*మిహిత పుబ్బాంగమ*
*భగవాన్ బుద్ధుడు నిత్యం చిరునవ్వుతో ఉండే వ్యక్తి.బుద్ధుడిని సహచరులు "మిహిత పుబ్బంగమా" అని బుద్ధుడిని పిలిచేవారు.ఆ మాటకు అర్థం “నిత్యంచిరునవ్వుతో” ఉండే వ్యక్తి అని. బుద్ధుడు ఏనాడూ విచార వదనంతో లేరు.బుద్ధుడు విగ్రహాలు కాని, చిత్రాలు కాని మనం చూస్తే ఎక్కడా విచార వదనంతో,అందోళనతో,బాధ కాని ఆవేదన కానీదుక్ఖంతో కూడి ఉండినట్లు కానీ కనబడవు.అలాగే బౌద్ధ ఆరామాలు కూడా ఎంతో ప్రశాంతంగా,నిర్మలంగా ఉంటాయి.అక్కడి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది.*
*బౌద్ధం వ్యాకులతకు,విచారానికి,ఉదాసీనతకు,ఆవేదనతో కూడిన దృష్టికి పూర్తిగా వ్యతిరేకం.సత్యాన్ని కనుగొనడానికి ఈ భావనలే ఆటంకాలు.జీవితంలోని కష్టాలను ఎలా ఎదుర్కోవోవాలో భగవాన్ బుద్ధుడు చెప్పారు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను గురించి ఆలోచిస్తూ జీవితాన్ని దుక్ఖమయం అని తెలుసుకోవాలి అని బుద్ధుడు చెప్పారు.*
*బౌద్ధులకు పాపులమనే ఆత్మ న్యూనతా భావం లేదు.బుద్దుడు చెప్పినట్లుగా గతం పట్ల విచారం కానీ,భవిష్యత్ కోసం వెంపర్లాడ లేకుండా ఇప్పుడు ఇక్కడ ఏముందో దానితోనే జీవించాలి.అలా ఎవరు అయితే జీవిస్తారో వాళ్ళు ప్రశాంత వదనంతో కాంతి తో ప్రకాశిస్తారు.అలా బౌద్ధ భిక్ఖులు జీవిస్తారు.గృహస్తులు కూడా పూర్తిగా బౌద్ధులు అయితే వాళ్ళు కూడా జీవిస్తారు.ముఖ్యంగా బౌద్ధ భిక్ఖులు గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ వ్యాకులత చెందకుండా ,శాశ్వతంగా వర్తమానంలో అంటే ప్రస్తుతంలో జీవిస్తూ సుఖ సంతోషాలు పొందుతారు.*
*కోసల రాజు ప్రసేన్ జిత్ ఒకరోజు బుద్ధునితో మాట్లాడుతూ,ఇతర గురువులు వారి శిష్యులు వాడిపోయి,బక్కచిక్కి,పాలిపోయి,వికారంగా ఉంటారు.అదే భగవాన్ బుద్ధుని శిష్యులు ఆనందం తొణికిసలాడుతూ,ఉల్లాసంగా,ఆహ్లాదంగా,సంతృప్తి చెందిన ఇంద్రియాలతో,ఆందోళన లేకుండా నిర్మలంగా,ప్రశాంతంగా,జింకల వలె తేలికపాటి హృదయంతో ఉంటారని అన్నారు.బౌద్ధులు పవిత్ర జీవితాన్ని సాధ్యమైనంత మేరకు గడుపుతూ అందరికంటే సుఖంగా జీవిస్తారు.నిజమైన బౌద్ధులు అయితే ఎప్పుడూ ఆనందంతో ,ఉత్సాహంతో ఉంటారు.అత్యంత సుఖమైన జీవితాన్ని ఇతర మతాల వారి కంటే బౌద్దులే గడుపుతారు.బౌద్ధులకు భయాలు,ఆందోళనలు ఉండవు.ఎప్పుడూ ప్రశాంతతను కోరుకుంటారు,అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కాంక్షిస్తారు.ఉన్నది ఉన్నట్లు చూసేవారు బౌద్ధులు.ఎలాంటి కష్టాలు వచ్చినా తలక్రిందులు అవరు.జీవితంలో దుక్ఖం సహజం.ఈ జీవితం పట్ల వ్యాకులత అనవసరం.కోపం అసహనం ఉండకూడదు.