Saturday, July 13, 2024

నీడ - 6,7,8

 [7/13, 18:56] +91 90404 36395: *నీడ - 6*
👤

*రచన : నండూరి శ్రీనివాస్*


సంచి విసిరిన చోట గోడకి అంటించి ఉన్న వాల్ పోస్టర్ గుర్తుపెట్టుకుని శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకుని పరుగెత్తాడు. తరుముతున్న వాళ్ళందరూ మరింత వేగంగా అతని వేగంతో పోటీపడుతున్నా రు.

ఆ పార్కు లోపల వైపు గోడ పక్కనే ఓ ముసలామె చిరిగిపోయిన గొంగళీ కప్పుకుని కునికిపాట్లు పడుతోంది. పక్కనే దబ్బుమని ఏదో పడేసరికి ఉలిక్కిపడింది.

చిన్న చేతి సంచీ! తీద్దామా వద్దా అని రెండు నిముషాలు తటపటాయించి నెమ్మదిగా ఆ సంచీ మూతి విప్పింది. ఆనందంతో ఆమె కళ్ళు విప్పారాయి.

రెండు నిముషాలు ఆలోచించి ఆ సంచీ లోంచి ఒక్క అయిదొందల నోటు బయటకి తీసి మిగితా సంచీని అలాగే మూటకట్టి తను కప్పుకున్న గొంగళీలో కనిపించ కుండా చుట్టి పైకి లేచి అటూ ఇటూ చూసింది.

ఎవ్వరూ చూడట్లేదని నిర్ధారించుకుని పక్కనే బెంచీ మీద పడుకున్న కూతురిని నిద్ర లేపింది. ఆ అమ్మాయి చిరాగ్గా మొహం పెట్టి పైకి లేచింది. ముసలావిడ ఆమె చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. ఆ అమ్మాయి ఆశ్చర్యంతో చూసింది.

మరు నిముషంలో ఇద్దరూ పార్కు వదిలి రోడ్డు మీదకొచ్చారు. పక్కగా వెళుతున్నా ఆటో ఆపి గబగబా అందులోకెక్కి రైల్వేస్టేషన్ కి పోనీ అన్నారు.

వాళ్ళ ఒంటి మీదున్న చిరుగు బట్టలు చూసి ఆటోవాడు సందేహించాడు. ఆమె అది గమనించి అరచేతిలో ఉన్న అయిదొందల నోటు అతడికి కనపడేలా పట్టుకుంది. ఆటో శరవేగంతో రైల్వే స్టేషన్ వైపు దూసుకుపోయింది.

"ఇదంతా నమ్మశక్యంగా లేదమ్మా. కలా నిజమా అన్నట్టుంది..." గొంతు పెగల్చుకుని తల్లితో అంది.

"ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెల్సే! మీ నాన్నగారు నా కల్లో కనిపించి మన కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయని చెప్పారు..." అందామె మురిసిపోతూ. 

ఆ తల్లీ కూతుళ్ళు మరెవరో కాదు! పోస్టుమాస్టర్ రమణమూర్తి భార్యా కూతురూనూ.... డబ్బు పోగొట్టుకున్న పెద్ద మనిషి, ఇంటి ఓనర్ గరుడాచలం.


అందమైన పదెకరాల మామిడి తోట. దాని మధ్యలో తెల్లగా ఆకర్షణీయంగా మెరుస్తున్న పాలరాతి బంగళా! లోపలికి అడుగుపెట్టగానే అందమైన హాలు. పైనున్న పెద్ద షాండ్లియర్ హాలంతటికీ బంగారు పూతపూస్తోంది. హాల్లో ఎడం వైపు కిచెన్... కుడివైపు పూజా మందిరం!

హాల్లోంచి మేడ పైకి వెళ్ళడానికి రెడ్ కార్పెట్ పరచి ఉన్న పాలరాతి మెట్లు...
పదడుగుల పైకెళ్ళాకా అవి రెండు వైపులకీ చీలిపోయి కారిడార్ల వరకూ ఉన్నాయి. ఆ కారిడార్లలో చెరో వైపూ నాలుగేసి గదులు. ఆ ఇల్లు చూడ్డానికి ఇంద్రభవనాన్ని తలదన్నేలా ఉంది.

హల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్న 'మాయ' నెమ్మదిగా ప్రశాంతం గా ఊగుతోంది. ఆ పాలరాతి గదిలో ఆమె వయ్యారంగా ఉయ్యాల ఊగుతుంటే పాలసముద్రం మధ్యన హరివిల్లుని ఉయ్యాలగా చేసుకుని ఊగుతున్న క్షీరాబ్ది కన్యకలా ఉంది. వెన్నెల ముద్దతో చేసిన బొమ్మలా ఉంది.

ఆమె చేతిలో భాగవతం పుస్తకం! మృదు మధురమైన గొంతుతో శ్రావ్యంగా పద్యాలు చదువుతోంది.

ఎదురుగా ఉన్న సోఫాలో అరచేతిలో తలాన్చి హాయిగా పడుకుని చంపాదేవి తన్మయత్వంతో వింటోంది. రాత్రి పది గంటలయ్యిందని గుర్తుచేస్తూ గడియారం చాలాసేపు కొట్టింది.

"నేనెల్లొత్తానమ్మగోరూ..." పనిమనిషి గొంతు విని చంపాదేవి చటుక్కున తలెత్త చూసింది. "ఇంత రాత్రివేళ ఎక్కడికెళ్తావే సీతమ్మా! ఈరోజిక్కడే ఉండిపోవచ్చుగా" అందామె.

