Sunday, July 7, 2024

 *నీడ - 2*
👤

*రచన : నండూరి శ్రీనివాస్*


చివరికి దేహంతో మాత్రమే అనుభవించా ల్సిన కర్మల కోసం మళ్ళీ ఇంకొక జన్మని ఎత్తుతుంది" వివరించారు దీక్షితులు.

"మరైతే దెయ్యాలూ, భూతాలూ అనేవే లేవా? ఉన్నవన్నీ సూక్ష్మ శరీరాలేనా?" మళ్ళీ సీరియస్ గా అడిగాడు. అతడి మొహంలో తెల్సుకోవాలనే ఆతృత చూసి
ఆయనకి సంతోషం కలిగింది. 

"మంచి ప్రశ్న! మరణం అనేది జీవ పరిణామంలో ఒక భాగం. దాని ద్వారా ప్రకృతి ఉత్తమగతులని కల్గించడానికే ప్రయత్నిస్తుంది కానీ అధోగతిని కాదు. అందుకే పోయిన వారిని మనం పరమ పదించారని అంటుంటాం. ఏ జీవైనా మరణించాకా వేరొక జన్మ ఎత్తుతాడు. కానీ తీవ్రమైన బాధతో ఆత్మహత్య చేసుకున్నా, తీవ్రమైన పగతో, ఈర్ష్యతో రగిలిపోతూ హత్య చేయబడినా సంపదలు ఎక్కడో దాచిపెట్టి అది ఎవ్వరికీ చెప్పకుండా చనిపోయినా అటువంటి వాళ్ళందరూ ఈ సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని మన చుట్టూ -తిరుగుతూ బతికుండగా చేయలేని పనుల్ని అప్పుడు చేయడం కోసం ఏదో ఒక శరీరాన్ని ఆవహించడానికి ప్రయత్నిస్తారు. వాటినే దెయ్యాల..." చెపుతున్న వాక్యం పూర్తవ్వకుండానే స్థాణువులా నిలబడిపోయారు.

శూన్యంలోకి చూస్తూ "మనం వెళ్ళాల్సిన అడ్రస్సు ఆ సంచీలో ఉంది. కాస్త తీసి చూడు నాయనా" అన్నారు గంభీరంగా. అప్పటికే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా దూరం నడిచి వచ్చారు. మెయిన్ రోడ్డుకి అటూ ఇటూ చాలా వీధులు ఉన్నా సరే ఆయన దేని దగ్గరా ఆగకుండా అక్కడే ఆగటం అతనికి చిత్రంగా వుంది.

అతడి సంచీ తెరిచి చూశాడు. లోపల ఒక నాలుగైదు పొట్లాలూ, రుద్రాక్షమాలా, దర్భల కట్టా, చిన్న కాగితమూ  కనిపించాయి. ఆ కాగితం నెమ్మదిగా తీసి చూశాడు. "మేడ పై వాటా, నెంబరు: 25 గరుడాచలం గారి ఇల్లు, పెద్దాడవారి వీధి” అతడు వీధి మొదట్లో అటూ ఇటూ చూశాడు. రోడ్డు పక్కగా ఉన్న స్తంభానికి ఒక చిన్న బోర్డు వేళాడుతోంది. దాని మీద దట్టంగా మంచు పరచుకుని ఉంది. అతడు ఆతృతగా వెళ్ళి బోర్డు మీదున్న మంచుని అరచేత్తో తుడిచి పరీక్షగా చూశాడు "పెద్దాడవారి వీధి ఇదే... రండి” అన్నాడు.

విచిత్రం! అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉగ్రంగా మారి విజృంభించింది.

పెద్ద గాలి దుమారం! రోడ్డు మీద దుమ్మంతా ఎగిరి సుడులు తిరుగుతూ వీళ్ళ మీదకొచ్చింది.

సుడిగాలి... మనుషుల్ని పైకి లేపేసేంత బలంగా... రోడ్డు పక్కన ఎండుటాకులూ, చెత్తా చెదారం...అన్నీ గిరగిరా తిరుగుతూ మొహాల మీద పడుతున్నాయి.

నించున్న చోట నిలువనీయట్లేదు. ప్రచండ వేగంతో విసిరికొడుతోంది. వాళ్ళిద్దర్నీ చెరో పక్కకీ లాగేస్తోంది.