ద్వేషం అవలక్షణం అని బౌద్ధం చెబుతుంది. ప్రతీఘ అనగా జీవుల పట్ల,దుక్ఖం పట్ల,దుక్ఖానికి సంబంధించిన విషయాల పట్ల కలిగే ద్వేష భావన.ఈ ద్వేష భావన వలన మనలో చెడు ఆలోచనలు మొలకెత్తి చెడు ప్రవర్తనకు దారి తీస్తుంది.కాబట్టి దుక్ఖం పట్ల కోపాన్ని గానీ అసహనాన్ని గానీ కలిగి ఉండరాదు.ఈ దుక్ఖం గురించి సరిగా అర్థం చేసుకోవాలి.దుక్ఖం ఎలా వచ్చింది,ఈ దుక్ఖాన్ని ఎలా రుపుమాపుకోవాలి అని మనం తెలుసు కోవాలి.దీని కోసం మనం తెలివిగా ,సహనంగా గట్టి సంకల్పాన్ని అలవర్చుకోవాలి.*
*”ఎవరు దుక్ఖాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారో వారు దుక్ఖ సముదాయాన్ని,దుక్ఖ నిరోధాన్ని,దుక్ఖ నిరోధ మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు.” అని బుద్ధుడు చెప్పారు.బుద్దుడు దుక్ఖం గురించి చెబుతూ ఇలా అంటారు “దుక్ఖం శ్రద్ధకు ,శ్రద్ధ ప్రమోదానికి,ప్రమోదం ప్రీతికి,ప్రీతి ప్రశాంతతకు,ప్రశాంతత సుఖానికి,సుఖం సమాధికి,సమాధి వస్తువుల యథాతథ జ్ఞానానికి,దర్శనానికి దారి తీస్తాయి.వస్తువుల యథాతథ జ్ఞాన దర్శనం భోగాల నిరాకరణకు ,భోగాల నిరాకరణ విరాగానికి,విరాగం విముక్తికి,విముక్తి తృష్ణాక్షయ జ్ఞానానికి అంటే అర్హంతత్వానికి దారి తీస్తాయి.”*
*నీవు చేసిన చెడు పనులే నీ దుక్ఖానికి కారణం.ఇతరుల నుండి కూడా దుక్ఖం కలుగుతుంది. ఇతరులు మనల్ని పీడిస్తే ఆ పీడించే వ్యక్తి తన స్వార్థం కోసం తపిస్తాడు. అతనికి ఆ పీడించడంలో కలిగే సంతోషం కొంత కాలం మాత్రమే. వాస్తవానికి అది సంతోషం కాదు.*
*మన ఆలోచనల ఫలితంగానే మన జీవితం తయారవుతుంది. గడచిన కాలంలో వచ్చిన ఆలోచనల ఫలితమే నేడున్న పరిస్థితికి కారణం. నేటి ఆలోచనలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నాడు బుద్ధుడు.అందువల్ల ఈ రోజు మనం చేయగలిగే పనులను సరైన ఆలోచనలతో చేయగలిగితే రేపు సహజంగానే మంచిగా ఉంటుంది. ఆ మనిషి గురించి తెలిపేది అతని మాటలవల్ల, అతని చేష్టలవల్ల. మాట కత్తికన్నా పదునైనది. అందుకే బుద్ధుడంటాడు "* *నాలుక ఒక పదునైన చాకు లాంటిది. అది రక్తం కారకుండా మనిషిని చంపేయగలదు*". *పదాలకున్న శక్తి అపరిమితం. అవి మనసును విరిచేయగలవు, లేదా మనసును పరిమళింపచేయగలవు. పదాలు దయాపూరితమై సత్యమైతే అవి ప్రపంచాన్ని మార్చగలవు. అందుకే మనం మాట్లాడే మాటలను, పదాలను జాగ్రత్తగా వాడాలి. మంచిమాటలు మంచిగానూ, చెడు మాటలు చెడుగానూ ప్రభావితం చేస్తాయంటాడు బుద్ధుడు.*
*మనిషి తన జీవిత కాలంలో ఉన్నతుడు కావాలంటే తన చరిత్రను, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి మరియు ప్రజల సమిష్టత్వంతోను అంటాడు బుద్ధుడు. ఒక పువ్వు ఎలా తానే వికసించి, పరిమళిస్తుందో, అందరికి అందాన్ని, సువాసనను వెదజల్లుతుందో అలాగా మనిషి కూడా తన్నుతాను మార్చుకుంటూ పదిమంది మార్పుకు దోహదం చేయగలగాలని బుద్ధుడు మానవాళికి బోధించారు.*