సీతమ్మ బుర్రగోక్కుంటూ "ఇంటికాడ మా మావ ఎదురు సూత్తా ఉంటాడమ్మా" అంది.

"సర్లే వెళ్ళిరా! రేపు తెల్లారిగట్టే వచ్చేయ్! కోడలు పిల్ల ఏడున్నరకల్లా ఊరికి బయల్దేరుతుంది” సీతమ్మ సరేనని తలూపి వెళ్ళబోతుంటే వెనక నుంచి మాయ, "సీతమ్మా! ఇంత రాత్రి ఒక్కద్దాని వే ఎలా వెళ్తావు గానీ డ్రైవర్ని దింపమని చెప్తానుండు” అంది. చంపాదేవి తనకి రాని ఆలోచన కోడలికి వచ్చినందుకు ఆమె వైపు మెచ్చుకోలుగా చూసింది.

సీతమ్మ మొహమాటపడుతూ “వద్దమ్మా నేను నడిసే ఎల్తాలే" అంది ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక.

"ఇన్నేళ్ల నుంచీ బంగళాలో పనిచేస్తున్నావ్
నీకు మొహమాటమేంటి సీతమ్మా!" అంటూ మాయ, డ్రైవర్ని కేకేసి సీతమ్మని దింపే పని పురమాయించింది.

"అత్తకి తగ్గ కోడలు. బంగారు తల్లి, చల్లగా వుండాలా” అని మురిసిపోతూ సీతమ్మ బయటకెళ్ళింది.

చంపాదేవి మళ్ళీ నడుంవాల్చి కళ్ళు మూసుకుంది. 

"చదువు కోడలా... మాంచి ఘట్టంలో వదిలేశావ్". మాయ ఇంకో పద్యం నెమ్మదిగా చదవడం మొదలుపెట్టింది.

"ఆదిన్... శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయం బుపై- పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్నమర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదై నాక రం బుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే..."

బుగ్గ మీద 'టప్'మని ఏదో తగలటంతో మాయ ఉలిక్కిపడింది. అది అందమైన ఎర్రటి గులాబీ మొగ్గ, చటుక్కున తలెత్తి చూసింది.

ఎదురుగా మేడ మీద, కారిడార్ లో నిలబడున్న శ్రీరామ్ తమకంగా ఆమెనే చూస్తున్నాడు. గడియారం వైపు చూపించాడు. మాయ నవ్వుతూ “పది దాటింది.. అంతేగా" అన్నట్టు సైగచేసింది. అతడు ఉక్రోషంగా చూస్తూ కళ్ళెర్రజేశా డు. ఆమె అతణ్ణి మరింత రెచ్చగొట్టేలా నవ్వింది.

చంపాదేవి కళ్ళు తెరిచి “ఆపేశావేంటి మాయా... చదువూ” అంది.

శ్రీరామ్ అరచేతితో నుదుటి మీద కొట్టుకున్నాడు. మాయ ఫకాల్న నవ్వి చదవటం మొదలుపెట్టింది.

“ఈ పద్యంలో మంచి చెమక్కు ఉందత్త మ్మా! బలి చక్రవర్తి దానగుణాన్ని ఓ పక్క వివరిస్తూనే లక్ష్మీ నారాయణుల శృంగారాన్ని అంతర్లీనంగా వర్ణించారు పోతన గారు” చంపాదేవి అర్థంకానట్టు చూసింది.

అది గమనించిన మాయ "శ్రీహరి చేతులు, శ్రీసతి కొప్పు మీద, తనువు మీద తచ్చాడుతున్నాయి. ఎప్పుడైతే పైట మీద పడ్డాయో శ్రీసతి కోపంతో కళ్ళెర్రజేసిందట. గతిలేక శ్రీనాథుడు కాళ్ళూ గెడ్డం పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే కరగని ఆడది ఉండదుకదా!

ఆవిడ కరిగిపోగానే ఆయన చేతులు ఒక్కసారిగా ఆమె స్తనద్వయం మీదకె ళ్ళాయిట. చెప్పిచెప్పకుండా శృంగారాన్ని వరుసక్రమం ద్వారా స్ఫురించేలా ఎంత గొప్పగా చెప్పారు పోతనగారు!" అంటూ మెచ్చుకుందామె. చంపాదేవి ఆనందంతో చప్పట్లు కొట్టింది.

"సెబాష్ కోడలా! ఇదే పద్యం ఇప్పటికి ఎన్నోసార్లు చదివాను గానీ నాకు ఈ భావం ఎప్పుడూ స్ఫురించనేలేదు. భాగవతం వినాలంటే నీ నోటి వెంటే వినాలి. ఏదీ ఇంకో మాంఛి పద్యం అందుకో!” అంది.

శ్రీరామ్ మేడ మీద వరండాలో కాలుగాలి న పిల్లిలా పచార్లు చేస్తున్నాడు. ఆఖరి మాట విని అతడికి ఒళ్ళు ఇంకా మండి పోయింది. 

"మాయా చాలా రొంపగా ఉంది. కాస్త విక్స్ రాసిపెడతావా?" అన్నాడు అసహనంగా.  మాయ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. చంపాదేవి, పడుకున్నదల్లా చప్పున పైకిలేచి "అబ్బాయి పిలుస్తున్నట్టున్నాడు చూడమ్మా" అంది.

