Sunday, June 30, 2024

***** 'భావ తరంగణి'.(గల్పిక) రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.

 'భావ తరంగణి'.(గల్పిక)
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.
             **********

'ఇదేమిటి? మళ్ళీ ఓ కొత్త గ్రూపా?...'

'చెప్పా పెట్టకుండా.. నన్ను అడగకుండా ..నన్ను ఎవరు చేర్చారు?'..

'నన్ను ఈ గ్రూపులో చేర్చినందుకు ధన్యవాదాలు.. కవితలు రాయచ్చునా?'...

'మాలాంటి కొత్త స్త్రీ రచయిత్రులకు వారంలో ఒకరోజు కేటాయించండి'.......

'గుడ్ మార్నింగ్ లు, గుడ్ ఈవెనింగ్ లేనా ?సాహిత్యం ఏమైనా ఉంటుందా?'.....

'భావ మూర్తి గారు ఆరంభించారంటే నిర్దిష్టమైన చక్కటి ఆలోచనతోటే ప్రారంభిస్తారు! ఆయన కథలు నవలలు నాటకాలు తెలుగు వారికి పరిచయమైనవే కదా!'....

'రోజుకో గ్రూపు ప్రారంభించేస్తున్నారు! గుడ్ మార్నింగ్ లు పెట్టలేక చూస్తున్నాను! పలక తుడిచినట్టు  రోజూ పొద్దుటే స్క్రీన్ తుడుచుకోవడానికిడానికే అరగంట పడుతోంది! నన్ను తీసేయండి'....

'ఇష్టం లేకపోతే మీరే వెళ్ళిపోవచ్చు కదా!'.....

'నాకు తుడుచుకోవడమే గాని దీనిలో నుంచి వెళ్లిపోవడం రాదు మహా ప్రభో! అందుకని నా పేరు తీసేయండి!'....

'సమూహం ప్రారంభించి ఎంతసేపైనా దీని ఆశయాలు ఏమిటో ఎవరూ చెప్పరేం?'....

'కొంచెం ఓపిక పట్టండి సార్! పిల్లోడు పుట్టగానే వెంటనే బాలసారె చేస్తామా? గ్రూపు ఓపెన్ చేసిన వారు ఆశయాలు చెప్పకుండా ఉంటారా?'....

'భావ మూర్తి గారు ఆరంభించారంటే ఆ గ్రూపు ఆశయాలు గొప్పవే అయి ఉంటాయి!'....

'సార్ గ్రూపులో సమస్యా పూరణాలు కూడా పెడితే బాగుంటుంది!'....

'ఎవరైనా రాజకీయాలు ప్రారంభిస్తే వెంటనే గ్రూప్ లో నుంచి తొలగించేయండి! ఇది మాత్రం స్ట్రిక్ట్ గా అమలు చేయండి!'.....

'నేను ఇప్పుడిప్పుడే కొత్తగా కథలు రాయడం మొదలు పెట్టాను. నా కథలు ఈ గ్రూపులో పెట్టవచ్చునా?'...

'సుజాతనగర్ లో చిన్న కుటుంబమునకు వంట చేయుటకు ఎటువంటి బాదరా బందీలు లేని 30 ఏళ్ల యువతి కావలెను. మంచి జీతం, వసతి ఉంటుంది కింది నెంబర్ సంప్రదించండి*****'......

'అయ్యా భావ మూర్తి గారు ఆరంభించారంటే ఇది సాహిత్యానికి సంబంధించిన గ్రూపు! ఇందులో ఇలాంటిపచన ప్రకటనలు దయచేసి పెట్టవద్దు అని మనవి!'.....

'మనవాళ్లు మొత్తానికి టి20 లో ప్రపంచ కప్ గెలుచుకొచ్చారు! వారందరికీ నా శుభాకాంక్షలు!'.....

'మా ఆవిడ నన్ను నిమిషానికోసారి "నువ్వు కొడాలి నాని లా తయారయ్యావు!..." అంటూ తిడుతోంది! ఈ కొడాలి నాని ఎవరో దయచేసి ఎవరైనాచెప్పగలరా?'....

'కల్కి సినిమా నిన్ననే చూశాను! అదిరిపోయింది! అందరూ చూడండి!'.....

'వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా?.. కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారా?... పువ్వు మీ అదృష్టం చెప్పగలదు!.. వెంటనే కింది నెంబర్ ను సంప్రదించండి******'

'అయ్యా భావ మూర్తి గారు! అడ్మిన్ గారు! మీరు ఎక్కడున్నారో వెంటనే గ్రూపులోకి రావాలి! మీరు అయ్యవారిని చేయబోతే కోతి అయ్యేలా ఉంది! రకరకాల వ్యాపార ప్రకటనలతో గ్రూపు భ్రష్టు పట్టిపోతోంది! మీరు వెంటనే వచ్చి ఈ గ్రూపు ఆశయాలు వివరించమని మన సభ్యులందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను! ఎక్కడున్నా త్వరగా రండి!'......

"అయ్యా! సభ్యులందరూ నన్ను క్షమించాలి. నేను మా ఆవిడని రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ కి వచ్చాను! రైలు మూడు గంటల ఆలస్యం అని తెలిసింది! ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మా ఇంటికి తిరిగి వెళ్ళలేను! మళ్ళీ రాలేను! అందుకని ప్లాట్ఫారం మీదే కూర్చున్నాను! ఏమీ తోచక ఒక గ్రూప్ క్రియేట్ చేశాను! రైలు ప్లాట్ఫారం మీదకు వస్తోంది! అందుకని గ్రూపు క్యాన్సిల్ చేస్తున్నాను! ఎవరికి వారే గ్రూపు విడిచి వెళ్లి పోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను! సెలవు నమస్కారం! మీ భావ మూర్తి!!"
                         ******************
(కేవలం సరదాగా రాసింది . ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు! కేవలం సరదా!.. సరదా!... అంతే!..)

No comments:

Post a Comment