Wednesday, June 12, 2024

భగవంతుడు భక్త సులభుడు

 X8.vi.a.3108b-5.080624-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


    *భగవంతుడు భక్త సులభుడు*
                  ➖➖➖✍️

*శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ  అద్భుత సంఘటన....*

*వారు పూజ చేసే టప్పుడు ‘ఆవాహయామి’ అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట. అది వారి అనుభవం.*

*ఒకసారి  ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట. ఆశ్చర్యంతో, ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని మంత్రోపదేశం చేసారట! ఆవిడ వెళ్ళిపోతూ ‘ఈ మంత్రం చేస్తే చాలా కష్టాలు వస్తాయని వింటున్నాను, నిజమేనా ?’ అని అడిగిందట.* 

*వారు “అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు?సందేహాలుండకూడదు.” అన్నారు.*

*ఆమె “అదేమీ లేదం”టూ  వెళ్ళిపోయిందట.*

*కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ, ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట.* 

*ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ, ఆమె ప్రారభ్దానికి జాలిపడి, ‘సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో’  అనుకుంటూ దయతో   శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు   ముందు ఆయన చేసుకుని ‘ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి. ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు’ అని చెప్పేరట.*

*ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట.*

*ఆ రాత్రి కలలో సీతమ్మ  వారు గురువుగారికి కనిపించి, అర్హత లేని వారికి నా మంత్రం   ఎందుకు ఇచ్చావు? ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట.*

*గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలాపించారుట*

*కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు. తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట.*

*గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి, తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట. తల్లి రానని చెప్పిందిగా. ఏ మొహంతో పిలవగలను? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట.*

*చివరకి అతి కష్టం మీద ‘సీతాం ఆవాహయామి’  అని అనగలిగేరట. వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట. ఆయన సంతోషానికి హద్దులు లేవు. గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ. ఈ దాసుని మీద అంత  దయా?'       అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట.*

*‘ఏం చెయ్యనురా! శ్రీ రాములవారిని పిలిచావు ముందు. వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ యెదుట. నేను రాకేం చెయ్యను ?’ అన్నదట.*

*ఇది… బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఒక రోజు చెప్పినది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🙏

No comments:

Post a Comment