"లేదత్తయ్యా! ఆయన గదిలోనే ఉన్నారు” అంటూ మాయ ఇంకో పద్యం అందు కుంది. శ్రీరామ్ కి ఒళ్ళు ఇంకా మండిపో యింది. గబగబా మెట్లు దిగి హాల్లోకి వచ్చి చంపాదేవి పక్కనే కూర్చున్నాడు. "మాయా! విక్స్ రాసి పెట్టమని ఇందాక ట్నుంచీ పిలుస్తున్నా కదా!" అన్నాడు గొంతు చించుకుంటూ.

మాయ నవ్వుతూ “దేవుడు రెండు చేతులిచ్చాడుగా, మీరే రాసుకోండి!” అంది చిరునవ్వుతో.

ఆ మాటల్లోని అంతరార్థం అర్థమై శ్రీరామ్ ఆమె వైపు తీవ్రమైన ఉక్రోషంతో చూశాడు.

చంపాదేవి అమాయకంగా చూస్తూ "ఏరా కన్నా! రొంప చేసిందా? అయ్యో ఇందాకనే చెప్పుంటే ఆ విక్సేదో సీతమ్మ రాసుండేది కదరా” అంది.

మాయ పగలబడి నవ్వింది. తెరలు తెరలుగా నవ్వుతూనే ఉంది. శ్రీరామ్ ఉడుకుమోత్తనంతో చూసి గబగబా మెట్లెక్కి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు.

చంపాదేవి నవ్వుతూ "మీ ఆయన మంచంపట్టి ఉన్నాడు కానీ వెళ్ళి పతి సేవ చేసుకోవే కోడలుపిల్లా" అంటూ కన్ను గీటింది. మాయ బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుతో తలొంచుకుని చంపాదేవి వైపు చూడకుండా గబగబా మేడ మీదకి పరుగెత్తింది. ఓరువాకిలిగా ఉన్న తలుపు తోసుకుని బెడ్రూంలోకి అడుగుపెట్టింది మాయ.

“కౌసల్యా సుప్రజా రామా... పూర్వా సంధ్యా...” గాలి తెరలు సుప్రభాతాన్ని అందంగా మోసుకొస్తున్నాయి. శ్రీరామ్ మంచం మీద అసహనంగా కదిలి అటు తిరిగి పడుకున్నాడు, కాస్సేపాగి గంట చప్పుడూ మంగళ హారతి పాటా మంద్రంగా వినిపించింది.

అతడు చిరాగ్గా పైకి లేచాడు. బద్దకంగా ఒళ్ళు విరుచుకుని గడియారం వైపు చూశాడు. ఆరున్నర...

"తెల్లారిగట్టే... పడుకోనీయకుండా ఈ గోలేమిటి మాయా" అన్నాడు. అతడికి చప్పున గుర్తుకొచ్చింది ఆ రోజే భార్య ఊరెళ్ళిపోతోందని! క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచం మీద నుంచి లేచి గబగబా మేడ మెట్లు దిగి హాల్లోకొచ్చాడు.

బయట వరండాలో చంపాదేవి నడుం మ్మీద చేతులేసుకొని నుంచుని పని వాళ్ళని గదమాయిస్తోంది. అతడు తల్లికి కనిపించకుండా చాటుగా అడుగులో అడుగేసుకుంటూ పిల్లిలా నడిచెళ్ళి చటుక్కున పూజ గదిలో దూరాడు. మాయ కళ్ళు మూసుక్కూర్చుని పూజ చేసుకుంటోంది. తెల్లటి కాటన్ చీర, జడ లో ఓ ఎర్రగులాబీ 'సింప్లీ బ్యూటీఫుల్...' అనుకున్నాడు.

మాయ హాల్లోకొచ్చేసరికి పనివాళ్ళు మెరిసిపోతున్న కొత్త బిందెలు నెత్తి మీద పెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ కారిడార్లో ఆపి ఉన్న క్వాలిస్ దగ్గరకెళ్ళి ఆ బిందెలన్నీ అందులో సర్దుతున్నారు.

"సారెంతా జాగ్రత్తగా ఎక్కించండర్రా... ఒక్క లడ్డూ చితికినా ప్రాణం తీస్తా జాగ్రత్త!" చంపాదేవి హాల్లో హడావుడిగా తిరుగుతూ సూపర్వైజ్ చేస్తోంది.

"అబ్బా అత్తయ్యా! ఈ తిప్పలన్ని ఎందుకంటే వినిపించుకోరు కదా! నాల్రోజుల్లో వచ్చేసే ప్రయాణానికి ఇంత లగేజా?" మాయ చిరుకోపంతో అంది.

"నువ్వూరుకో మాయా నీకేం తెలీదు! పెళ్ళయ్యాకా మొట్టమొదటిసారి పుట్టింటికెళ్తున్నావ్. నిన్నుత్తి చేతుల్తో పంపుతానా?" అందామె పెద్దరికంతో.

"అత్తమ్మా! సారె మా అమ్మ పెట్టి నన్నిక్క డికి పంపాలి గానీ మీరు పెట్టి నన్ను పుట్టింటికి పంపటమేంటీ విడ్డూరం కాకపోతే?" అంది సిగ్గు, నవ్వూ కలిపిన అభినయంతో.

"నేను కూడా నీ అమ్మలాంటిదాన్నే కదే! భగవంతుడు నాకు ఇద్దరూ కొడుకుల్నే ఇచ్చాడు. ఈ కూతురు ముచ్చట్లన్నీ ఎలా తీరాలి చెప్పు?" అందావిడ.