ముందుకి కదలనీయకుండా ఏదో శక్తి, రెండు చేతులూ అడ్డం పెట్టి మరింత బలంగా వెనక్కి తోసేస్తున్నట్టు, వాళ్ళిద్దరి అడుగులూ వెనక్కి పడుతున్నాయి.
వాళ్ళు ఆ సందులోకి తిరగ్గానే అక్కడ ఉన్నట్టుండి వాతావరణం ప్రచండరూపం దాల్చడం సూర్యానికి ఆశ్చర్యమేసింది. మెడలో వేళాడుతున్న వీడియో కెమేరా ఎగిరిపోకుండా గట్టిగా పట్టుకుని, కళ్ళ ముందున్న దుమ్ముని- అరచేత్తో దులుపు కుంటూ “గురూ గారూ... గురూ గారూ” అంటూ బిగ్గరగా పిలిచాడు. 

“ఓం హ్రాం... హ్రీం... నమో భగవతే శ్రీ మహా హనుమతే...ప్రకట పరాక్రమ సకల దిగ్మండల యశోవితాన ధవళీ కృత జగత్రితయ... రుద్రావతారా...ఢాకినీ విధ్వంసనా” దీక్షితులవారు బడబానల స్తోత్రం బిగ్గరగా చదవటం మొదలు పెట్టారు.

"గ్రహముండ భూతమండల సర్వ పిశాచ మండలోచ్ఛాటన యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఊచ్చాటయ” అంటూ గంభీరమైన స్వరం.

కళ్ళు తెరిచి చూశారు. మంత్రం జపిస్తూనే అతణ్ణి తనతో రమ్మన్నట్టుగా సైగ చేశారు దీక్షితులు.

చిత్రం...! అప్పటిదాకా ప్రళయం సృష్టించిన గాలి ఎవరో అదిమిపెట్టినట్టు ఠక్కున ఆగిపోయింది.

రోడ్డుకి ఎడం పక్క ఇరవై ఒకటో నెంబరు ఇల్లు కనిపించింది. దాని తరువాత ఇరవై రెండూ... ఇరవై మూడూ... అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆయన్ని అనుసరిస్తున్నాడు. ఆయన మాత్రం తనలో తనే ఏదో గొణుక్కుంటున్నట్టుగా నెమ్మదిగా చదువుతూ నిశ్చింతగా నడుస్తున్నారు. ఇరవై నాలుగో నెంబర్ ఇల్లు...

ఇంకొక పది అడుగులు వేస్తే ఇరవై అయిదో నెంబర్ ఇల్లు వస్తుంది. అతడి గుండె వేగంగా కొట్టుకుంది. వెళ్లాలా వద్దా అన్నట్టు ఆయన వైపు చూశాడు.

ఆయన ఠక్కున ఆగిపోయి రోడ్డుకి ఇంకో పక్కన ఉన్న ఇంటి వైపుకి తదేకంగా చూశారు.

ఆ ఇంటి ముందున్న పొడుగాటి అశోక చెట్లు రెండూ దెయ్యం పట్టిన ఆడ మనిషిలా ఊగిపోతున్నాయి. హోరున శబ్దం చేస్తూ పిచ్చి గాలి! చుట్టుపక్కల ఇంక ఏ ఇళ్ళల్లోనూ ఒక్క చెట్టు ఆకు కూడా కదలటంలేదు. అతణ్ణి ఆ ఇంటి వైపు పదమన్నట్టు సైగ చేశారు. ఆ ఇంటి ప్రహరీ గోడ మీద నెంబరు లేదు.

" అతడు అనుమానంగా రెండడుగులు ముందుకేసి తొంగి చూశాడు. ప్రహరీకి అవతల ఇంటి గోడ మీద  '25' నెంబరు బోర్డున్నట్టు అతనికి కనిపిస్తోంది. అతడి గుండె ఝల్లుమంది. వెనక్కి తిరిగి ఆయన వైపు చూశాడు. ఆయన లోపలికి నడవమన్నట్టు సైగ చేశారు. అతడు రెండడుగులు ముందుకేసి గేటు తీద్దామ ని పైనున్న గొళ్ళెం మీద చేయేశాడు.

