Sunday, June 30, 2024

వ్రణ చికిత్సా న్యాయము"

 శ్రీమద్రామాయణము.

(211వ ఎపిసోడ్),

""""""వ్రణ  చికిత్సా  న్యాయము"""""

"" వైద్యో నారాయణో హరిః""ఇది అనాదిగా వస్తున్న నానుడి. వ్యాధులనుండి రక్షిస్తున్న వైద్యుని నారాయణ స్వరూపముగ చూడటము హైందవ సాంప్రదాయము.అటువంటి నారాయణ స్వరూపము చేసే పనులన్నియు దైవకార్యాలే.ఇక్కడ అందరము గమనించుకోవాల్సినది వైద్యుడు రోగికి చక్కని ఆరోగ్యము చేకూర్చలనే తపనతో శరీరములో చెడిపోయిన భాగాలను శస్త్రచికిత్స చేసి తొలగించును.దానికై పదునైన కత్తులతో రోగి శరీరాన్ని కోయునప్పుడు తాత్కాలికముగ రోగికి బాధ కలిగినను తదుపరి అతనికి స్వస్థత కలిగి ఆరోగ్యముగ నుండును.ఈ శస్త్ర చికిత్స రోగిని హింసించుటకో బాధపెట్డుటకో చేయునది కాదుకదా.చికిత్సానంతరము అతడు ఆరోగ్యవంతడై ఆనందముగ జీవించును.""దీనినే "" వ్రణచికిత్సాన్యాయము అని పిలచెదరు.

రామాయణము అయోధ్యాకాండములో రెండు ముఖ్యమైన సంఘటనలో పై న్యాయమును అన్వయము చేసుకొన వచ్చును రాముడు వంచించాడనో మభ్యపెట్టడనో కొంత మంది భావన చేస్తుంటారు.

"" తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః""
సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివ చాంతరా|,(40-46),

""నాశ్రౌషమితి రాజానమ్ ఉపలబ్దో~పి వక్ష్యసి|,
చిరం దుఃఖస్య పాపిష్టమ్ ఇతి రామః తమబ్రవీత్""(40-47),

సుమంత్రుడు సీతారామలక్ష్మణులను రథముపై ఎక్కించుకొని వనవాసమునకు తీసుకు వెడుతుండగ,దశరథుడు " హా రామా హా సీతా హా లక్ష్మణా అని విలపిస్తు  'సుమంత్రా రథమును ఆపుమ'ని గట్టిగ అరుస్తున్న సందర్భములో తన తల్లితండ్రుల శోకము గుర్తించి రాముడు సుమంత్రునితో "ఓయీ రథమును త్వరగా పోనిమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
రాముడు రథాన్ని త్వరగా తోలమంటున్నాడు.అక్కడ మహారాజు ఆగమని ప్రాధేయపడుతున్నాడు.ఈ సంకటస్థితోలో రాముడు సారథి స్థితి గమనించి " ఓయీ  నీవు తిరిగి అయోధ్యకి వచ్చినప్పుడు 'నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదని' మహారాజు అడిగితే నేను వినలేదని" చెప్పు. ఏలనగా ఇట్డి దుఃఖపరిస్థితిలో యున్న రాజును ఓదార్చుటకు ఇది సమయము కాదని చెప్పవచ్చునని అనునయిస్తాడు.
ఇక్కడ రాముడు మహారాజుని మభ్యపెట్టి వంచనకు గురి చేయమని ఆజ్ఞాపించాడని అనుకునే అవకాశము కలదు.అక్కడ రోగికి చేసే శస్త్రచికిత్సలో కత్తి వాడటము వంచన మోసము ఎలాకాదో ఇక్కడ రాజాజ్ఞ ధిక్కారముగానీ మభ్యపెట్టుట అనే విషయము అసంబద్దము. నేను "వినలేదు" అనుమాటకు అర్థము అవును మీ ఆజ్ఞ పాటించలేదని కూడ వచ్చును.కనుక అది అనృతము కాదని రెండవ వ్యాఖ్యానము.

ఇక  వనవాసమునకు బయలదేరునప్పడు అయోధ్యా వాసులు పెక్కురు రాముని రథమును వెంబడించి బయలదేరిరి.అలా వారందరు తమసా నదీ తీరానికి చేరి ఆ రాత్రి అక్కడ బస చేసారు.అంత రాముడు ఉషఃకాలముననే లేచి సీతాలక్ష్మణులను నిదురనుండి లేపి సుమంత్రుని చేరి రథమును సిధ్దము చేయమని అంటూ ఈ అయోధ్యా పురవాసులు భార్యాపుత్రులను వదలి మనవెంట వచ్చారు.వీరి పట్టుదల మనలను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లుటయే.కనుక వీరు నిద్ర లేవకమునుపే వీరు పసిగట్టలేని మార్గమున వేగముగ వెళ్లీపోదామని ప్రయాణము సాగిస్తాడు.

"'ముహూర్తం త్వరితం గత్వా నివర్తయ రథం పునః,
యథా న విద్యుః పౌరా మం తథా కురు సమాహితః||,(46-31),

ఓ సారథీ ముందు రథాన్ని ఉత్తరదిశగా అనగా అయోధ్య వైపు మళ్లించు.తదుపరి రథాన్ని అటునిటు చాలాసార్లు త్రిప్పుము.అని రథపు చక్రజాడలు ప్రజలు గుర్తించవీలు లేకుండగ కోసలదేశపొలిమేరలు దాటి గంగాతీరమునగల శృంగబేరపురమును చేరిరి.

ఇక్కడ రాముడు తన ప్రజలను మభ్యపెట్డి వారిని గందరగోళ పరుచుట వంచనక్రింద మనము గ్రహించరాదు.అట్లు మభ్య పెట్టకపోయినచో వారందరు తమ తమ భార్యాబిడ్డలకు దూరమై ఇబ్బంది పడెదరు.ఈ విధముగ చేసినచో వారు గత్యంతరములేక అయోధ్యకు తిరిగి వెళ్లెదరు.వారికి వనజీవన బాధలు తప్పును.కనుక ఇది వంచనక్రిందకురాదు.

కొన్ని కొన్ని సమయాలలో మన పనులు ఇబ్బందికరములైనను తర్వాత వారికి ఆనందము కలిగినయెడల అట్టి కార్యములు సదా ఆహ్వానింపదగినవే యని గ్రహించాలి.

కనుకనే రామాయణము మనకోసము ఆరాటపడేవారికి, మన శ్రేయస్సు కోరుకునేవారికి తాత్కాలికముగ వారికి కష్టము కలిగినను వారికోసం  వారి ఆనందముకోసము నిష్కర్షముగ కొన్ని కొన్ని పనులు చేయుటలో తప్పులేదని తెలియచేస్తున్నది.

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment