శ్రీరామ (50).
(భగవంతుడు స్త్రీని సహజ సౌందర్యంతో సృష్టించాడు.
స్త్రీ సౌందర్యానికి పరవశంకాని జీవుడెవడూ సృష్టిలో లేడు.పలువురి చేత ఆ విధంగా కోరబడే " స్త్రీ " కి రక్షణ ఎవడు ? )
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను. మరల మరల నమస్కరిస్తున్నాను).
-------
ఈ కాలంలో ఆడపిల్లలకు భద్రత కరువైంది.
రాజకీయనాయకుల అండతో సమాజంలో రౌడీలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.
భగవంతుడు స్త్రీని సహజ సౌందర్యంతో సృష్టించాడు.
స్త్రీ సౌందర్యానికి పరవశంకాని జీవుడెవడూ సృష్టిలో లేడు.
యౌవనం వస్తున్నకొద్దీ స్త్రీ అవయవ సౌందర్యం అంతకంతకూ పెంపొందుతూ , హావభావాలతో కూడినదై ఎంతటి వాడిని కూడా మోహింపజేస్తుంది.
వాల్మీకి రామాయణంలో ఇలా చెప్పారు.
రాముడు ఆశ్రమంలో లేనప్పుడు, సీతాదేవిని అపహరించి తెచ్చి తనతో కామసుఖాలను అనుభవించమన్నాడు రావణాసురుడు.
సీతాదేవి తిరస్కరించింది.
ఆమెను లంకలోని అశోకవనంలో రాక్షసస్త్రీల కాపలాలో ఉంచి ,రావణుడు ఇలా అంటున్నాడు.
" ఓ సీతా ! నీ సౌందర్యం వర్ణణాతీతం.
నీవు సర్వాంగ సుందరివి.
నీ శరీరంలోని ప్రతి అంగము అద్భుతమైన సౌందర్యంతో నన్ను పరవశం చేస్తున్నది.
శ్లో// యద్యత్పశ్యామి తే గాత్రం శీతాంశు సదృశాననే /
తస్మిం స్తస్మిన్ పృథుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతే //
(ఓ చంద్రవదనా ! విశాలమైన కటిప్రదేశము కలదానా ! నీ శరీరములోని ఏ అవయవం మీద నా దృష్టి పడుతున్నదో,ఆ దృష్టి ఆ అవయవ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ,అక్కడే నిలిచిపోతున్నది, మరో అవయవం మీదికి పోలేక పోతున్నది)
శ్లో// త్వాం సమాసాద్య వైదేహి రూప యౌవనశాలినీమ్/
కః పుమానతివర్తేత సాక్షాదపి పితామహః//
(ఓ సీతా! రూప,యౌవనములతో కూడిన నిన్ను చూచినచో, సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు కూడా తనని తాను నిగ్రహించుకొన లేడు.ఇతరుల మాట చెప్పవలెనా! ).
అయితే, తన శీలమే తనను రక్షిస్తుందన్న దృఢవిశ్వాసంతో ఉన్న సీత , తాను ఒంటరిగా రాక్షసుల మధ్య ఉన్నానని, రక్షకులెవరు లేరని, తెలిసినా, భయపడకుండా రావణుని అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ విధంగా ఒక స్త్రీని అనేకమంది మోహిస్తే ఆ స్త్రీ పరిస్థితి ఏమిటి ?
ఎంతమంది సీతాదేవిలాగా ఉండగలరు ?
ఏం చేయాలి ?
పరపురుషుల దృష్టిలో పడకుండా మహమ్మదీయుల లాగా బురఖా వేసుకోవాలా ?
ఆప్పటికీ, ఇప్పటికీ, అదే పరిస్థితి.
రావణాసురులు ఎక్కువయ్యారు, శ్రీరామచంద్రులు కనుమరుగైనారు.
ఈ విషయంలో "రామాయణం" మనకిచ్చే సందేశం ఒకటే,
స్త్రీలయొక్క " శీలమే " స్త్రీలను రక్షిస్తుంది.
శీలమన్నా, ధర్మమన్నా ఒకటే.
మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది.
" సీతాదేవిని రావణుడు బలవంతంగా చెఱచకుండా ఆమె శీలమే ఆమెను రక్షించింది" అంటాడు రాముడు.
ఆ విషయం పరిశీలిద్దాం.
రామ రావణ యుద్ధం ముగిసింది.
ఇప్పుడు ' సీత ' ఏమి చేయాలనుకుంటున్నదో తెలుసుకొని రమ్మన్నాడు హనుమంతునితో రాముడు.
"నా రామచంద్ర ప్రభువును" కలవాలనుకుంటున్నాను అన్నది అమ్మవారు.
సీతను అభ్యంగ స్నానం చేయించి, అన్ని ఆభరణములతో అలంకరించి తీసుకు రమ్మని విభీషణుడితో చెప్పాడు రాముడు.
విభీషణుడు వినయంగా అమ్మవారికి నమస్కరించి అభ్యంగ స్నానం చేయమన్నాడు.
సంవత్సరం పాటు దీనురాలై, మలినమైన శరీరంతో అశోకవనంలో ఉన్నది సీతమ్మ.
ఇప్పుడు సర్వాభరణ భూషితురాలై, వెల్తే "తాను లంకలో సంతోషంగానే ఉన్నాను" అనుకుంటాడేమో ఆర్యపుత్రుడు !
సీతమ్మ మనస్సులో సందేహం !
సీతాదేవి సమస్త శాస్త్రములు తెలిసిన విద్యావతి.
పురుషుల సహజ మనస్తత్వం ఆమెకు తెలుసు.
విభీషణుడితో " అస్నాతా ద్రష్టు మిచ్ఛామి భర్తారం రాక్షసాధిప"
(ఓ రాక్షసరాజా ! స్నానం చేయకుండా, ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే రాముని చూడాలనుకుంటున్నాను) అన్నది .
" అమ్మా! అభ్యంగ స్నానం చేయించి, అలంకరించి, నిన్ను
తీసుకొని రమ్మన్నాడు రాముడు.ఆయన ఆజ్ఞను ఎలా ఉల్లంఘించగలను ? " అన్నాడు విభీషణుడు.
రాముడి ఆజ్ఞ ఎవరికైనా జవదాటరానిది.
పతివ్రతా దీక్షలో ఉన్న తన సంగతి చెప్పేదేముంది ?
అందుకని "సరే" అన్నది అమ్మవారు.
సర్వాభరణ భూషితురాలైన సీతాదేవిని, అంతఃపుర స్త్రీలు పాటించే ఘోషా ప్రకారం విభీషణుడు పల్లకీలో తీసుకుని వస్తుండగా, ఆమెను చూడటానికి వానర వీరులందరూ ఎగబడ్డారు.
త్రొక్కిసలాట అయింది.
విభీషణుని రక్షక భటులు వానరులను బెత్తములతో కొట్టి, బలవంతంగా త్రోసి వేసి, పల్లకికి మార్గం ఏర్పరిచారు.
తన కోసం ప్రాణాలర్పించిటానికి కూడా సిద్ధమై యుద్ధానికి వచ్చిన వానర వీరులను ఆ విధంగా బాధించడం రాముడు భరించలేక పోయాడు.
చాలా కోపంతో రాముడు విభీషణుడితో ఇలా అన్నాడు.
"ఈ వానరులందరూ నా వాళ్ళు.
సీతమ్మను చూడదగని వారు కాదు.
స్త్రీలకు ఇల్లు, వస్త్రములు,కోట ప్రాకారములు,మేలి తెరలు, రక్షక భటులు, "ఆవరణము" (రక్షణ) కాదు.
వారి శీలమే వారికి " రక్షణ " అన్నాడు.
సీతాదేవి అగ్ని పునీత అయిన తరువాత రాముడు అగ్నిదేవునితో ఇలా అన్నాడు.
శ్లో//ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజసా/
రావణో నాతివర్తేత వేలా మివ మహోదధిః//
"మహాసముద్రము తీరమును ఎట్లు దాటజాలదో తన శీలముతో రక్షింపబడుచున్న విశాలాక్షి అయిన ఈ సీతను రావణుడు అతిక్రమించ లేడు).
శ్లో// నహి శక్త స్స దుష్టాత్మా మనసా౽పి హి మైథిలీమ్/
ప్రధర్షయితు మప్రాప్తాం దీప్తా మగ్ని శిఖా మివ//
(ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రమును వలె,పొంద శక్యము కాని ఈ సీతను,దుష్టాత్ముడైన రావణుడు మనస్సు చేత కూడా పొంద లేడు).
"సౌశీల్యం" రామాయణం మనకిచ్చే సందేశం.
సీతా, రామ, లక్ష్మణ,భరత,శత్రుఘ్నుల సౌశీల్యం ఈ మహాకావ్యంలో అనేక విధాలుగా వర్ణింపబడినది.
పల్లె పల్లెల్లో, పట్టణాలలో,చదువుకున్నవారిని, చదువుకోనివారినీ, నీతి నియమాలనే ఆ సౌశీల్యమే ఈనాటికీ అందరిని కాపాడుతోంది.
చట్టములూ, పోలీసులు కాదు మనల్ని రక్షిస్తున్నది.
అందుకే చిన్నప్పటి నుండి పిల్లలకు రామాయణం చెప్పాలి.
వారి భావి జీవితం సుఖంగా ఉండటానికి "శీలాన్ని" బోధించాలి.
అగాధమైన ఈ సంసార సాగరాన్ని సుఖంగా దాటి మోక్షం అనే ఒడ్డు చేరుకోవడానికి "రామాయణం" నౌక లాంటిది.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,
10-6-'24.
No comments:
Post a Comment