Sunday, July 7, 2024

 *నీడ -3*
👤

*రచన : నండూరి శ్రీనివాస్*


మేడ పైన వాటాకి కటకటాల తలుపు వేసుంది! సూర్యం అది గమనించి ఆయన్ని తప్పించుకొని గబ గబా రెండు మెట్లు ముందే ఎక్కి తలుపు గొళ్ళాన్ని గట్టిగా కొట్టాడు. ఒక్క నిముషం ఆగి మళ్ళీ కొట్టబోతుంటే ఒకావిడ కంగారు పడి పరుగెత్తుకుంటూ వచ్చింది. మొహమంతా పీక్కుపోయి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో చిందరవందర జుట్టుతో ఉంది. దీక్షితుల వారిని చూడగానే చిందరవందర జుట్టును సరిచేసుకుని వినయంగా నమస్కరిస్తూ తలుపు తీసింది.

ఆయన కాళ్ళు కడుక్కోవడానికి పక్కనే ఉన్న బక్కెట్టు లోంచి పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్ళు తీసిచ్చింది. అంతే!

అంత పెద్ద చెంబూ ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ బలంగా తన్నినట్టు అమాంతం గాల్లోకి లేచింది.

సూర్యం నిశ్చేష్టుడై శిలా ప్రతిమలా నించుని చూస్తున్నాడు. దీక్షితులవారు చప్పున అతణ్ణి కిందకి లాగేరు. లేకపోతే అతడి బుర్ర రెండు చెక్కలయ్యుండేది.

ఆయన మాత్రం నుంచున్న చోటు నుంచి అంగుళం కూడా కదల్లేదు. కుడి చేయి పిడికిలి బిగించి ఆకాశం వైపు చాపారు. “పరయంత్ర...పరమంత్ర... పర విద్యాచ్ఛేదయ... చ్ఛేదయ... స్వమంత్ర స్వయంత్ర... స్వవిద్య ప్రకటయ ప్రకటయ..." అంటూ పైకి చూశారు.

అంతెత్తున లేచిన ఆ చెంబు గాల్లో గిరగిరా తిరుగుతూ వచ్చి సరిగ్గా ఆయన నించున్న మెట్టుకి పై మెట్టు మీద "ఠంగు..."మని పెద్దగా శబ్దం చేస్తూ పడింది.

అందులో నీళ్ళన్నీ ఎవరో చిలకరించినట్టు గా సరిగ్గా ఆయన పాదాల మీద పడ్డాయి. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంతలో ఆవిడ భర్త గోపాలం వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని దీక్షితులవారి కాళ్ళకి భక్తితో దణ్ణం పెట్టాడు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే సూర్యం చుట్టూ చూశాడు. ఆ ఇల్లంతా చిందరవందరగా ఉంది. నేల మీద బియ్యం, కూరగాయ లు, గ్లాసులూ, గిన్నెలూ చెల్లాచెదురుగా పడి వున్నాయి. దూరంగా చాప మీద చిన్నపిల్లాడు నిద్రపోతున్నాడు. ఆ ఇంట్లో అందరి మొహాలూ, పది లంఖణాలు చేసిన వాళ్ళల్లా నీరసంగా ఉన్నాయి.

ఆమె దీక్షితులవారిని కూర్చోమన్నట్టుగా కుర్చీ వున్న వైపు చూపించింది.

ఆయన కుర్చీలో కూర్చోకుండా, సూర్యం చేతిలో ఉన్న సంచీ తీసుకుని అందు లోంచి కొన్ని దర్భలు తీసి ఆ గదిలో ఈశాన్యం మూల పరచుకుని దాని మీద కూర్చున్నారు. ఆ ఇంటి ఇల్లాలి వైపు ఓసారి జాలిగా చూస్తూ- "ఇప్పుడు చెప్పమ్మా! ఏమిటి మీ కష్టం?" అన్నారు. అంతే! ఆమె దుఃఖం ఆపుకోలేక భోరు మంటూ ఆయన కాళ్ళపై పడింది. 

"మమ్మల్ని మీరే రక్షించాలి స్వామీ!" అని.

