Wednesday, June 26, 2024

****

 ఆధ్యాత్మిక ప్రస్థానం ~ అహంకారం
సకల జీవులలో అహంకారం కనిపిస్తూనే ఉంటుంది. స్వల్ప అధికారం లభించినా , తక్షణమే కంఠం లో శృతి మారి పోతుంది. ఎదుటి వారు తమ ఆజ్ఞకి లోబడి నడుచుకుంటూ ఉంటే, ఆ ఆధికారానికి అహంకారానికి హద్దులే ఉండవు.
‘ వినయం “ అనే లక్షణమే మరచి పోతారు. పెద్దలు ఉత్తములు సజ్జనులు జ్ఞానులు కూడా వారి కంటికి చాలా అల్పంగా కనిపిస్తారు.
ధనం సంపదలు పెరిగినా కూడా, కొందరు జ్ఞానులని అవమానిస్తారు. ధనం తోనే సర్వం సిద్ధిస్తుందని ,ధనాన్ని సంపాదించడమే జీవితానికి లక్ష్యమని లోకం లో భావిస్తారు. ,
ధనం సంపాదించడం చేత కాక , నీతులు ధర్మాలు చెబుతూ కాలాన్ని వ్యర్ధం చేస్తున్నారని ఉత్తములని ఈసడించేవారు కూడా లోకం లో మనకి కనిపిస్తారు.
సౌందర్యం కూడా అహంకార హేతువే. కాలం తో కరిగి పోయే అంద చందాలని చూసుకుని, ఇతరులని వెక్కిరించి , అపహాస్యం చేసేవారు కూడా మన చుట్టూ కనిపిస్తారు. నిజానికి సద్గుణాలే తరగని సౌందర్య నిధులు.
ఈ కారణంగానే శ్రీ రామ చంద్రుడిని “ పుంసాం మోహన రూపాయ “ అన్నారు. సమస్త సద్గుణాల రాశి శ్రీ రామ చంద్రుడు. మహా విష్ణువు అవతారాలలో అందరినీ సమ్మోహన పరిచి, అందరికీ వెన్నెల వంటి ఆహ్లాదం కలిగించే సౌందర్యం ఆయనకి ఉన్నది కాబట్టే, ఒక్క శ్రీ రాముడినే రామ “ చంద్రుడు “ అన్నారు.
యవ్వనం కూడా కొందరికి అహంకారం కలిగిస్తుంది. వృద్ధులని , పెద్దవారిని చాలా చులకనగా మాట్లాడే యువకులు ఎందరో ఉన్నారు. పెద్దలందరికి చాదస్తమనీ , పెద్దలకి తగినంత జ్ఞానం ఉండదని , తృణీకరిస్తూ , అవమానించే వారు అన్నీ కాలాల్లో అన్నీ చోట్లా కనిపిస్తారు,.
ఈ అధికారం ,ధనం , సౌందర్యం, యవ్వనం నాలిగింట్లో ఏ ఒక్కటి ఉన్నా, అహంకారం తో విర్రవీగే వారు లోకం లో అన్నీ యుగాల్లో కనిపిస్తారు. విద్య వినయాన్ని ఇవ్వాలి. మూర్ఖుడికి విద్య కూడా అహంకారం ఇస్తుంది.
పాండిత్యాన్ని చూసుకుని గర్విస్తూ , జ్ఞానాన్ని పొందలేక , గురువులని జ్ఞనులని చాలా హీనంగా చూస్తూ , తృణీకరిస్తూ అవమానించే వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవేంద్రుడంతటి వాడికి ఇదే జరిగింది. జరిగిన పొరబాటు దిద్దుకునే లోపల , ఎంతో ఆలస్యం జరిగింది. దానికి చాలా భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది.
పరీక్షిత్తుకి శుక మహర్షి శ్రీ భాగవతం లో ఇదే విషయాన్ని. ఇలా వివరించాడు.
దక్ష ప్రజాపతి అతడి సంతానం ద్వారా భూమండలం పై సృష్టి కార్యం అద్భుతం గా నిర్వహించబడింది. ఒకప్పుడు దేవగురువైన బృహస్పతి ఇంద్రుడి మీద కోపగించి వెళ్లిపోయాడు. అప్పుడు దేవతలు విశ్వరూపూడిని తమ గురువు గా ఎన్నుకున్నారు.
“ త్వష్ట “ అనే వాడు దైత్యుల చెల్లెలు అయిన “ రచన “ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి మహాబలవంతుడైన “ విశ్వరూపుడు “ అనే వాడు జన్మించాడు. అతడినే దేవతలు బృహస్పతి అలిగి, అదృశ్యం అయిన వేళ, తమ గురువుగా ఎన్నుకున్నారు.
పరీక్షిత్తు చాలా ఆ ఆశ్చర్యంగా అడిగాడు. “ ఓ మహర్షి ! అసలు దేవ గురువు బృహస్పతికి ఎందుకు కోపం వచ్చింది. ? అది ఏవిధం గా పోయింది ? దయ తో దానిని వివరం గా చెప్పండి “ అని అడిగాడు.
శుక మహర్షి ఆ వృత్తాంతాన్ని ఇలా వివరించాడు. “ ఒకసారి ఇంద్రుడు “అష్ట దిక్పాలకులకు నేనే ఏలిక ని “ అనే అహంకారం తో అందరినీ తృణీకరించడం ప్రారంభించాడు. ఒకసారి వసువులు., రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినీ దేవతలు , సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఉరగులు, మొదలైన ముక్కోటి దేవతలతో కొలువు తీరాడు.
ఇంద్రుడు ఇలా వైభవోపేతంగా కొలువు తీరి ఉన్న సమయం లో ఆ ఇంద్ర సభలోకి దేవ గురువు బృహస్పతి ప్రవేశించాడు. గురువు ని చూసినా, దేవేంద్రుడు సింహాసనం దిగలేదు, స్వాగతం చెప్పలేదు , ఆయనకి గౌరవ ఆసనం చూపలేదు.
దేవేంద్రుడి ఈ అహంకారాన్ని గమనించి బృహస్పతి చాలా విచారించాడు. తక్షణం వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి పోయాడు. కొద్ది క్షణాలు కాగానే దేవేంద్రుడికి తాను చేసిన అపచారం స్ఫురించింది. తన ప్రవర్తనకి తానే ఆశ్చర్య పోయాడు. తన అహంకారానికి సిగ్గు పడ్డాడు.
ఈ క్షణమే వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించి , క్షమించమని ఆర్ధిస్తాను అని దేవగురువు ఇంటికి బయలుదేరాడు. ఇంద్రుడి ఆంతర్యం గ్రహించిన బృహస్పతి అంతర్ధానమయ్యాడు. గురువు కనిపించకపోవడం తో దేవేంద్రుడు చాలా బాధ పడ్డాడు
. చారుల వలన ఈ వార్త రాక్షసులకి తెలిసింది. రాక్షసులంతా తక్షణం శుక్రాచార్యుడి మార్గ దర్శనం లో యుద్ధానికి సిద్ధముఅయ్యారు. ఈ అహంకారం కారణంగా దేవాసుర యుద్ధం ప్రారంభం అయింది...