మాట్లాడుతూంటే ఆమె గొంతు గద్గదమ వ్వడం మాయ గమనించింది. చంపాదేవి ని ప్రేమగా హత్తుకుని ఆమె భుజమ్మీద తలవాలుస్తూ "అమ్మ లాంటి దానివి కాదు అత్తయ్యా! అమ్మకన్నా ఎక్కువ. ఇలాంటి ఇంటికి కోడలిగా రావాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలి" అంది. ఆమె కళ్ళల్లోంచి రాలిన నీటిబొట్లు చంపాదేవి భుజాన్ని పూరిగా తడిపేశాయి.
👤
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆
[7/13, 18:56] +91 90404 36395: *నీడ - 7*
👤

*రచన : నండూరి శ్రీనివాస్*


చంపాదేవి కంగారుగా చూసింది. "శుభమా అంటూ పుట్టింటికి వెళ్ళబోతూ ఈ కన్నీళ్ళేంటే?" అంది.

"నాకు మా ఇంటికి వెళ్ళాలని లేదు అత్తయ్యా. ఇక్కడే ఉండిపోవాలని ఉంది" అంది మాయ.

"వారం రోజులేకదే పిచ్చి పిల్లా. మీ చెల్లెల్ని అమెరికా పంపేసి పక్క రోజే వచ్చేద్దుగాని. పెళ్ళైన ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా నువ్వు పుట్టింటికెళ్ళలేదు. అక్కడి వాళ్ళందరూ నన్నాడిపోసుకోరూ?" అందావిడ ప్రేమగా.

ఈలోపు ఓ పనివాడు హడావుడిగా నడుచుకుంటూ వచ్చాడు. "డిక్కీ అంతా నిండిపోయింది అమ్మగారూ. ఇంకా తొమ్మిది బిందెలు మిగిలాయి. ఎక్కడ పెట్టించమంటారు?" చేతులు కట్టుకుని వినయంగా అడిగాడు.

"ఎక్కడేంట్రా! మొత్తం బండి లోపలంతా సద్దించేయ్. కోడలూ, డ్రైవరూ తప్ప ఇంకెవ్వరూ ఎక్కరుగా”.

మొత్తం ఖాళీయే అంటూ మాయ వైపు చూసింది. మాయ వరండాలో నించుని కృతజ్ఞత నిండిన కళ్ళతో చంపాదేవి వైపు తన్మయంగా చూస్తోంది.

తీసుకెళ్ళిన సారె అంతా ఆ కారులో సర్దటం పూర్తయ్యేసరికి గడియారం ఏడు గంటలు కొట్టింది.

"మాయా! వెళ్ళి త్వరగా తయారవ్వమ్మా ఏడున్నరయ్యేసరికి నువ్వు బయల్దేరాలి మళ్లీ రాహుకాలం వచ్చేస్తుంది...” చంపాదేవి ఆమెని కంగారుపెట్టసాగింది.

"నేను రెడీగానే ఉన్నానత్తయ్యా...
బయల్దేరడమే తరువాయి" అంది మాయ సమాధానమిస్తూ.

“నీ మొహం! ఈ చీరతో వెళ్తావా? పుట్టింటికెళ్తుంటే మన హోదాకి అంతస్తుకీ తగ్గట్టుగా ఉండదూ. పైకెళ్ళి పట్టుచీర కట్టుకురా నా తల్లి" అంది చంపాదేవి.

"అబ్బా...పట్టుచీర వద్దత్తయ్యా...బండిలో
ఉక్కపోసేస్తుంది.. ప్లీ...జ్!” అని తన అసౌకర్యాన్ని చెప్పింది.

"ఏసీ కారులో ఉక్కేంటే....చెప్పినట్టు చెయ్యి" అంటూ కోడల్ని బలవంతంగా లోపలికి తోస్తూ “చీర మార్చుకోడానికి అబ్బాయి ఉన్న గదిలోకి మాత్రం వెళ్ళకు... రాహు కాలం వచ్చేస్తుంది" అంది ముసిముసిగా నవ్వుతూ.

పది నిముషాల్లో మాయ పట్టుచీర కట్టుకుని, జుట్టు సవరించుకుంటూ హాల్లోకి వచ్చింది.

చంపాదేవి తేరిపారా చూస్తూ “మహాలక్ష్మిలా ఉన్నావు తల్లీ... నా దిష్టే తగిలేలా ఉంది" అంటూ గబగబా తన గదిలోకెళ్ళి ఒక హారంతో తిరిగొచ్చింది.

"ఇది కూడా పెట్టుకోమ్మా..." అంది. మాయ ఆశ్చర్యంగా చూసింది.

అందమైన వజ్రాలహారం, మధ్యలో అర చేయంత పెద్ద సూర్యపతకం. కళ్ళుచెదిరే నగిషీ పని, దాని విలువ కోటి రూపాయల కి పైనే ఉంటుంది.

చంపాదేవికేసి అయోమయంగా చూస్తూ “ఇదేంటి అత్తయ్యా?" అంది ఏమిచేయా లో తోచక.

"ఇది మన తరతరాలుగా వస్తున్న హారం మాయా... మా అత్తగారు నాకిచ్చింది. నేను నీకిస్తున్నాను. ఇదిగో ఇటు చూడు." అంటూ హారాన్ని వెనక్కి తిప్పింది. దాని వెనకాల చిన్న చిన్న అక్షరాల్లో చాలా పేర్లు చెక్కి ఉన్నాయి. కొన్నైతే కనిపించకుండా అరిగిపోయి ఉన్నాయి. ఆఖరి పేరు మాత్రం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 'మాయ' అని ఉందక్కడ మెరుస్తూ.

