Monday, July 1, 2024

 *✍🏻 నేటి కథ ✍️*


*భక్తి*

విద్యాధర రాజ్యంలో జ్ఞానసంపన్నుడైన
దేవదేవ మహర్షి ఉండేవాడు. మహర్షి
జ్ఞానబోధలు వినడానికి జనం ప్రతిరోజూ అధిక
సంఖ్యలో వచ్చేవారు. సురేంద్రుడు, నరేంద్రుడు
అనే ఇద్దరు యువకులు మహర్షి వద్ద శిష్యులుగా
చేరారు. సురేంద్రుడు మహర్షి మందిరంలో
ఆయనకు సేవలు చేసేవాడు. నరేంద్రుడు
ఆశ్రమం బయట పనులు చేసేవాడు. రాను రాను
సురేంద్రుడు మహర్షికి దగ్గర కావడంతో గర్వం
బయలుదేరింది. సురేంద్రుని మాటకు గురువు విలువ ఇచ్చేవాడు. నరేంద్రుడు ఉదయం గురువు పాదాలకు నమస్కరించి తర్వాత పనిలో
నిమగ్నమయ్యేవాడు. సురేంద్రుడు జ్ఞానబోధనలు
వినడానికి వచ్చే ప్రజల నుండి పెద్దమొత్తాల్లో
కానుకలు గురువుకు తెలియకుండా
స్వీకరించేవాడు.
ఇలావుండగా ఒకరోజు దేవదేవ మహర్షి
గురువు విశ్వమహర్షి ఆశ్రమాన్ని చూడటానికి
వచ్చాడు. కొంతకాలం తన ఆశ్రమంలో
ఉండమని గురువును కోరాడు మహర్షి. అందుకు
అంగీకరించాడు విశ్వమహర్షి. విశ్వమహర్షికి
ఉదయం ఆశ్రమంలో ఒక దృశ్యం కంటబడింది.
నరేంద్రుడు పూలతోటలో పూలతో ఒక గుడికట్టి
గురువు దేవ దేవ మహర్షి చిత్రపటాన్ని పెట్టి
పూజించటం చూశాడు. ప్రతిరోజూ ఇదే విధంగా
పూజ చేయటం పరిశీలించాడు. అదే విధంగా సురేంద్రుడు గురువు వద్ద కపట భక్తి వినయం
నటించి ప్రజలవద్ద కానుకలు గురువు పేర
స్వీకరించడం గమనించాడు విశ్వమహర్షి.
ఒక రోజు దేవదేవ మహర్షి గురువుతో నా ఇద్దరు శిష్యుల్లో ఒకరికి మోక్షం ప్రసాదించమని
కోరాడు. ఇద్దరు శిష్యులు గురువు పాదాలకు
నమస్కరించారు. చేతులు కట్టుకొని నిలబడ్డారు.
క్షణం ఆలోచించి గురువు నరేంద్రునికి మోక్షం
ప్రసాదించాడు. గురువర్యా ఏమిటి! నా ప్రియశిష్యుడు సురేంద్రుని కాదని మీరు
నరేంద్రునకు మోక్షం ప్రసాదించటంలో రహస్యం
వివరించమని కోరాడు. అప్పుడు గురువు మొత్తం
విషయం వివరించాడు. మోక్ష సాధనలో భక్తియే
శ్రేష్టము గదా. అందుకే నరేంద్రునకు మోక్షం
ప్రసాదించాను అన్నాడు విశ్వమహర్షి, గురువు
చెప్పిన దానిలో నిజం గ్రహించి మౌనం వహించాడు దేవదేవమహర్షి.

*రచన : పులాపు బాలకేశవులు.*

No comments:

Post a Comment