*శ్రీరమణీయభాగవత కథలు- 19 - (5)*
( బాపు-రమణ )
జరిగిన కథ:
అనూరుడి శాపం వలన వినత,
కద్రువ కు 500 సం౹౹లు దాస్యం చేస్తుంది.
ఆమెకు మహాశక్తివంతుడైన గరుత్మంతుడు పుడతాడు. కద్రువ పిల్లలైన పాములను మోస్తుంటాడు.
ఇక చదవండి
******
*కద్రువ ఆశ్రమం*
సర్పాలన్నీ వాడిన తోటకూర కాడల్లా పడివున్నాయి. స్సు స్సు మని నీరసంగా మూలుగుతున్నాయి. అమ్మా అమ్మా అంటున్నాయి.
కద్రు: (రోషంగా) నీకు కొండంత ఒళ్లుంది గాని గింజంత కూడా బుద్ధి లేదు. దుర్మార్గుడా - నా బిడ్డలతో చెలగాటమాడతావా లేదా వాళ్లని చంపాలని చూస్తున్నావా ద్రోహీ.
గరుడుడు తలవంచుకు నిలుచున్నాడు.
గరు :
(నమస్కరించి) తల్లీ - నా దోషం కాదు. వాళ్లే పైకి సూర్యమండలానికి వెళ్లాలన్నారు. వెళ్లాను. అంతలో వద్దు అని కేకలు పెట్టారు. దిగి వచ్చాను.
కద్రు :
కాదు నేను నమ్మను. నువ్వు కావాలనే నా బిడ్డల్ని హింస పెడుతున్నావు. హింస నీ ఒక్కడి సొత్తుకాదు. నాకూవచ్చు. నువ్వు నా బిడ్డల్ని హింసిస్తే నేను నీ తల్లిని దండిస్తాను. చూడు.
కొంచెం ఎడంగా నిస్సహాయంగా నిలచి వున్న వినతను చూసి పరుగెత్తి ఆమె కొప్పు పట్టి లాగింది. ఆమె పడింది. అక్కడన్న చీపురుతో ఆమెను కొట్ట బోయింది.
గరు:
తల్లీ అంటూ దిక్కులదిరేలా గర్జించాడు
కద్రువ కొయ్యబారిపోయింది. చేతిలో చీపురు జారిపడింది.
గరు:
నా తల్లి నీ దాసీ కావచ్చు. దాసీ చేత పని చేయించుకో- కానీ కొట్టే అధికారం నీకు లేదు.
చెప్పు - అసలీ దాస్యం నుంచి నా తల్లిని విడుదల చేయడనికేం కావాలో చెప్పు
కద్రువ నెమ్మదిగా కోలుకుంది.
ధనకనక వస్తువాహనాలు తెచ్చి నీ ముందు నిలుపుతాను. చెప్పు ఏంకావాలో చెప్పు
గరు : అవన్నీ నా భర్తే ఇవ్వగలడు. నీకు చేతనైతే అమృతాన్ని తీసుకురా ఆ భాండాన్ని అలాగే పట్టుకొచ్చి మాకియ్యి. తక్షణం మీ యిద్దరినీ విడుదల చేస్తాను.
కద్రు: అంతే కదా (తల్లికి నమస్కరిస్తూ) అమ్మా నన్ను దీవించు. కద్రువ వంక చూశాడు. అమృతం కావాలంటే నువ్వూ దీవించు. అన్నాడు.
గరు: కద్రువ ముఖం అటు తిప్పుకుంది.
రెక్కలాడించి విసురుగా పైకి ఎగిరిపోయాడు.
గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న తండ్రి కశ్యపునకు మొక్కాడు.
ఆయన ఒకచోట పరస్పరం పోరాడుతున్న గజకచ్ఛపాలను తిని సత్తువ తెచ్చుకోమని దీవించి పంపాడు.
గరుడుడు ఎగురుతూ కిందకి చూశాడు. కింద నున్న ఏనుగునీ తాబేలునీ చెరో చేత్తో పట్టుకుని పైకెత్తాడు. అలంబ తీర్ధం అనే కొండపై వెళ్తూండగా రోహణ అనే మహావృక్షం ఆహ్వానించింది.