మాయ ఆశ్చర్యంగా చూసింది. చంపాదేవి నవ్వుతూ "ఆచారితో చెప్పి మొన్ననే నీ పేరు కూడా చెక్కించాను. ఇక నుంచీ, నీకు కోడలొచ్చేవరకూ ఈ హారం నీదే” అంది చంపాదేవి ప్రశాంతంగా నవ్వుతూ.

మాయ ఆ హారాన్ని తదేకంగా చూస్తోంది.

చంపాదేవి దాన్ని మాయ మెడలో వేసి "అబ్బా... ఇప్పుడు హారానికే అందమొ చ్చిందే కోడలా... ఇంక పద... మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది" అంటూ ఆమెని చేయి పుచ్చుకుని వాకిట్లోకి తీసుకెళ్ళింది.

పనివాళ్ళందరూ వరసగా నిలబడి మాయనీ, హారాన్నీ మార్చి మార్చి చూస్తున్నారు. చంపాదేవి కళ్ళెర్ర చేసి చూస్తూ- "అలా ఎగాదిగా చూడకండ్రా! నా కోడలికి దిష్టి తగుల్తుంది" అంది యజమాని హోదాలో. మాయ నవ్వుకుంటూ చంపాదేవి కాళ్ళకి దణ్ణం పెట్టింది.

"క్షేమంగా వెళ్ళిరామ్మా! వారం రోజుల్లో వచ్చేసేయ్. నువ్వు లేకపోతే నాకు కాళ్ళూ చేతులూ ఆడవు" అంది. చెప్తుంటే ఆమె గొంతు గద్గదం అవ్వడం గమనించి.

మాయ ఆమెని ప్రేమగా హత్తుకుంది. "మీకే కాదు అత్తయ్యా! మిమ్మల్ని చూడక పోతే నాక్కూడా తెల్లారదు. వెంటనే వచ్చేస్తానుగా" అంటూ కారు వైపు నడిచింది. చంపాదేవి కంగారుగా “మర్చిపోయా మాయా! నీకిష్టమని, పొద్దున్నే లేచి జీడిపప్పు ఉప్మా చేశా, ఓ రెండు ముద్దలు తినేసి వెళ్ళవూ?" అంది.

మాయ కంగారుపడుతూ గడియారం వైపు చూస్తూ- "ఇప్పుడొద్దు అత్తమ్మా! రాహుకాలం వచ్చేస్తోంది. మళ్ళీ మీరే బాధపడతారు. అయినా మీరూ, నేనూ ఎక్కడికి పోతాం? వారం రోజుల్లో వచ్చేస్తా కదా! అప్పుడు రోజూ మీరు జీడిపప్పు ఉప్మా చేయడం, నేను కడుపునిండా మేయడం... చేయడం... మేయడం, అదే పని" అని గలగలా నవ్వుతూ, కార్ డోర్ తీసింది. లోపలికి ఎక్కబోతూ, ఓసారి వెనక్కి తిరిగి-

"అయినా ఏ మాటకా మాట చెప్పుకోవా లి. జీడిపప్పు ఉప్మా తినాలంటే నీ చేతిదే తినాలి అత్తమ్మా! అబ్బ ఆ టేస్టూ... ఆ ఘుమఘుమ తల్చుకుంటేనే నోరూరు తోంది” అంటూ నాలికతో పెదాల్ని తడుపుకుంది.

పైన బాల్కనీలో శ్రీరామ్ నిలబడి ఆమెనే చూస్తున్నాడు. అతడి నీడ, తోటలో నేల మీద పడుతోంది. అది గమనించిన మాయ తల పైకెత్తి చూసింది. అతడు చేయూపాడు. ఆమె కూడా చేయి ఊపింది.

సరిగ్గా మాయ కారులో అడుగుపెట్టబోయే సమయానికి పై నుంచి "మాయా... ఆగు” అని శ్రీరామ్ గొంతు కంగారుగా వినిపించింది. మాయ చటుక్కున తలెత్తి అటు వైపుగా చూసింది.

చంపాదేవి విసుక్కుంటూ- "వెళ్తుంటే వెనక్కి పిలుస్తాడు, మళ్ళీ ఏమొచ్చిందే వీడికి?” అంది. ఈ లోపల శ్రీరామ్ మేడ మీద నుంచి గబగబా దిగి పరుగెత్తు కుంటూ బయటకొచ్చాడు. రొప్పుకుంటూ సరాసరి డ్రైవింగ్ సీటు దగ్గరికెళ్ళాడు. విసురుగా డోర్ తీసి, డ్రైవర్ ని కాలర్ పట్టుకుని బయటకిలాగుతూ “ఎవడ్రా నువ్వు?" అన్నాడు ఆవేశంగా... 

“నా పేరు... నా పేరు అబ్దుల్లా సాబ్” అన్నాడు అతడు. 

“నువ్వెలా వచ్చావురా? మా డ్రైవర్ యాదగిరేడీ?” అతని కాలర్ వదల్లేదు. వాడు భయంతో బిత్తరచూపులు చూస్తున్నాడు. పక్కనే ఉన్న పనిమనిషి సీతమ్మ కల్పించుకుని, “యాదగిరి ఈ ఉదయాన్నే ఊరెళ్ళాడటయ్యా... పొద్దున్నే ఓ కుర్రాణ్ణి కబురంపాడు. ఈ రోజు కోడలిగారి ప్రయాణముందికదాని, వాడే ఈ డ్రైవర్ని పంపాడు" అంది.