అంతే! కరెంటు షాక్కొట్టినట్టుగా దబ్బున వెనక్కిపడ్డాడు. ఆయన తీక్షణంగా అటు వైపు చూశారు!

అప్పటిదాకా పెదాల మీద కదలాడుతున్న మంత్రం మళ్ళీ ప్రతిధ్వనించింది. “సర్వ గ్రహోచ్ఛాటన...పరబలం.... క్షోభయ క్షోభయ...” మరింత గంభీరంగా.

గాలి కొంచెం తగ్గింది. ఈసారి అతడు ధైర్యంగా లేచెళ్ళి మళ్ళీ తలుపు గొళ్ళెం తీయబోయాడు. ఎంత తోస్తున్నా అది ఒక్క అంగుళం కూడా జరగలేదు. ఆయన వైపు అయోమయంగా చూశాడు.

ఆయన ఎడం చేత్తో యజ్ఞోపవీతాన్ని పిడికిలి బిగించి పట్టుకుని కుడిచేతిని ముందుకి చాపారు.

"సకల బంధన మోక్షణం కురు...కురు... నాగపాశా నంత వాసుకి తక్షక కర్కోటక కళాయాన్...యక్షకుల...జలగత... బిలగత... రాత్రించర...దివాచర సర్వాన్ నిర్విషం కురుకురు స్వాహా" అన్నారు. ఈసారి గడియ కొంచెం తేలిగ్గా జరిగింది.

అతడు ఆశ్చర్యంతో గేటు తీసి వారగా నిలబడ్డాడు. ఆయన ఠీవిగా ముందుకు నడుచుకుంటూ లోపలికి వచ్చారు. పైవాటా వైపు చూపుసారించి, మేడ మెట్ల వైపు నడిచారు!

సరిగ్గా వాళ్ళు మేడ ఎక్కబోయే నిముషం లోనే కింద వాటాలో ఉండే ఇంటి ఓనర్ గరుడాచలం గేటు చప్పుడు విని నిద్ర లేచొచ్చి కళ్ళు నులుపుకుంటూ కిటికీ లోంచి తొంగి చూశాడు. పైకెక్కుతున్న దీక్షితులవారు కనిపించారు.

“తెల్లారిగట్టే ఎవర్రా మీరు? చందాలకి వచ్చారా? వేళాపాళా అక్కర్లేదా?" అంటూ కేకలేస్తున్నాడు. దీక్షితులవారి భృకుటి ముడిపడింది. అతడి వైపు తీక్ష ణంగా చూశారు. సూర్యం కంగారుగా మెట్లు దిగి "ఆయన దీక్షితులవారు... రాజరాజేశ్వరీ ఉపాసకులు. మహా మంత్ర శాస్త్రవేత్త” అన్నాడు చెంపలేసుకుంటూ.

“అయితే ఏంటట? పొద్దుపొద్దున్నే ఇక్కడికెందుకు దిగబడ్డాడుటా?" అదే నిర్లక్ష్యంతో అన్నాడు మళ్ళీ. 

"మీ పైవాటాలో ఏదో దెయ్యం తిరుగు తోందట కదా! దాన్ని వదిలించడానికి వచ్చారు..." చెప్పాడతను.

అతడి వాక్యం పూర్తయ్యిందో లేదో, గరుడాచలం కంగారుగా తలుపు తీసుకుని బయటకొచ్చి "తప్పైపోయింద య్యా మన్నించండి. అవును దాన్ని మీరే వదిలించాలి. నా ఇంట్లోకి అద్దెకి రావడా నికి జనాలు హడలి ఛస్తున్నారు. ఇదిగో ఈ కొత్తవాళ్ళొచ్చి నాల్రోజులు కూడా కాలేదు. అప్పుడే పోతామంటున్నారు. ఎలాగైనా మీరే కాపాడాలయ్యా..." అన్నాడు వినయంగా చేతులు జోడిస్తూ. దీక్షితులవారు అతణ్ణి ఆపాదమస్తకం ఒక్కసారి పరికించి తన దారిన మౌనంగా పైకి నడిచారు.

గరుడాచలం ఓ వెర్రినవ్వు నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సూర్యం దీక్షితులవారి వెనకాలే మెట్లు ఎక్కి వెళ్తున్నాడు.
 👤

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment