Wednesday, July 3, 2024

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*
*శ్రీహరి లీలామృతం 22వ భాగము*
*(సంక్షిప్త భాగవత గాథలు)*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸
*తృతీయ స్కంధం*
*5వ భాగము*
🌸🌸🌸🌸🙏🕉️🙏🌸🌸🌸🌸

*🌻బ్రహ్మ సృష్టి🌻*

🍃🌺"నేను సృష్టిస్తాను” అని బ్రహ్మ అనగానే దేహాభిమానంతో 'మోహం' పుట్టింది. భోగాసక్తితో మహా మోహం పుట్టింది. క్రోధం పుట్టింది. మరణభయంతో తమిస్రము, అంధతమిశ్రము పుట్టాయి. దానివల్ల చిత్తచాంచల్యం కలిగింది. వీటిని అవిద్యాపంచకం అంటాము. వీటితో సృష్టి పాపకార్యమని భావించి బ్రహ్మపశ్చాత్తాపానికి గురిఅయ్యాడు. భగవంతుని ధ్యానించడంతో పవిత్రుడైనాడు.

🍃🌺తరువాత బ్రహ్మ సత్వగుణ సంపన్నులైన సనకసనందనాదులను నలుగురు కుమారులను సృష్టించాడు. వారిని ప్రజోత్పత్తి చేయమన్నాడు. మేము శ్రీహరినే ఆశ్రయిస్తాము కాని సంసారులము కాము అని తిరస్కరించారు.

🍃🌺బ్రహ్మ ఆగ్రహంతో వుండగా, క్రోధస్వరూపుడైన నీలలోహితుడు జనించాడు. రోదిస్తూ పుట్టటం చేత అతనికి రుద్రుడు అనే నామకరణం చేశాడు. సూర్యచంద్రులు మున్నగు 11 మంది ఆయన నివాస స్థానాలు. 11 పేర్లుంటాయి. 11 మంది భార్యలుంటారు. “నీవు ప్రజాసృష్టిని చేయాలి” అని ఆదేశించగా, రుద్రుడు తనలాంటి ప్రజల్ని సృష్టి చేయడం ప్రారంభించాడు. రుద్ర గణాల స్వభావం తెలుసుకొని, బ్రహ్మ వారిని సృష్టి చాలించి తపస్సు చేసుకోమని కోరాడు. ఆ విధంగా వారు తపస్సులో మునిగిపోయారు. తరువాత బ్రహ్మ దక్షుని, నారదుని, పులహుని, పులస్త్యుని, భృగువును, క్రతువును, అంగిరసుని, విశిష్ఠుని, మరీచిని, అత్రిని ఆవిర్భవింపచేశాడు. కుడి వక్ష స్థలం నుండి ధర్మం, కన్నునుండి అధర్మం, మరణం పుట్టాయి. ఆత్మ నుండి మన్మథుడు పుట్టాడు. క్రోధము, లోభము, సరస్వతి జన్మించారు. సముద్రాలు, నిరృతి, కర్దముడు పుట్టారు.

🍃🌺బ్రహ్మ నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు వెలువడ్డాయి. చాతురోత్రమనే కర్మ తంత్రం ఏర్పడింది. ఋత్విక్కులు పఠించవలసిన మంత్రాలు వెలువడ్డాయి. ఉపవేదాలైన ఆయుర్వేదం మున్నగునవి ఏర్పడ్డాయి. ఇతిహాస పురాణాలు కర్మతాలువులు, ధర్మపాదాలు పుట్టాయి. బ్రహ్మచర్యం మున్నగు ఆశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. బ్రహ్మచర్యాన్ని సావిత్రం అంటారు. ఉపనయనం తర్వాత మూడు రోజులుచేసే గాయత్రీ జపాన్ని ప్రాజాపత్యం అంటారు. వేదవ్రతాలను ఆచరించడం బ్రహ్మం. వేదాలనుపూర్తిగా నేర్చుకొని ఆచరించడం నైష్ఠికం అంటారు.