ఏనుగుని తాబేలునీ ఆరగించడానికి వృక్షం కొమ్మపై వాలగానే కొమ్మ పెళపెళ విరగసాగింది. ఆ కొమ్మకి వేలాడుతూ తపోనిష్ఠలో వున్న వాలఖిల్య మునులు (బొటన వేలంత రూపంలో వున్నవారిని) చూశాడు.
గరుత్మంతుడు వారి నిష్ఠకి భంగం రాకుండా అతి జాగ్రత్తగా కొమ్మతో సహా కశ్యపుని వద్ద వాలాడు. ఆయన మునులను ప్రార్థించాడు. గరుత్మంతుడు వారికి మొక్కాడు. వారు దీవించారు. కొమ్మని విడచి దిగారు.
*స్వర్గలోకం*
గరుడుడు స్వర్గలోకంలోకి దూసుకు వచ్చాడు. ఆయన రెక్కల విసురుకి దేవతలు తూలి పడ్డారు. రక్షకులు ఏమీ చెయ్య లేకపోయారు.
అమృత భాండాన్ని రెండు విషసర్పాలు మంటలు కక్కుతూ కనిపించిన దాన్ని చూపుతోనే భస్మం చేస్తూ కాపలా కాస్తున్నాయి.
ఇనపముళ్లతో ఉన్న రెండు లోహపు చక్రాలు ఎవరూ చొరబడడానికి వీలు లేకుండా చుట్టూ తిరుగు తున్నాయి.
గరుడుడు చక్రాలను ముష్టిఘాతంతో పొడి చేశాడు. రెక్కలు అల్లార్చి ధూళి కల్పించాడు.
సర్పాల మంటలను రెక్కల విసురుతో ఆర్పాడు. రెండింటినీ చేతులతో నలిపి విసిరేశాడు.
అమృత భాండానికి నమస్కరించి చేతుల్లో అందుకుని ఎగిరాడు. ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు.
దధీచి మహర్షి వెన్నెముకతో చేసినది కాబట్టి దేవతల రాజైన ఇంద్రునిది కాబట్టీ కాస్త గౌరవం చూపిస్తున్నానని - తనరెక్కలోని ఒక్క ఈక వదిలి ముందుకు సాగాడు. ఆకాశ మార్గంలో ఎగిరి వచ్చి ఇంద్రుడు సంధి చేసుకున్నాడు.
పాములు విషజీవులు. వాటికి అమృతం ఇస్తే లోకంలో అధర్మం చెలరేగుతుంది అది దైవం ఆమోదించడు అన్నాడు.
అమృతం అక్కడ ఉంచడం నా ధర్మం అన్నాడు గరుడుడు. ఐతే దాన్ని తీసుకుపోవడం నా కర్తవ్యం అన్నాడు ఇంద్రుడు. నీపని నీవు చెయ్యి, నాపని నేను చేస్తాను.
*సముద్రతీరం*
గరుత్మంతుడు అమృత భాండంతో దిగాడు. వినతాదేవి కద్రువలకు తలవంచి నమస్కరించాడు.
గరు:: తల్లీ ఈ అమృత భాండాన్ని వట్టి నేల పై ఉంచరాదు. పవిత్రములైన దర్భలతో ఆసనం ఏర్పరచు.
మరొక చోట ఇంద్రుడు క్రమంగా సూక్ష్మరూపం దాల్చి సముద్ర కెరటాల చాటున దాగివున్నాడు.
గరు:సోదరులారా - దైవ ప్రసాదమైన ఈ అమృతాన్ని భక్తితో శుచిగా స్వీకరించాలి. వెళ్లి సముద్రంలో స్నానాలు చేసి దైవధ్యానం చేస్తూ శుద్ధి మంత్రాలు చెప్పుకుంటూ వచ్చి ఆరగించండి.
కద్రువ దర్భలు తెచ్చి పరచింది. గరుడుడు అమృత భాండంతో ముందుకు వంగాడు.
గరు:: అమ్మా నువ్వు కోరిన ప్రకారం అమృత భాండం సమర్పిస్తున్నాను. పంచభూతాల సాక్షిగా - నీ వాగ్దానం ప్రకారం నా తల్లి వినతాదేవి నేనూ నీ దాస్య బంధాల నుండి విడుదల అవుతున్నాము. అవునుకదా?
