“జ్ఞానగీత"(నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *ఈశావాస్యోపనిషత్* - 2వ భాగము.
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరియందు ద్వేషభావం వుండదు. ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది. అందువలన బాధ గాని, మోహం కాని, ద్వేషం కాని కలగవు.
ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.
అతడు అన్నింటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. దేనిని తెలుసుకొంటే ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే ఆత్మ. అతడు కేవలం ఆత్మ లేక భగవంతుడిపైనే ఆధారపడివుంటాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు.
ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ పోతారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే లోకం దృష్టిలో పడటంకోసం, లోకులు తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటిని ప్రదర్శిస్తారో వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు.
జ్ఞానం ద్వారా ఒక ఫలితం, కర్మల ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. అయితే జ్ఞానం, కర్మలు రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు.
జీవుడు బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. పనులు మాత్రమే చేసుకుంటూ పొతే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి, మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం, పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది.
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻
No comments:
Post a Comment