🍃🌺వార్త, సంచయం, శానలీనం, శిరోంభం అని గృహస్థులు నాల్గు విధాలు. వైఖానసులు, వాలఖిల్యులు, ఔదుంబరులు, ఫేనపులు అనే నాలుగు విధాల వారు వానప్రస్థులు. కుటీచకులు, బహూదకులు, హంస, నిష్క్రియుడు లేక పరమహంస అను నాలుగు విధాలవారు సన్న్యాసులు. బ్రహ్మనుండి ఆన్వీక్షకి మున్నగు నాల్గు న్యాయవిద్యలు పుట్టాయి. అన్వీక్షకి అనే ఆత్మానాత్మ వివేకం ద్వారా మోక్షాన్ని సాధిచడం వేదాలలో చెప్పబడిన కర్మానుష్ఠానం ద్వారా స్వర్గఫలాలను పొందడం. వార్తా అంటే కృషి,వాణిజ్యాలు అర్థ సంపాదన విద్యను దండనీతి అంటారు.

🍃🌺బ్రహ్మముఖం నుండి భూః, భువః, సువః, మహః అనే నాల్గు వ్యాహృతులు వచ్చాయి. ఆయన హృదయకోశం నుండి ఓంకారం పుట్టింది. ఆరు ఛందస్సులు, 50 అక్షరాలు, 7 స్వరాలు, శబ్ద బ్రహ్మమూ - ఇవన్నీ ఆయననుండి వచ్చినవే.

🍃🌺ఇంత జరిగినా, అనుకున్నట్లు ప్రజాసృష్టి జరగలేదని బ్రహ్మ గ్రహించాడు. కారణం తెలియక దైవాన్ని ధ్యానించాడు. అతని దేహం నిలువుగా రెండు భాగాలైంది. ఒకటి స్వరాట్టుగాను, రెండవది దివ్య సుందరియైన శతరూపగానూ రూపొందాయి. వారిద్దరిని పెండ్లి చేసుకోండని బ్రహ్మ ఆదేశించాడు. ఇలా స్త్రీ పురుష సంయోగంతో సంతానోత్పత్తి, ఈ ఆది మిథునంతో ప్రారంభమైంది. అప్పటివరకు బ్రహ్మ శరీరం నుండియే సకల సృష్టి జరిగింది.

🍃🌺ఓ విదుర మహాశయా! బ్రహ్మ శరీరంనుండే కాదు, ఆయన మనోభావాల నుండి కూడా విభిన్న రీతుల్లో సృష్టి కార్యం జరిగింది. నేనిదివరకు చెప్పినట్లే భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వేశ్వరుడు 'కాలంలో ప్రవేశించి, పరమాత్మ సృష్టికార్యాన్ని మొదలు పెట్టడానికి ప్రకృతిని, కాలంచేత ప్రేరణ కలిగించేట్లు చేశాడు.

🍃🌺ఆ గుణాలతోనే ప్రకృతినుండి ఆ మహత్తత్త్వం వెలువడింది. రజోగుణంతో భూతాది అహంకారం వచ్చింది. సూక్ష్మ భూతాలను సృష్టి చేసింది. రాజసాహం కారంతో కూడిన సాత్వికాహంకారం నుండి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు వెలువడ్డాయి. ఇవి అన్యోన్యంగా లేకపోవడంతో అండము సృష్టి కాలేకపోయింది. భగవంతుడు వాటిలో కలిసి తగుపాళ్ళలో ఉండేటట్లు చేశాడు. దానితో ఒక బంగారంలాగ అండం తయారైంది. కాని ఆ అండంలో చైతన్యం లేదు. అంతకు ముందున్న జలంలో పడివున్నది. అపుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపంలో ఆ అండంలో వెయ్యి సంవత్సరాలు శయనించి ఉండగా, ఆయన నాభినుండి ఒక తేజోపద్మం జనించింది. అదే సకల జీవరాశికి స్థావరం. అందులోనే సకల జీవ స్వరూపుడైన బ్రహ్మ పుట్టాడు. లోకాలనూ సృష్టించాడు.

🍃🌺తమోగుణంతో అవిద్యను ఐదు విధాలుగా సృష్టించాడు. బ్రహ్మ విడిచిన శరీరం నుండి యక్షులు, రాక్షసులు పుట్టారు. వారు 'రాత్రి'ని ఆకలిగా కలిగివుండటం చేత ఆ శరీరాన్ని తినాలను కొన్నారు. కొందరు రక్షించుదామనుకొన్నారు. భక్షించుడు అన్నవారు యక్షులుగా, రక్షించు అన్నవారు రాక్షసులుగా పిలువబడ్డారు. అందుచేతనే బ్రహ్మ దేవతలను సృష్టించాడు. వారుతేజ స్వరూపులైనారు. బ్రహ్మ తన వెనుక భాగం నుండి అసురులను సృష్టించాడు. వారు గుణ ప్రధానులు. వారు బ్రహ్మను వెంబడించగా, బ్రహ్మ శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి చెప్పగా, తన శరీరాన్ని బ్రహ్మ విడిచాడు. దానినుండి 'సంధ్య' వెలువడి జగన్మోహనా కారంతో సంధ్యాసుందరిగా వెలసింది. 