కద్రు:సంతోషంగా విడుదల చేస్తున్నాను నాయనా. నిన్ను కన్నతల్లి ధన్యురాలు.
గరుడుడు భాండాన్ని దర్భలపై వుంచి లేచి నమస్కరించాడు.
గరు : (వినతతో) అమ్మా రా మనకిక స్వేచ్ఛ.
తల్లిని మూపుపైన ఎక్కించుకుని రివ్వుమని ఆకాశానికి ఎగిరాడు. కద్రువ సముద్రంలో స్నానం చేసే నాగులను చూసింది.
కద్రు : నాయనలారా రండి అమృతం ఆరగించండి.
ఆమె సముద్రం వైపు నడచింది. చూస్తుండగా పెద్ద కెరటం విరుచుకు పడింది. అది తగ్గే సరికి ఇంద్రుడు
నిలచి వున్నాడు. కద్రువ విస్తుపోయింది.
ఇంద్ర:: అమ్మా. వినతా సుతుడు తన ధర్మం నిర్వర్తించాడు. అమృత సంరక్షకునిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. ఇది దైవాజ్ఞ.
అమృత కలశాన్ని తీసుకుని మాయమై పోయాడు.
కద్రు :మోసం! అన్యాయం! ఘోరం.
నాగులు దర్భల దగ్గరకు వచ్చి ఆత్రంగా నాక సాగారు. కుయ్యో మొర్రో అన్నారు.
దర్భగడ్డికి అంచున ముళ్లు వుండడం వలన అందరికీ నాలుకలు రెండుగా చీలిపోయాయి. కద్రువ కూలబడిపోయి రెండు చేతులతో ముఖం కప్పుకుని భోరున ఏడ్వసాగింది.
***** *****
*యాగశాల*
శుక: కొద్దిక్షణాల సేపు అమృత భాండానికి పీఠంగా వున్న భాగ్యం వల్ల దర్భలు పవిత్రత పొందాయి. దైవ కార్యాలకు పూజలకు, దర్భలూ దర్భాసనాలూ శ్రేష్టతను సంతరించుకున్నాయి.
ఇదంతా గమనిస్తున్న చిద్విలాసుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిని పిలిపించాడు.
*వైకుంఠం*
శ్రీహరి: గరుడా! అమృత భాండం చేతులలో వుంచుకొని కూడా నువ్వు దానిని ఆరగించలేదు. నిజానికి ఆనాడు ఆరంభంలో అమృత సాధనలో సహాయపడిన నీకు అధికారం వుంది కూడా దానిని కోరలేదు. నీవు చిరంజీవిగా ధర్మపరుడవై జీవించు.
గరు: ధన్యోస్మి. నేను మరొక్క వరం కోరుకుంటాను. అనుగ్రహించ ప్రార్ధన.
జగదానంద నిలయమూ కల్యాణ ప్రదమూ అయిన నీ సాన్నిహిత్యం నిరంతరం ఉండాలని కోరుతున్నాను. అందుకు నీవు నన్ను వాహనంగా స్వీకరిస్తే దాసుడనై వుంటాను.
విష్ణువు మందహాసం చేశాడు.
శ్రీహరి : *ఈప్సితార్ధ సిద్ధిరస్తు!!*.
ఈ నీ కథ చెప్పుకున్న వారికీ విన్న వారికీ సకల శుభాలూ ఒనగూర గలవు.
*** *** ***
నారద:
ప్రభూ! నాదొక ధర్మ సందేహం. ఇప్పటి వరకూ భూలోకంలో దాస్యం చేసి ఇపుడే విముక్తి పొందిన ఈ ఖగేంద్రుడు తిరిగి దాస్యమే కోరడం విచిత్రంగా వుంది.
గరు: దేవర్షీ! ఈ దాసపదవి సామాన్యమైనది కాదు. ఇది శ్రీమన్నారాయణ భక్తి సామ్రాజ్యాధికార పదవి.
నార :శుభమస్తు - జయోస్తు.
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)
No comments:
Post a Comment