*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*ఏదో కోల్పోతున్నాం...*
*మనిషి ఏదో కోరుకుంటాడు, కాని ప్రయత్నించడు. డబ్బు కావాలనుకుంటాడు, కాని శ్రమించడు. పదవి కావాలనుకుంటాడు, అర్హత నార్జించడు. కీర్తి కావాలనుకుంటాడు కాని, వితరణ చేయడు. దైవానుగ్రహం కోరుకుంటాడు, చిత్తశుద్ధితో స్వామిని అర్చించడు. ఫలితమే కోరుకుంటాడు కాని కర్మచేయడు. 'కర్మ చెయ్యి, ఫలితం సంగతి నేను చూసుకుంటాను' అన్న గీతాచార్యుడి బోధ తలకెక్కదు. అందుకే మనిషి నిరంతరం ఏదో కోల్పోతూ, అసంతృప్తి చెందుతూనే ఉంటాడు. నిరాశా నిస్పృహలకు గురి అవుతూనే ఉంటాడు. సుఖశాంతుల కోసం ఎక్కడో, ఏ వస్తువులోనో వెతుక్కుంటాడు. కస్తూరి మృగం తన నాభిలోనే కస్తూరి పరిమళం ఉంచుకొని ఎక్కడో ఉందని వెదుక్కుంటున్న రీతిగా మనిషి తనలోనే ఉన్న బ్రహ్మానందాన్ని గ్రహించలేక ఎక్కడెక్కడో అన్వేషిస్తూంటాడు.*
*'ప్రతి వయసులో ఏది మధురంగా తోస్తుందో అదే విషతుల్యం' అన్న అవగాహన కలగనంత వరకు మనిషి ఏదో కోల్పోతూనే ఉంటాడు. ఎక్కువ ప్రాపంచిక అవసరాలకు బానిసైనవాడు కడు పేదవాడు. అతి తక్కువ ప్రాపంచిక అవసరాల పట్ల కూడా ఆసక్తి చూపనివాడు అసలైన ఐశ్వర్యవంతుడు. ఒకడు వాక్కు విలువ తెలియక వాచలత్వంతో అపఖ్యాతి పాలవుతాడు. ఒకడు శ్రమించక విలువైన సమయాన్ని చేజార్చు కుంటాడు. ఒకడు దురాలోచనలతో అధర్మ మార్గంలో ప్రయాణిస్తుంటాడు. మరొకడు దుష్టసాంగత్యం వల్ల దుర్వ్యసనాలకు దాసోహ మంటాడు. ఇంకొకడు తల్లిదండ్రులు, గురువులు, బంధుమిత్రులు అందరినీ విరోధులుగా భావించుకొని ఒంటరిగా మిగిలి పోతాడు. ఇది చాలామందికి జరుగుతున్నదే! తెలిసి ధర్మం తప్పేవారు, తెలియక అధర్మం ఆచరించేవారు సైతం లోకంలో కనిపిస్తారు.*
*మనిషి జీవితం ఎంత అల్పమైనదో, అంత విలువైంది. దీన్ని అపురూప మధురఫలంగా భావించి అనుభవించాలి, ఆస్వాదించాలి. అమితమైన సుఖాలిచ్చే వస్తువులు ఎన్నో చుట్టూ ఉన్నా, ఏమీ లేకపోయినా- తేడా ఏదీ లేదనుకోగలవాడే విజ్ఞుడు. దైవకృపకు అర్హుడు. అంతటి వైరాగ్యం పొందినవాడు ఒక్క సంపూర్ణ మానవుడే కాదు... ఆదర్శవంతుడైన పురుషోత్తముడు. శ్రీరాముడు తెల్లవారితే పట్టాభిషేకమని తెలిసినప్పుడెలా ఉన్నాడో, తెల్లవారగానే అరణ్యవాసానికి బయలుదేరాల్సి వచ్చినప్పుడూ అలాగే ఉన్నాడు. పంచపాండవులు సతీసమేతులై అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేస్తున్న సమయాన కూడా కుంగిపోక కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారిలోని ఐకమత్యం ఏ కోశానా సన్నగిల్లలేదు. తమ కష్టాలకు కారణభూతుడైన అన్నగారిని తమ్ముళ్లు పల్లెత్తు మాట అనలేదు ధైర్యశాలికి విజయం అందుబాటులోనే ఉంటుంది. స్థితప్రజ్ఞుడికి ఖ్యాతి చేతికే చిక్కుతుంది. సంస్కారశీలికి గౌరవం చెంతకే చేరుతుంది. ముముక్షువుకు దైవదర్శనమే సంప్రాప్తమవుతుంది. సత్సంగశీలిని జ్ఞానమే కోరి వరిస్తుంది. అరిషడ్వర్గాతీతుడికి షణ్ముఖ సాక్షాత్కారమే లభిస్తుంది. మనిషికి అసలైన ఆనందాన్ని ఇచ్చేది సంతృప్తి. నిజమైన సుఖాన్ని ఇచ్చేది జ్ఞానం. జీవితాంతం శాంతినిచ్చేది ఆధ్యాత్మిక చింతన. మోక్షర్హతను ప్రసాదించేది సేవా తత్పరత. మంచి మరణాన్ని ఇచ్చేది ప్రేమ. ఏది కోల్పోతున్నా వీటిని మాత్రం కోల్పోకూడదు. అప్పుడు 'ఏదో కోల్పోతున్నాం' అన్న దిగులే ఉండదు.*
*అందనిదానికి ఆశపడకూడదు. నచ్చినదాని కోసం ఆరాటపడకూడదు. మనల్ని ఇష్టపడేవారిని వదులుకోకూడదు. ఎంతటి సమస్య ఎదురైనా కుంగిపోకూడదు. మన నిజాయితీయే మనకు రక్ష!*
*🙏సర్వేహిందూ సుఖినోభవంతు🙏*
🌻🌴🌻 🌴🌻🌴 🌻🌴🌻
No comments:
Post a Comment