🍃🌺అసురులు ఆమె వెంటపడి బ్రహ్మను వదిలేశారు. ఈమెయే సాయం సంధ్య. ఈమెతో యక్షరాక్షసులకు నెలవు రాత్రి వచ్చింది. దేవతలకు పగలు వచ్చింది. అసురులు సంధ్యాసుందరితో తృప్తి చెందగా, బ్రహ్మ అప్సరసలను, గంధర్వులను ప్రాతఃసంధ్యలో సృష్టించాడు. దేహాన్ని విడిచి పెట్టాడు. అది వెన్నెలకు, ఉషఃకాంతులకు స్థావరమైంది.

🍃🌺బ్రహ్మ సోమరితనంతో భూతాలు, పిశాచాలు వచ్చాయి. అతని ఉన్మాదం నుండి నిశాచర జీవులు వచ్చాయి. తరువాత బ్రహ్మ అదృశ్యుడై, పితృదేవతలను, సాధ్యులను సృష్టించాడు. ఆ తరువాత సిద్ధులను, విద్యాధరులను, కిన్నెర కింపురుషులను సృష్టించాడు. అతని వెంట్రుకల నుండి పాములు పుట్టాయి.

🍃🌺తరువాత శ్రేష్ఠులైన మనవుల్ని కల్పించి తన పురుష శరీరాన్నిచ్చాడు. ఋషిదేహం ధరించి ఋషిగణాలను సృష్టించాడు. తనఐశ్వర్యం, వైరాగ్యం అన్నీ వారికి సంక్రమింపజేశాడు. యజ్ఞయాగాదులూ, తపస్సులను నియోగించాడు.

🍃🌺విదురా! సృష్టిభావం ఆధారంగా బ్రహ్మదేవుడు అద్భుత విశ్వసృష్టిని కొనసాగించాడు. అందులో ఒకింత మాత్రమే నేను నీకు ఇపుడు వివరించాను.

*🌻జ్ఞానమైత్రేయము - స్వాయంభువ మనువు - ప్రజోత్పత్తి🌻*

🍃🌺స్వాయంభువ మనువు బ్రహ్మకు నమస్కరించి తానేమి చేయాలో చెప్పమని ప్రార్థించాడు. బ్రహ్మ అతనికి పరమేశ్వర బుద్ధితో సంతానోత్పత్తి చేస్తుండమని చెప్పాడు. బ్రహ్మపాలన చేయమన్నాడు కూడ. కాని వారికి నివాస స్థానం లేదు. భూమండలం జలంలో మునిగివుంది. బ్రహ్మ భగవంతుని ప్రార్థించగా, యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మ ముక్కునుండి బయటకు రప్పించాడు. వరాహమూర్తి పర్వతమంత ఎదిగిపోవడంతో శ్రీహరి కరుణకు బ్రహ్మ ఆనందించాడు. సకల లోకములు ఆయన్ని స్తుతించాయి. వరాహమూర్తి సముద్రంలోకి ప్రవేశించి ఛేదించి పాతాళలోకంలోకి చేరాడు.

🍃🌺సముద్రంలో దాగివున్న హిరణ్యాక్షుడు వరాహమూర్తిచే హతుడయ్యాడు. భూమిని పైకి తీసికొని వచ్చాడు వరాహమూర్తి. దేవతలు ఆ మహామూర్తిని ఈ విధంగా స్తుతించారు : "స్వామీ! నీవు యజ్ఞస్వరూపుడవు. యజ్ఞకర్తవు. యజ్ఞభోక్తవు, యజ్ఞఫలప్రదాతవు. యజ్ఞరక్షకుడవు. ఓ దేవా! సమస్తమూ . ఓ నీవే సృష్టించి, పాలించి, లయించేది నీవే కదా! నీ లీలలు వర్శించ మాకు సాధ్యం కాదు ప్రభూ” అని ప్రార్థించగా శ్రీహరి సంతోసించి భూమిని సముద్రం మీద సుస్థిరం చేసి అదృశ్యుడైనాడు.

🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹
         *🙏ఓం నమో వేంకటేశాయ🙏*
🌹☘️🌻🌻🌻🙏🌻🌻🌻☘️🌹

No comments:

Post a Comment