ఆమెని ఆప్యాయంగా లేవనెత్తారు. “నిన్నూ నన్నూ రక్షించేది ఆ జగన్మాతే. నువ్వేమీ భయపడకు" ఆయన గొంతులో నుంచి ప్రతిధ్వనించిన అభయంతో ఆమెకి ఎక్కడలేని ధైర్యమూ వచ్చింది. ఆయన ఎదురుగా నేల మీద కూర్చుని కళ్ళు తుడుచుకుంది.

"మేము ఈ ఇంట్లో లీజుకి దిగి మూడ్రోజు లయ్యింది స్వామీ! ఇక్కడకి వచ్చేవరకూ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఏ చెడ్డ ముహూర్తాన ఈ ఇంట్లో అడుగుపెట్టామో కానీ తిండీ నిద్రా లేక అల్లాడిపోతున్నాం. 
ఈ పాడు దెయ్యం మమ్మల్ని బ్రతకనిచ్చే లా లేదు" అంటూ వెక్కివెక్కి ఏడవటం మొదలుపెట్టింది. 

పక్కనే ఉన్న గోపాలం “ఇది చాలా చిత్రమైన సమస్య స్వామీ! తినటానికో, వండుకోడానికో ఏదైనా వస్తువు తీస్తే చాలు! అది రివ్వున గాలిలోకి లేచి, అంతెత్తు ఎగిరి కింద పడుతోంది. చివరికి తాగడానికి గ్లాసుతో మంచినీళ్ళు తీసినా సరే అవి కూడా పైకెగిరి కింద పడుతున్నా యి. అన్నం వండుకుందామని పొయ్యి మీద గిన్నెపెట్టి, నీళ్ళు పోసేవరకూ బానే ఉంటుంది. అందులో బియ్యం వెయ్యడ మే తరువాయి, ఆ నీళ్ళు రివ్వున ఎగిరి మా మొహాల మీదే పడుతున్నాయి.
మూడ్రోజుల్నుంచీ తిండీ తిప్పలూ లేక అల్లాడిపోతున్నాం! పిల్లాడికి పాలు కావాలన్నా పక్కింటికెళ్ళి పట్టాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలెన్నో మీరు చిటికెలో తీర్చారని ఎందరో చెప్పగా విన్నాం! మమ్మల్ని మీరే రక్షించాలి!" అంటూ ఆయన కాళ్ళమీద పడ్డాడు. 

"మరైతే ఈ ఇంట్లో ఉండటం ఎందుకు? ఖాళీ చేసేసి వెళ్ళిపోవచ్చుగా?" పక్కనే నించుని ఉన్న సూర్యం చప్పున అడిగి నాలిక్కరుచుకున్నాడు తప్పు చేసినట్టు. గోపాలం సూర్యం వైపు చురచురా చూశాడు. కొంప దీసి దీక్షితులవారు కూడా అదే సలహా ఇచ్చి వెళ్ళిపోతారే మో అనే భయం అతడి కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 

వెంటనే ఆమె కల్పించుకుని "మామూలు గా అందరూ లీజు లక్షరూపాయల దాకా అడుగుతున్నారు. ఈ ఇల్లు మాత్రం అరవై వేలకే దొరికింది కదాని కక్కుర్తి పడ్డాం. ఇరవై వేలు అడ్వాన్సు కూడా ఇచ్చి దిగాం. ఇప్పుడు దిగిన వెంటనే ఖాళీ చేస్తామంటే గరుడాచలం ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటున్నాడు" అంది బాధగా.

అప్పటి దాకా కళ్ళు మూసుకుని ఆ సంభాషణంతా శ్రద్ధగా విన్న దీక్షితుల వారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. "ఈ ఇంట్లో ఇంతకుముందెవరు అద్దెకుండే వారు?” 

గోపాలం తడబడుతూ “సరిగ్గా తెలీదు స్వామీ! ఎవరో పోస్టు మాస్టరనుకుంటా” అన్నాడు.

దీక్షితులు తూర్పు దిక్కుకి తిరిగి నిటారుగా కూర్చున్నారు. కళ్ళల్లో కారుణ్యం తొణికిసలాడుతోంది. "ఓం నమస్త్రిపుర సుందరీ... హృదయదేవీ, శిరోదేవీ శిఖాదేవీ..." ఆయన పెదవులు నెమ్మదిగా ఉచ్ఛరిస్తున్నాయి. ఆ క్షణంలో ఆయన మొహం చూసిన వారెవ్వరికైనా ఆ కష్టం ఆయనకే వచ్చిందేమో ఆ బాధని వివరించదానికి తన తల్లిని పిలుస్తున్నా రేమో అనిపిస్తుంది.