శ్రీరామ్ అనుమానంగా చూస్తూ "వీడి మొహం చూస్తే, అసలు డ్రైవింగే వచ్చిన ట్లుగా అనిపించట్లేదే” అన్నాడు. అబ్దుల్లా ఉక్రోషంగా చూశాడు. 

"డ్రైవింగ్ లో పదేళ్ళ ఎక్స్ పీరియన్స్. ఏంది సాబ్ అలా అంటావు... లైసెన్సు చూస్తావేంది?" అన్నాడు.

శ్రీరామ్ ఎందుకోగానీ అంతగా సమాధాన పడలేదు. రెండు నిముషాలు ఆలోచించి, "అమ్మగార్ని నేనే దింపుతాగానీ నువ్వు పోరా" అన్నాడు. 

మాయ కంగారుగా, “అదేమిటండీ, డ్రైవర్ ఉండగా మీరు రావడం దేనికి?" అంది కళ్ళార్పుతూ. 

శ్రీరామ్ చిరాగ్గా చూస్తూ- "ఏమో మాయా ఎందుకో వీణ్ణిచ్చి పంపడానికి నాకు మనస్కరించట్లేదు. నేనే దింపుతాలే” అన్నాడు మాయకు సమాధానమిస్తూ. 

చంపాదేవి చిరాగ్గా చూస్తూ- "ఒరేయ్ పెళ్ళాం మీద ప్రేమ ఉండడం మంచిదే గానీ, మరీ ప్రతి దాన్నీ అనుమానించేంత ఉండక్కర్లేదురా..." అంది. 

"లేదమ్మా! మాయని నేనే దింపుతాను. ఉండు బట్టలు మార్చుకునొస్తా" అంటూ ఇంట్లోకి పరుగెత్తబోయాడు.

ఈలోపు గడియారం ఠంగుమని మోగింది. చంపాదేవి కంగారుపడుతూ- "నీ అనుమానం కూలా. ఒరేయ్ నువ్వు తయారై వచ్చేసరికి రాహుకాలం వచ్చే స్తుందిరా! వెళ్తున్నదాన్ని ఆపకు, వెళ్ళనివ్వు. నీకంత అనుమానంగా ఉంటే నేను కూడా కోడలితో ఊరు చివ్వరి వరకూ వెళ్తాలే... ఎలాగూ రాజరాజేశ్వరీ దేవస్థానానికెళ్ళి దీక్షితులవార్ని కలవాలి" అంటూ జుట్టు సవరించుకుని, గబుక్కున కారెక్కింది. సారె బిందెల్ని కొంచెం సర్ది, మాయపక్కనే కూర్చుంది చంపాదేవి.

మాయ కారెక్కి, తల బైటకి పెట్టి- "మీకు పదిగంటలకి బోర్డ్ మీటింగ్ ఉందన్నారు కదండీ! మర్చిపోయారా” అంది. మీటింగ్ సంగతి గుర్తురాగానే శ్రీరామ్ మొహంలో పట్టుదలపోయింది. సరేనన్నట్టుగా తలూపి, డ్రైవర్ కేసి తిరిగి, "అమ్మగార్ని జాగ్రత్తగా దింపు. ఆట్టే స్పీడెళ్ళకు, జాగ్రత్త" అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా వేలు చూపించాడు.

చంపాదేవి నవ్వుకుంటూ-"అబ్బో!అక్కడికేదో నీ ఒక్కడికే పెళ్ళాం ఉన్నట్టు... నువ్వూ, నీ హడావుడీనూ" అంటూ "సీతమ్మా కాస్త బండికి శకునం రావే" అంది. సీతమ్మ పరుగెత్తుకుంటూ కారుకి ఎదురొచ్చింది.

మాయ వదిలి వెళ్ళడం ఇష్టంలేనట్టుగా శ్రీరామ్ వైపు చూస్తూ- "వెళ్ళొస్తానండీ" అంటుంటే, కారు స్పీడందుకుంది. సరిగ్గా అదే క్షణంలో కారుకి అడ్డంపడి, తుర్రున పరుగెత్తుకెళ్ళిన నల్ల పిల్లిని చంపాదేవి గమనించలేదుగానీ, గమనించి ఉంటే ఆ రోజు ప్రయాణాన్ని మాన్పించేసేది! ఆ ఇంటికి అతి పెద్ద అనర్థం తప్పేది!
👤

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉
[7/13, 18:56] +91 90404 36395: *నీడ - 8*
👤

*రచన : నండూరి శ్రీనివాస్*


గర్భ గుడిలో నాలుగడుగుల ఎత్తు రాజ రాజేశ్వరీ విగ్రహం మహా సౌందర్యంతో వెలిగిపోతోంది! దీక్షితులవారు విగ్రహానికి ఎదురుగా పద్మాసనం వేసుక్కూర్చుని, పరిసరాలు మర్చిపోయి, పారవశ్యంతో తదేకంగా చూస్తున్నారు. సూర్యం గర్భ గుడి గడపకి ఇవతల కూర్చునున్నాడు.

"ఈ రెండు రోజులూ ఎలా గడిచాయో నాకే తెలీదు గురూగారూ. హెడ్మాస్టారు నన్ను మీ దగ్గరకి పంపినప్పుడు ఓ వ్యాసానికి సరిపడా విషయాలు మీ దగ్గర తెల్సుకుందామనే వచ్చాగానీ, ఇలా నా జీవితకాలానికి సరిపడ అనుభవాలు దొరుకుతాయని కల్లోనైనా ఊహించలేదు” కృతజ్ఞతనిండిన కళ్ళతో అన్నాడు.

