Sunday, June 30, 2024

 *నవ్వుతూ ఏడిపిస్తుంది జీవితం* 
*ఏడుస్తుంటే లాలిస్తుంది ఆసాంతం..* 


*నేడు( 28-6-1931) ముళ్ళపూడి వెంకటరమణ గారి 93 వ పుట్టినరోజు సందర్బంగా...*


8వ ఏట వరకు తన ఇంట చక్రవర్తి వైభోగం, తండ్రి మరణంతో తల్లకిందులైన కుటుంబం, పదవ తరగతి వరకే చదివిన పురాణాలు, గ్రంధాలు, తెలుగు, ఇంగ్లీష్ నవలలతో అపార జ్ఞానం, మద్రాసులో మెట్ల కింద చిన్న గదిలో అమ్మ, అమ్మమ్మ తో కలసి మొదలుపెట్టిన కష్టాల జీవితం,
హార్బర్ లో కూలీ పని చేయడం, పది రూపాయల కోసం చొక్కా గుండీలు, విస్తరాకులు కుట్టడం, నెలకి పావలా కోసం ట్యూషన్స్ చెప్పడం, తినడానికి తిండి లేకుండా, వేసుకోడానికి రెండు జతల బట్టలు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా దుర్భరమైన పేదరికాన్ని, ఆకలితో అలమటించిన రోజుల్ని, నిరుద్యోగ పర్వాన్ని అన్నింటినీ కూడా ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోవడం...

ఎన్ని కష్టాలు ఎదురైనా తన సృజనాత్మకతపై వీడని నమ్మకం, ఆకలి కన్నీటి జల్లుల్లో నవ్వుల పన్నీటి చినుకుల్ని కలుపుకుంటూ సాగిన జీవితం, జీవిత రథచక్రాల కింద పడి నలిగితే తప్ప మనిషనేవాడు రాటుదేలడు అన్నట్లుగా ఎన్నిసార్లు జీవితం తనని అణగదొక్కడానికి చూసినా, దాదాపు పదేళ్ళ పాటు ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొని ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంధం.

ఆయన రచనలు పదహారణాల తెలుగు తనానికి ప్రత్యక్ష సాక్ష్యం, మాటలు ముత్యాల మూటలు, రామాయణం ఆయనకు అత్యంత ప్రియం, ఆయన రామభక్తి అపారం, బాపు ఆయన ప్రాణ నేస్తం....

మన తెలుగింటి చిచ్చర పిడుగు బుడుగు సృష్టికర్త, హాస్య చక్రవర్తి, మేటి సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారికి జయంతి శుభాకాంక్షలు 

రవణ (షార్ట్ కట్ లో ఇలానే అంటారుస్మీ) పుట్టినప్పుడు ఏం జరిగిందనే ఆసక్తి అందరికీ ఉండటం సహజం. దానికీ రవణే ఇలా సమాధానం చెప్పుకున్నారు.

గోదారి కెడాపెడాగా నేను తూగోజీలో, బాపు పగోజీలో పుట్టాం – ట. అప్పుడు ప్రపంచంలో పూలవాన కురవలేదు. ప్రళయాలు రాలేదు. గంధర్వులు పాడలేదు. కోకిలల్ని ‘కుహూ’ అనమంటే ‘ఊహూ’ అన్నాయని గిట్టని వారి ప్రచారం – అచ్చరలాడలేదు (దుబాయి టూరు వెళ్ళాయిట) పేపర్లు సప్లిమెంట్లు వేయలేదు. టీవీ యాంకర్లు ‘హలో బాపూ అండీ హలో రవణాంకుల్’ అని గ్రీటింగ్సులు చెప్పలేదు. భూచక్రంలో భూమండలంలో ఆ రోజు తెల్లారగానే సూర్యుడు మామూలూగానే ఉదయించాడు. ఆ రాత్రి చంద్రుడు కూడ అలవాటు ప్రకారం వెన్నెలే కాశాడు. చుక్కలు తళుకు తళుకు మన్నాయి. కొబ్బరాకులు మిలమిలమన్నాయి. పువ్వులు పూశాయి…” 

***

ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 న ధవళేశ్వరంలో జన్మించారు. ఇతని అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనం లోనే తండ్రి మరణించారు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివారు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివారు. పాఠశాల విద్యార్థిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు.

1945లో "బాల" పత్రికలో రమణ మొదటి కథ "అమ్మ మాట వినకపోతే" అచ్చయ్యింది. అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయభాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 

1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిన బుడుగు వ్రాశారు. దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు కూడా అని చెప్పవచ్చును.

ఆయన మొదటగా మాటలు రాసిన మూడు సినిమాలు ఘనవిజయం అందుకున్నవే.. అవి రక్తసంబంధం, గుడిగంటలు, మూగమనసులు..

ఇతర సినిమాలు-ఇద్దరు మిత్రులు, వెలుగు నీడలు, దాగుడుమూతలు, ప్రేమించి చూడు, తేనె మనసులు, కన్నె మనసులు, నవరాత్రి, పూల రంగడు, ప్రాణమిత్రులు, సాక్షి, బంగారు పిచుక,  బుద్ధిమంతుడు, కథానాయకుడు, బాలరాజు కథ, భలే రంగడు, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, పంచదార చిలక, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, గోరంత దీపం, జీవన జ్యోతి, కలియుగ రావణాసురుడు, రాజాధి రాజు,  సీతా కళ్యాణం,  మనవూరి పాండవులు, రాజాధిరాజు, వంశవృక్షం,  పెళ్ళి పుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధా కళ్యాణం,  త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు, రాధాగోపాలం, జేబుదొంగ, మంత్రిగారి వియ్యంకుడు, బుల్లెట్, జాకీ, కళ్యాణ తాంబూలం, శ్రీనాథ కవి సార్వభౌముడు, పెళ్ళి కొడుకు, రాంబంటు, సుందరకాండ, శ్రీరామరాజ్యం..

ముళ్ళపూడి వెంకటరమణ రచనలలో ప్రసిద్ధమైనవి కొన్ని:

బుడుగు - చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన

ఋణానందలహరి (అప్పుల అప్పారావు - అప్పుల ప్రహసనం

విక్రమార్కుని మార్కు సింహాసనం - సినీ మాయాలోక చిత్ర విచిత్రం

గిరీశం లెక్చర్లు - సినిమాలపై సెటైర్లు

రాజకీయ బేతాళ పంచవింశతి - రాజకీయ చదరంగం గురించి

ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం 

అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి

కథా రమణీయం - 1 : సీతాకళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు

కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు

బాల రమణీయం : బుడుగు
కదంబ రమణీయం - 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు

కదంబ రమణీయం - 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు

సినీ రమణీయం - 1 : చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు

సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు
అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109

కోతి కొమ్మచ్చి: ఆయన జీవిత చరిత్ర. స్వాతి పత్రికలో ప్రచురితమైంది.
ఇద్దరు మిత్రులు (వెండితెర నవల)
తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు

రమణీయ భాగవత కథలు
రామాయణం (ముళ్ళపూడి, బాపు)
శ్రీకృష్ణ లీలలు
🥰
 
꧁☆•┉┅━•••❀❀•••━┅

No comments:

Post a Comment