కాస్సేపు మంత్రాలు చదివి నెమ్మదిగా కళ్ళు తెరిచారు. "మండపం ఏర్పాటు చెయ్యాలి. కొంచెం బియ్యం తెచ్చి పెట్టమ్మా" అన్నారు.

బియ్యం పేరు చెప్పగానే ఆ ఇల్లాలు మొహంలో నెత్తుటి చుక్కలేదు. భయం భయంగా భర్త వైపు చూసింది. గోపాలం తెమ్మన్నట్టుగా సైగ చేశాడు.

ఆమె వణుకుతూ వెళ్ళి ఆ గదిలో ఓ వారగా ఉన్న బియ్యం డబ్బా మూత తీసింది. పక్కనే ఉన్న చేట తీసి, మూడు దోసిళ్ళ బియ్యం అందులో పోసింది.

బియ్యం పోస్తుంటే ఆమె చేయి గజగజా వణకటం స్పష్టంగా తెలుస్తోంది. డబ్బా మూత యథాప్రకారం పెట్టేసి చేట చేతి లోకి తీసుకుని వెనక్కి తిరిగింది.

అంతే! ఆమె చేతిలోని చేట ఒక్కసారిగా పైకెగిరింది! చేటలో ఉన్న బియ్యం గిర్రున ఎగిరి గది సీలింగుని తాకి జలజలా కిందకి రాలబోయాయి. అప్పటివరకూ కారుణ్యం తొణికిసలాడిన దీక్షితుల మొహంలో ఒక్కసారిగా కాఠిన్యం తొంగి చూసింది. తీక్షణమైన దృక్కులతో పైకి చూస్తూ చేయి గాల్లోకి చాపి ఆగమన్నట్టు గా సైగ చేశారు. ఇల్లంతా చెల్లాచెదురుగా పడిపోతాయనుకున్న బియ్యం కాస్తా ఎవరో పనిగట్టుకుని పొట్లంకట్టి నిదానం గా పోసినట్టుగా వచ్చి ఆయన కూర్చుని ఉన్న చోటుకి ఒక అడుగు ముందు చతురస్రాకారంలో నేల మీద పడ్డాయి. ఆయన చుట్టూ వున్న ముగ్గురూ ఆశ్చ ర్యంతో కట్రాటల్లా నిలబడిపోయి చూస్తున్నారు.

ఆయన చేతి సంచీ లోంచి రెండు పొట్లాలు బయటకి తీసి నెమ్మదిగా విప్పారు. ఒక దాంట్లో పసుపూ, ఇంకో దాంట్లో కుంకుమా ఉన్నాయి. గాలి బలంగా వీయడం మొదలుపెట్టింది! ఆయన చేతిలోని పొట్లాలు నెమ్మదిగా కంపిస్తున్నాయి. ఆయన అది గమనించి "కొంచెం మంచినీళ్ళూ, ఓ ఇత్తడి పళ్ళెం ఇచ్చి, మీరంతా దూరంగా పోయి నించోండమ్మా" అన్నారు.

ఆ ఇల్లాలు బిందెలో గ్లాసు ముంచి బయటికి తీయగానే గ్లాసు గాల్లోకి లేవ బోయింది. ఆయన కళ్ళు మూసుకున్నా రు. "మహావజ్రేశ్వరీ...శివదూతీ... త్వరితే... అణిమా సిద్ధే... లఘిమా సిద్ధే..." అన్నారు దీక్షితులు.

చిత్రం! చేతిలో గ్లాసు ఎగరకుండా అలాగే ఉంది. కానీ వణుకుతోంది. ఆ ఇల్లాలు, గ్లాసునీ పళ్ళాన్నీ ఆయన పక్కనే పెట్టి పరుగెత్తింది. గోపాలం, సూర్యం కూడా అక్కడి నుండి దూరంగా జరిగారు.
👤
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅

No comments:

Post a Comment