Tuesday, June 18, 2024

 "జ్ఞానగీత"(నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ఈశావాస్యోపనిషత్* - ముగింపు భాగము.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
సాకార ఉపాసన, నిరాకార ఉపాసన రెండింటినీ కలిపి గ్రహించినవాడు, సాకారోపాసన వలన మరణాన్ని దాటి, నిరాకారోపాసన వలన అమరత్వం పొందుతాడు.
మానవులకు రూపం, గుణాలు ఉన్నాయి కాబట్టి సామాన్య జీవుని జ్ఞానం ఈ రూపాలకు, గుణాలకు అతీతంగా ఆలోచించడం కష్టం. దేవుడిని నిరాకారముగా పూజించడములో తలెత్తే పెద్ద సమస్య ఇదే. దానివలన మనకు ఏదీ సరిగా అర్థం కాదు. ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యము.
సాకారోపాసన అంటే పరమాత్మను రాముడిగానో, శివుడిగానో పూజించడం. ఇలా పూజించాలంటే దేవుళ్ళరూపాలన్నీ ఒకే పరమాత్మ అని గ్రహించాలి, లేకుంటే అజ్ఞానం పెరిగి పెద్దదై, నీ దేవుడి కంటే నా దేవుడే గొప్ప అనే దురభిమానం, మూఢభక్తి లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి జీవుడు ఆత్మానుభూతి పొందాలనేది ఈ మంత్రాల అర్ధం.
సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు. అంటే అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోనికి తోడ్కొని వెళ్ళమని ప్రార్ధన. ధ్యానం, భక్తి మొదలగు వాటివలన భగవత్‌దర్శనం కలుగుతుంది. అంటే వెలుగులోనికి మనం ప్రయాణించగలం. కాని సత్యం అనేది వెలుగుచీకట్లకు, జ్ఞానాజ్ఞానాలకు అతీతమైనది. అంటే ఆ తేజస్సును కూడా దాటిపోవాలి.
ఆ తేజస్సునే ఇక్కడ సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉన్నదని చెప్పబడింది. అలాగే "సత్యనిష్ఠుడనైన నేను" అని చెప్పడం ద్వారా తన అర్హతను తెలియజేస్తున్నాడు ముముక్షువు. ఆ నిరాకార, నిర్గుణమైన సత్యాన్ని అనుభూతి పొందడానికి ప్రత్యక్షదైవమైన సూర్యుణ్ణి ఇలా ప్రార్దించేడు, " సకల జీవరాసులను పోషించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ తేజస్సును కుదించుకో, కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహంతో నేను చూడగలుగుతాను.
సూర్యభగవానుని కృపతో మంగళకరమైన అతని స్వరూపాన్ని దర్శించిన ముముక్షువు, ఆ సత్యమైన పదార్థం "నేను" అని కనుగొన్నాడు. ఈ స్థితి అత్యున్నత స్థితి, పరమాత్మ స్థితి.
ఎప్పటికైనా ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. ఈ ప్రాణం మరణంలేని ఆత్మతో కలిసిపోతుంది కాబట్టీ, ఓ మనసా! విచారణ చెయ్యు, సాధనతో లక్ష్యాన్ని సాధించు, ఆ "నేను"ని తెలుసుకో, అని ఒక "స్వయం ప్రేరణ" చేసుకుంటున్నాడు ముముక్షువు.
ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, ఇకమీదట చేయబోయే పనుల ఫలితం మాకు అంటకుండా వాటిని నిష్కామంగా చేసేట్టు చేయి అని ప్రార్దించేరు ఋషులు.
ఈ భాగంతో "ఈశావాస్య ఉపనిషత్తు" సంపూర్ణమైంది. కేనోపనిషత్తులో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻

No comments:

Post a Comment