................................................🌳
*🍀ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించే వారిలో నేను కూడా ఒకణ్ణి.☘️ -తథాగత గౌతమ బుద్ధుడు*
*మనిషి జీవితంలో సంతోషం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంతోషం లేని మనిషి వేటి మీదా ఆసక్తి కనబరచలేడు.నిద్ర సరిగ్గా పట్టక సతమతమవుతాడు బ్రతకడం ఒక భారంగా భావిస్తాడు. ప్రతి క్షణం ఆ మనిషి జీవితం కడు బాధాకరంగా మారుతుంది. మనిషి సంతోషాన్ని ఒక్కోదాంట్లో వెతుక్కుంటూ ఉంటాడు.చివరకు ఆ సంతోషం లభించక మదనపడతాడు. ఆందోళన చెందుతాడు.తప్పిదాలు కూడా చేస్తాడు.*
*తథాగతుడు సంతోషాన్ని పొందడం ఎలా అనేది బోధించారు. ఈ ప్రపంచం సంతోషం కోసం ప్రాకులాడుతుంది.ఈ వాస్తవాన్ని బుద్ధుడు గుర్తించారు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మన గురించి కూడా మనం ఏమిటన్నది తెలుసుకోవాలి అని భగవానుడు చెప్పారు. సమాజంలో పరిస్థితి పట్ల పూర్తి ఎరుకతో మనం మసలుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు.*
*ఇష్టం లేని ఉద్యోగం చేయాల్సి రావడం, ఇష్టం లేని భర్త లేదా భార్యతో కొందరు జీవించాల్సి రావడం వలన అలాగే సమాజంలో కులం కారణంగా కోరుకున్న అతను లేదా ఆమెతో జీవించలేని పరిస్థితి దాపురించడం వలన జీవితం దుక్ఖమయం అవుతుంది. జీవితంలో రుచి ఉండదు.మానసికంగా బాధ అనుభవించాల్సి వస్తుంది. ఇదే దుక్ఖం. ఈ దుక్ఖం పట్ల కోపం ,ద్వేషం సహజంగా మనిషిలో కలుగుతుంది. ఈ దుక్ఖం మనిషి లో ఆందోళన, వ్యాకులత కలిగిస్తుంది. మనిషి దుక్ఖం పట్ల అసహనాన్ని ,ఆందోళనను ,ద్వేషాన్ని కలిగి ఉండరాదు అని బౌద్ధం చెబుతోంది. దుక్ఖం పట్ల ద్వేషం పెట్టుకోవడం వలన దుక్ఖం సమసిపోదు. మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది అని బౌద్ధం చెబుతోంది. దీనికోసం తెలివితో ,సహనం తో వ్యవహరించాలని బౌద్ధం చెబుతోంది.*
*భగవానుడు సుఖ సంతోషాలు గురించి చెబుతూ సుఖసంతోషాల కోసం నేరుగా వెంపర్లాడటం వలన అవి మనకు లభించవని తెలియజేసారు. ఎవరైతే వ్యక్తిగత కోరికలు సంతృప్తి పరచుకోవాలి అని తాపత్రయ పడతారో వాళ్ళు చిక్కుల్లో పడతారు. వ్యక్తిగత కోర్కెలను తీర్చుకోవాలని అదే పనిగా మనిషి జీవించడం ధర్మం కాదని భగవానుడు చెప్పారు. జీవితంలో కష్టాలు అనివార్యంగా వస్తుంటాయి పోతుంటాయి.ఈ కష్టాలను ఎవరైతే ఎదుర్కొంటూ ముందుకు సాగుతారో వాళ్ళు మహత్తరమైన ఆనందాన్ని పొందుతారు అని బుద్ధుడు చెప్పారు. ఉన్నది ఉన్నట్లు చూడటం వలన ఆనందం లభిస్తుంది. మనలో ఎలాంటి ఆందోళన, వ్యాకులత కలుగదు. ఎంతటి కష్టాలు వచ్చిన చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ గొప్ప ఆనందానుభూతిని పొందవచ్చు. దానికి భగవాన్ బుద్ధుని జీవితం ఒక ఉదాహరణ.బుద్ధుడు రాజ్యాన్ని, సకల సుఖాలను త్యజించారు. జ్ఞానోదయం కోసం ఏడు సంవత్సరాల పాటు ఎన్ని కఠిన పద్ధతులు అవలంభించారో.ఎంతగా కష్టాలు పడినారో అంత మాత్రాన ఆయన ఆనందం పొందకుండా ఉన్నారా? లేదు కదా ఆయన ఈ కష్టాలను ఎదుర్కొంటూ మహత్తర ఆనందానుభూతిని పొంది మనకు ఆ ఆనందాన్ని పొందే మార్గాన్ని గురించి బోధించారు.*
*బౌద్ధులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఉండాలి కూడా. యథాభూత జ్ఞానం కలిగి ఉంటే ఇది మనకు కూడా సాధ్యమే.బౌద్ధ భిక్ఖువులు చాలా స్వచ్ఛమైన మనసు తో ఉంటారు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటారు.భిక్ఖువుల ఇంద్రియాలు కూడా వేటి వేటి కోసమో వెతకడం జరగదు.వాళ్ళ ఇంద్రియాలు సంతృప్తి చెంది ఉంటాయి. భిక్ఖువులు ఇంత సంతోషంగా ఎందుకు ఉంటారు అంటే బుద్ధ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వలనే.బుద్ధ ధర్మాన్ని స్వయంగా అనుభూతి చెందుతూ ఆనందంగా ఉంటారు.*
*మానవ జీవితంలో సుఖం, దుక్ఖం సహజం...మనుషులు దుక్ఖం వస్తే తట్టుకోలేరు,సుఖం వస్తే ఎంతగానో ఆనందిస్తారు.ఒక నాణేనికి రెండు వైపులా సుఖం, దుక్ఖం ఉంటాయి. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండరు.కుటుంబం, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి ఉంటారు.మనిషి ఒక సామాజిక జంతువు.మన జీవితంలో కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో మనం విచారంగా ఉంటాం.నిరాశకు లోనవుతాం..ఇలాంటి సమయంలోనే మనిషిలో నైతికత దెబ్బ తినడానికి అవకాశం ఏర్పడుతుంది. మన జీవితంలో ప్రతిసారీ సంతోషం ఉండాలి అని అనుకోవద్దు. భగవాన్ బుద్ధుడు చెప్పిన ఈ మాటలను మనం సదా మననం చేసుకోవాలి. "చింతించకు నేను పర్వతంలా నీ వెనుక నిలబడి ఉన్నాను."*
*మనం జ్ఞానం వైపు నడవాలి, వినయాన్ని అలవర్చుకొని జీవించాలి. అప్పుడే దుక్ఖానికి లోనుకాకుండా జీవించగలం.బుద్ధ భగవాన్ చెప్పిన మాటలను ఆచరించడం ద్వారా ఆనందం మన సొంతం అవుతుంది.శాంతిని అనుభవించగలం.*
*బుద్ధ భగవాన్ చెప్పినట్లు "పెద్ద పెద్ద శారీరక రోగాలన్నీ మానసిక రోగాల నుండే పుట్టుకొస్తాయి. అన్ని మానసిక రోగాలు రాగ ద్వేషాల వల్లే జనిస్తాయి." కాబట్టి మనం మనసులో ఎలాంటి చెడు బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉందాం...*
*✍🏽అరియ నాగసేన బోధి*
*🌻భవతు సబ్బ మంగలమ్🌼☸️🌼🪷*
No comments:
Post a Comment