఆ దేహ స్పర్శకు కారణమైన ఆత్మ స్పర్శ వైపుకు మన దృష్టి మారాలి. నిజానికి అది రోజూ మనకు జరుగుతూనే ఉంది. అదే ఆత్మానుభవం. అదే భగవద్దర్శనం. నిద్రలో కూడా మనకి దేహ స్పర్శ లేకున్నా ఆత్మస్పర్శ ఉంటుంది. కానీ అక్కడ గమనించే మనస్సు ఉండదు. అందుకే జాగృతిలోనే మనం ఆత్మస్పర్శను తెలుసుకోవాలి. అందుకు దేహబుద్ధి తగ్గాలి.
[6/13, 05:36] +91 73963 92086: దానికోసమే భజనలు, జపాలు, ధ్యానాలు చేసేది. బయటకు చేస్తే భజన, పెదాలపై చేస్తే జపం, మనసుతో చేస్తే ధ్యానం. స్థాయి భేదాలు తప్ప విషయం ఒక్కటే. మనం గట్టిగా పట్టుకున్న మరొకరి చేయి వదిలిపెట్టగలం కానీ మన చేయి మనం వదలలేముకదా! కారణం, అది మన సొంతం కనుక. అలాగే ఈ దేహం మన సొంతం అయి ఉంటే రాత్రిపూట గుర్తులేకుండా పోవడం సాధ్యమేనా! దీన్ని బట్టి మనం ఈ దేహం కాదు. జాగృతిలోనే దీన్ని గుర్తించాలి. 

✳️ అవస్తాత్రయం (జాగృతి, స్వప్న, సుషుప్తి) లను పరిశీలించినరోజున అహమిక ఈమూడింటికీ అతీతమైన తురియావస్థగా ఉంటుంది. ఈ తురీయం ప్రత్యేకించి తెలియక్కర్లేదు. ఆ మూడు అవస్థలు మనవి కాదని తెలిస్తే చాలు. ప్రతి రెండు అవస్థల నడుమ, ప్రతి రెండు తలపుల మధ్య ఈ అహమిక శుద్ధంగా ఉంటుంది. అయితే ఆ వ్యత్యాసాన్ని గమనించేటంత సున్నితత్వం మనసుకి రావాలి. మనసు, రెండు తలపుల మధ్య పొందే విరామమే రామం. ఆ విరామం నిరంతరంగా కొనసాగితే అదే సమాధి, సుషుప్తి, ఆత్మజ్ఞానం. అన్నీ అదే. 

✳️ మనమనసుకే ఈశరీరం తెలుస్తుంది. చిత్ అంటే అదే. అప్పుడు తెలిసే శరీరాన్ని కాక ఆ శరీరాన్ని అనుభవించే మనసుని గమనిస్తే 'చిత్' తెలుస్తుంది. ఒక్కటైనదేది వేరుకాలేదు. మరి నిద్రలో శరీరంపై స్పృహ లేకుండా పోతుందంటే అది వేరౌతుంది కదా! అలాంటప్పుడుమన అహమిక దేహం ఎలా అవుతుంది.  ఉన్నదని తెలిస్తే చాలు”, మనం సాధనలో ముందుకెళ్ళగలుగుతాం. 

✳️ శ్రీ రమణ భగవాన్ ఇలా చెప్తున్నారు... 'అహమిక అనే తల్లి కోడి చీకటి పడగానే నిద్రలో తన పిల్లలనే తలపులను రెక్క కిందికి తనలోకి చేర్చుకుంటుంది' అహమిక మేల్కోవటం అంటే దాని విషయాలపై అది ప్రసరించటమే. చీకట్లో ఏది ఉన్నా తెలియనట్లే మనసు లేని నిద్రావస్థలో నీకు నువ్వు తెలియవు. ఇది నిరాశావాదం కాదు. సత్య వస్తువు ఒక్కటే.

 🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment