Monday, June 3, 2024

****అసలు మర్మం

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అసలు మర్మం*
🪷🪷🪷🪷🪷

మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. సరేనన్న సదాశివుడు బ్రహ్మ-విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించాడు. పరమ తేజోమయమైన ఆ నిలువెత్తు అగ్ని స్తంభానికి తుది, మొదలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియలేదు. బ్రహ్మ-విష్ణువులు వాటిని కనుగొనేందుకు పోటీపడి వరాహ, హంస రూపాలతో బ్రహ్మదేవుడు తుదిని, విష్ణువు దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించి విఫలమవుతారు- ఆ కథలో.
ఇక్కడ మనం ఆలోచించవలసింది- వారిలో ఎవరు గెలిచారనీ కాదు, వారికన్నా శివుడు అధికుడా... అనీ కాదు. నిజానికి ఇదొక ప్రతీక. వరాహం భూమిని తవ్వుకొంటూ కిందకు వెళ్ళడమంటే మనిషి తన గతాన్ని అదే పనిగా గుర్తుచేసుకొంటూ జ్ఞాపకాలను చీల్చుకుంటూ, గాయాలను రేపుకొంటూ... ప్రయాణించడమని అర్థం. ఆ గతం అనంతం. మనిషి బుద్ధికి అందనంత లోతైనదది. కాబట్టే దాని అంతు తేల్చుకోవడంలో మనిషి విఫలమవుతాడు. తేజోమయ అగ్నికి మొదలేదో విష్ణువు తెలుసుకోలేకపోవడమంటే, అదీ అర్థం!
హంస రూపంలో బ్రహ్మ పైపైకి ఎగురుతూ దాని తుది ఏదో కనిపెట్టలేకపోవడమనేది మనిషి తన భవిష్యత్తును గురించి ముందుగా ఏమీ గ్రహించలేక పోవడానికి సూచన. భవిష్యత్తు విషయమై ఊహల రెక్కలపైనో, ఆశల ఊయలపైనో ఆకాశంలో విహరించడానికి సంకేతమే బ్రహ్మదేవుడి హంసవాహనం. వర్తమానాన్ని విడిచిపెట్టి నిన్నటిలోనో, రేపటిలోనో జీవించే మనిషికి మనశ్శాంతి కరవవుతుందని, పరాజయం ఎదురవు తుందని బోధించే కథ అది.
డబ్బుతో దేన్నయినా కొనవచ్చునని ఇప్పుడు ఎందరో పొరబడుతున్న మాదిరిగా, తన సంపదతో శ్రీకృష్ణుణ్ని సైతం తూచగలనని భావించి, భంగపడిన సత్యభామ దురహంకారానికి ప్రతీకే- శ్రీకృష్ణతులాభారం కథ. తన అధీనంలో ఉన్న ధనరాశులన్నీ ఆమె కుప్పబోసింది. ఎక్కడెక్కడో దాచిన సంపదలన్నీ చేరవేసింది. చివరకు ఒంటిమీది సొమ్ములన్నీ ఒలిచి ఇచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుణ్ని తన ‘పతిదేవుడు’ అని మాత్రమే అనుకొంది. ‘పతిగా దిగివచ్చిన దేవుడు’ అని గుర్తించలేకపోయింది. ఆమె విడిచిపెట్టవలసినవి నిజానికి తన దేహంపై సొమ్ములు కావు- తన లోపలి గుప్తనిధులు! దురభిమానం, అతిశయం, అహం... వంటి వాటిని ఆమె సంపదల మాదిరి గుండెల్లో దాచిపెట్టింది. ఆ గుప్తనిధులను విడుదల చేసేసరికి తిరిగి శ్రీకృష్ణుడు ఆమెకు వశమయ్యాడు. ఎవరికైనా సరే, వాటిని విడిచిపెట్టినప్పుడే భగవంతుడు వశం అవుతాడు. ఈ కథ అందరికీ వర్తిస్తుంది.
కుచేలుడు ఎంత బాల్యమిత్రుడైతే మాత్రం- పిడికెడు అటుకులకే మురిసిపోయి కృష్ణుడు అఖండ ఐశ్వర్యాలను అనుగ్రహించడం మరీ విడ్డూరం కదూ... అనిపిస్తుంది. వాస్తవానికి ఆ గుప్పెడు... పిడికెడు... అనేది కుచేలుడి ‘చేతికొలత’ కాదని, అది ‘గుండె కలత’ అని గ్రహించినప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. హృదయాన్ని భగవంతుడికి సమర్పిస్తే సర్వసంపన్నులం కాగలమన్న ఎరుక ఏర్పడుతుంది. పురాణ కథల్లోని ప్రతీకలను, అంతరార్థాలను సరిగ్గా అర్థం చేసుకోకుంటే మనలో అపార్థాలు తలెత్తుతాయని చెప్పే కథలివన్నీ!

ఓం నమః శివాయ🙏🏻 

No comments:

Post a Comment