"మనసులో ఏ కోరిక లేనప్పుడు మనసు ఎలా ఉంటుంది !?"

కోరిక చేత నా మనసును, మరొక గుణం ఆవరించిందని గుర్తిస్తే, అది లేని మనసు ఎలా ఉంటుందన్న శోధన మొదలవుతుంది.

ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ మనం ఏదో ఒకటి కోరుతూనే ఉన్నాం.

మనం దేన్ని కోరుతున్నామో ఆ గుణంగా ఉంటున్నాం

. ఇక మనం మనంగా ఉంటున్నది ఎక్కడ ?

నిద్రలో మనం మనంగా ఉంటున్నాం. కానీ ఆ మత్తులో అది మనకు తెలియటం లేదు.

ఒక వ్యక్తి మద్యం దుకాణం ముందు నుండి వెళుతున్నాడు..


కానీ అతడికి ఆ మద్యం ధ్యాస రాలేదు. అప్పుడు అతడు అతడిగానే ఉన్నాడు.
కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక స్వీట్ షాప్ కనిపించింది. స్వీట్ తినాలనిపించింది. ఇప్పుడతడు తన గుణంతో కాక కనిపించే వాటి గుణంగా ఉన్నాడు.

విషయం ఏదైనా ఒకదాన్ని కోరుకోవడం అంటే అది గుణం చేతనే.

అలా కోరుకుంటున్నప్పుడు మనం ఆ గుణంతో ఉండి మన గుణాన్ని మరుగునపెడుతున్నాం.

ఏదో కావాలనుకోవటం కోరిక.
అది ఏదైనా కానీ, చివరికి ప్రయోజనాన్ని ఆశించి చేసే పూజ, జపం, ధ్యానం ఏదైనా సరే అది కోరికే అవుతుంది !..

*ఆత్మానుభూతి... అనగా ఏమి??? - అది ఎలా లభిస్తుంది??? - మనం నిజజీవితంలో అనుభవించే అనుభూతి ఏమిటి??? - ఉపనిషత్తులు ఏమి తెలుపుతున్నాయి???*

ఆనందం అనేది మానవుని సహజస్థితి, వాస్తవస్థితి...
కానీ, నేడు అనేక మందిమి తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నాము...
*సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, అవి వేరు... ఇవి మూడు రకాల అనుభూతులు...*

*1) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.*

*2) వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.*

*3) వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం.*

ఆనందం, ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతినే ఆనందం అంటారు...

_సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం అందజేస్తుంది..._
_శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాము_

*మొదటిది బంధం,*
*రెండవది తాత్కాలితం,*
*మూడవది శాశ్వతం...*

మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు,
కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు, తనే బుద్ధుడు...
ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు, అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం.
*అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.*

మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి.

ఇది అలవరుచుకొన్న వారు అనుక్షణం ప్రార్ధనలో వున్నట్లే, ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే...

*ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు... (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. )*
_మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం._
_మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం._

_మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన._
_వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత._
_మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత._

ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే...

ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది.
మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి, అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని...
*ఆ అన్వేషణలోనే తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...*

*సత్ అంటే సత్యం,*
*చిత్ అంటే చైతన్యం,*
*ఆనందమంటే పరమానందం..*

ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి".
ఇలా ఆనందమును తెలుసుకున్నవారు (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే)...
ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం.
అందరిలో అంతర్యామిని గుర్తించడం,
ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం. భూతదయ, సేవా దృక్పధం కలిగివుండడం.


No comments:

Post a Comment