ఆయన సూర్యం వైపు చూస్తూ ఒక చిరు నవ్వు నవ్వి, పైకి లేచారు. అమ్మవారి విగ్రహం మీదున్న వాడిపోయిన పూలు ఒక్కొక్కటే జాగ్రత్తగా తీసి, పక్కనే కూర్చుని ఆయనకి సహాయం చేస్తున్న చిన్న కుర్రాడికి అందిస్తున్నారు.

అతడు వాటిని నైరుతి మూల పోగేస్తున్నాడు. ఆయన అమ్మవారి పాదం కింద తన ఎడం అరచేతిని ఆన్చి, కుడి చేత్తో ఆ పాదమెక్కడ తన చేయి తాకిడికి కందిపోతుందో అన్నంత సున్నితంగా పాదాల మీద ఉన్న కుంకుమని పళ్ళెం లోకి తీసి, భక్తితో కళ్ళకద్దుకుని ఆ కుర్రాడి చేతి కందించారు. నెమ్మదిగా ఏదో మంత్రాన్ని ఉచ్ఛరిస్తున్నారు.

"నేనీ రోజు మీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నా గురూగారూ" సూర్యం నెమ్మదిగా అన్నాడు ఆయనతో. ఆయన ఆప్యాయంగా చూస్తూ- "శుభం నాయనా! వీలున్నప్పుడల్లా వచ్చి పోతూ ఉండు" అన్నారు. 

"నా మనస్సుని తొలిచేస్తున్న కొన్ని ప్రశ్నలున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు అడగచ్చాండీ?" 

"మనస్సుని వీలున్నంత వరకూ ఖాళీగా ఉంచుకోవాలయ్యా! దాచుకోవడమెందు కు? అడుగు..."

అతడు సంతోషంగా తన భుజానికి వేళ్ళాడుతున్న బ్యాగ్ లోంచి పెన్నూ, పుస్తకం బయటికి తీశాడు. "గురుగారూ! రమణమూర్తి ఆత్మని ఏ సీసాలోనో బంధించి, భూస్థాపితం చేయకుండా అలా విడిచిపెట్టేశారేంటండి?”

ఆయన నవ్వుతూ-“నీకు మన సినిమాలు బాగా వంట పట్టినట్టున్నాయే" అని ఒక్క క్షణం ఆగి, "ఆత్మని ఎవ్వరూ బంధించ లేరు నాయనా! భగవద్గీతలో ఆత్మని గురించి చెప్తూ-నైనం ఛిందంతి శస్త్రాణి, వైనం దహతి పావకః న చైనం క్లేదయన్యాపో, నశోషయతి మారుత:' అన్నారు. ఆత్మని గాలి, నిప్పూ, నీరూ అలాంటివేవీ తాకలేవని దాని అర్థం. సుఖమూ, దుఃఖమూ, అశాంతి, శాంతీ ఇవేవీ అంటనిదే ఆత్మస్థితి. అలాం...” ఆయన మాటల్ని మధ్యలోనే ఆపుచేశాడ తను. 

“మరైతే చనిపోయినవాళ్ళని గురించి చెప్తూ "ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం" అని సంతాప సభల్లోనూ, పేపర్లలోనూ పెద్ద పెద్ద వాళ్ళందరూ రాయడం చూస్తూ ఉంటాంగా! ఆత్మకి శాంతీ, అశాంతీ అంటకపోతే, మరి అదేంటండీ?" అడిగాడు అనుమానంగా.

"అది తెలీక వాడే పదం బాబూ! శాంతి అశాంతీ అంటుకునేవి జీవుడికి మాత్రమే. ఆత్మ వీటన్నిటికన్నా చాలా పై స్థాయిలో ఉంటుంది. అదీ విషయం”

అతడు తలవంచుకుని, పుస్తకంలో గబగబా ఏదో రాసుకోవడం గమనించి మళ్ళీ ఆయనే అన్నారు.

"ఇందాక నువ్వు, రమణమూర్తి జీవాత్మని బంధించకూడదా అని అడిగావు చూడు, అతడు అప్పుడున్న స్థితికన్నా పెద్ద బంధ నం వేరే ఏముంటుందయ్యా చెప్పు? అతడి జీవాత్మ సూక్ష్మ శరీరంలో బంధింప బడి అల్లాడుతోంది. చాలా దయనీయ మైన స్థితది. శరీరంతో ఉండగా ఏదైనా కష్టమొస్తే, దాన్ని అనుభవించకుండా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని, ఆ బాధ నుంచి తప్పించుకుందామని అనుకుంటారు పిచ్చి జనాలు. కానీ ఆత్మహత్య చేసుకునే క్షణంలో తర్వాత జీవుడు అనుభవించే నరకయాతనేమిటో ముందే తెలిస్తే ఈ లోకంలో ఎవ్వడూ ఆత్మహత్యే చేసుకోడేమో?”

“ఆత్మహత్య తరువాత శరీరాన్నొదిలి బయటకొచ్చిన జీవుడు అటు ఊర్ధ్వ స్థితిని పొందలేక, ఇటు పోగొట్టుకున్న శరీరాన్ని తిరిగి తెచ్చుకోలేకా దుర్భరమైన బాధపడతాడు. దాన్ని తప్పించుకుందా మంటే ఇంకో ఆత్మహత్య సాధ్యం కాదుగా! ఎంత కాదనుకున్నా దాన్ని అనుభవించాల్సిందే. అలాంటి జీవుల మీద మనం జాలిపడి, ఉత్తమ స్థితులు కలగాలని కోరుకోవాలి. వాళ్ళకి స్వేచ్ఛ లభించాలని ప్రేమతో ఆకాంక్షించాలి. మనుషులుగా మనం చేయగలిగింది అదొ క్కటే. కొందరికి దెయ్యం పట్టిందంటూ భూత వైద్యులు హింసించడం, చీపుర్లతో కొట్టడం లాంటి పశుప్రాయమైన పిచ్చి విధానాల్ని అనుసరించడం మనం చూస్తూ ఉంటాం. అది అమానుషం. అలాంటి రోగుల్లో ఉన్న భూతావేశాన్ని దైవ స్వరూపంగా చూడగలిగితే, వారిని ప్రేమతో ఆదరించగలిగితే, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించగలిగితే వారి బాధని సులువుగా తగ్గించవచ్చు" అన్నారు. 

అతడు నోట్  బుక్ లో గబగబా ఏదో రాసుకున్నాడు. ఆయన పక్కనే ఉన్న కుర్రాడు దీపాల్లో వత్తులేసి, నూనె నింపి వాటిని వెలిగించాడు.

ఓ పది అగరబత్తులు వెలిగించి స్టాండులో పెట్టాడు. క్షణంలో గర్భగుడంతా పొగతో నిండిపోయింది. అగరబత్తి పొగ సూటిగా తన వైపే వస్తూ ఉండటంతో, ఆ కుర్రాడు ఊపిరాడక దగ్గుతూ ఆ అగర బత్తులని, తను కూర్చున్న చోటు నుంచి దూరంగా, అమ్మవారి విగ్రహానికి దగ్గరగా జరిపాడు. ఆ పక్కనే కూర్చుని శ్రీచక్రాన్ని శుభ్రం చేస్తున్న దీక్షితులవారు చివుక్కున తలెత్తి అతడి వైపు చూసి, "నీకు దగ్గొస్తోందని చెప్పి ఆ అగరబత్తులని అమ్మకి దగ్గరగా పెట్టావే! నువ్వే భరించలేని ఆ పొగని, కుసుమ కోమలమైన ఆ తల్లి ఎలా భరి స్తుందిరా? ముందరి అవి తీసి దూరంగా పెట్టు" అన్నారు కోపంగా!

అతడు అయోమయంగా చూస్తూ, వాటిని గర్భగుడి గుమ్మానికి అవతలగా పెట్టాడు. ఆయన శుభ్రం చేస్తున్న యంత్రాన్ని సూర్యం కన్నార్పకుండా చూస్తూ "గురూగారు, అసలీ యంత్రాలూ, మంత్రాలూ అవన్నీ అవసరమా? హోమాలూ, యజ్ఞాలూ చేయడం వల్ల ఉపయోగమా?" అనడిగాడు. 

ఆయన నవ్వుతూ, “అబ్బో... వైదిక ధర్మాలన్నింటినీ ఒకే వాక్యంలో జోడించి అడిగేశావే. సరే... ఒక్కొక్కటే నీకు 
అర్థమయ్యేలా చెప్తానుండు” అంటూ పైకి లేచి, అమ్మవారిని అలంకరిస్తూ చెప్పడం మొదలుపెట్టారు.

“మన భారతీయ వైదిక ధర్మంలో అర్థ రహితమైనది ఏదీ లేదు నాయనా! మన సనాతన ధర్మానికి మొదట్నుంచీ అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైనది, ప్రముఖమైనది 'సైంటిఫిక్ ఛాలెంజ్!' మన సనాతన సాంప్రదాయాల వెనుక సైన్సు లేదని కొట్టిపారేసేవాళ్ళు తయారయ్యారు. పదో తరగతి పదిసార్లు తప్పినవాడికి కూడా మన వైదికధర్మాన్ని ప్రశ్నించడం ఫ్యాషనైపోయింది. దాన్నే సైంటిఫిక్ టెంపరిమెంట్ అంటారు. అవన్నీ అజ్ఞానంతో, తెలీనితనంతో మాట్లాడే మాటలే. తరచి చూస్తే మన భారతీయమైన ప్రతి సిద్ధాంతం వెనుకా ఫిలాసఫీ, సైన్సూ మిళితమై ఉన్నాయి.

మొదట్లో మన వైదిక సిద్ధాంతాలని చూసి 'మీదంతా బోగస్', మీ సంస్కృతి వేస్ట్, మీకు నాగరికత మేము నేర్పిస్తాం' అంటూ తెల్లవాడు తెలివితేటలతో మనల్ని తక్కువ చేసి పాలించాడు. స్వాతంత్య్రం వచ్చినా సరే, ఈనాటికీ వాడి అడుగులకి మడుగులొత్తుతూ, మన సంప్రదాయాలకి సున్నా చుట్టి, నాగరికత పేరుతో మనం ఇంకా వాడి వెనకాలే పడుతున్నాం!

ఏ పాశ్చాత్యపు నాగరికతలో కొట్టుకు పోతూ- మనం మన సాంప్రదాయాన్ని అవహేళన చేస్తున్నామో, ఎవరిని చూసి మనం, మన వైదిక సాంప్రదాయంలో శాస్త్రీయత లేదని భ్రమపడుతున్నామో, ఆ పాశ్చాత్యులే మన వేదాల్ని, సిద్ధాంతాల్ని మనకన్నా లోతుగా పరిశీలించి, పరిశోధించి, వీటిలో ఉన్న రహస్యాలని బయటకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యాన్వేషకులై మన దేశాన్ని చేరుకుని వైదిక ధర్మానికి దాసోహమంటున్నారు.
👤

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment