Monday, June 3, 2024

*****క్షమించే హృదయం

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
             *క్షమించే హృదయం*

*కంటికి కనిపించకుండా మానవ జీవితమనే మహా నాటకాన్ని ఆడించేది మనసు ఒక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌఖ్యకారకమైనది, శోకకారకమైనది మరొకటి లోకంలో లేదు. పుణ్యకార్యాలూ చేయిస్తుంది. పాపకూపంలోకి నెట్టేస్తుంది.*

*మనసు మూలంగానే మనిషి తప్పుచేస్తాడు. ఒప్పు చేస్తాడు. తనవల్ల తప్పు జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తాపపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటిమనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి.*

*మంచి మనసే మంచి శరీరానికి అలంకారం. ప్రసన్నమైన దివ్యభావాలు ఆవిర్భవించే మనసు చెడు ఆలోచనలను, దుష్కర్మలను ప్రేరేపించదు. మంచిని విన్నప్పుడు, కన్నప్పుడు మనసు దుర్మార్గాన పోదు. సత్సాంగత్యంవల్ల, సద్గురు బోధనలవల్ల హృదయం ప్రక్షాళితమవుతుంది.*

*ఎంతటి గొప్పవాడైనా, మేధావి, పండితుడు, శాస్త్రజ్ఞుడు అయినా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని, చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది.. అహంకారం తప్ప!*

*యుగయుగాల్లో మహామహుల చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. కైక తన రెండు వరాల వల్ల జరిగిన పరిణామాలకు తరవాత ఎంతో పశ్చాత్తాపపడినట్లు హిందీ జాతీయ కవి మైథిలీ శరణ్ గుప్త తన 'సాకేత్' మహాకావ్యంలో చాలా గొప్పగా అభివర్ణించాడు.*

*అర్ధరాత్రివేళ అశ్వత్థామ ఉపపాండవులను పాశవికంగా వధించగా, అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపది ముందుంచుతాడు. భీముడు అతణ్ని వధించే ప్రయత్నం చేసినప్పుడు ద్రౌపది వారిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకమని, పైగా కన్నతల్లి గర్భశోకం భరింపరానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెడుతుంది. అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు పశ్చాత్తాపం చెంది విమోచనోపాయం కోరినప్పుడు భర్త గౌతమ మహర్షి శ్రీరామ పాదధూళి తగిలినప్పుడు స్వస్వరూపం పొందగలవని చెప్పాడు.*

*సత్రాజిత్తు తన శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించినట్లు నింద వేయడంతో పరమాత్మ అడవులకు వెళ్ళి ఎంతో కష్టపడి, మణిని సాధించి సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు వాసుదేవుణ్ని దూషించి, నిందించినందుకు క్షమాపణ కోరుకున్నాడు. విరాటరాజు కంకుభట్టుతో పాచికలాడుతూ, ఆగ్రహంతో పాచికలు విసిరేయడంతో కంకుభట్టు తలకు తగిలి గాయమై రక్తం కారసాగింది. కంకుభట్టే ధర్మరాజు అని తెలియడంతో విరాటరాజు క్షమాపణలు కోరుకున్నాడు. ఇలాంటి ఉదాహరణలు రామాయణ, భారత భాగవతాల్లో అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి.*

*చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లయితే క్షమించేవాడికంటే క్షమాపణ కోరినవాడే గొప్పవాడనిపించుకుంటాడు. క్షమాగుణానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే జైనులు చిత్తశుద్ధితో ఆత్మప్రక్షాళన కోసం 'దస్లక్షణ్పరే' పేరుతో పదిరోజులు పండుగ చేసుకుంటారు. దోషిని క్షమించినవాడు దైవస్వరూపుడని బాపూజీ అభివర్ణించారు.*

*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏*
🌻🌴🌻 🌴🌻🌴 🌻🌴🌻

No comments:

Post a Comment