Saturday, July 20, 2024

*****సమస్యల తోరణం- సమస్యాపూరణం:

 సమస్యల తోరణం- సమస్యాపూరణం:-        ఈ చరాచర జగత్తులో గమ్మత్తుగా, సమస్యలతో సతమతమయ్యేది, మానవుడు మాత్రమే అనిపిస్తుంది. సమస్యల తోరణం కనపడని సదనాలు అరుదుగా ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, సంసారిక, మానసిక సమస్యలు మనిషిని వేదనకు గురిచేస్తాయి.చాలా సమస్యలకు మూలం మనిషి స్వయంకృతాపరాధేలే. కొందరు తమకు తాము సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా ఇతరులను కూడా సమస్యల ఊబిలోకి లాగడం శోచనీయం. ఆలుమగల మధ్య అలకలు సర్వసాధారణం, అలాంటి సందర్భాల్లో ఎవరో ఒకరు సంయమనం పాటిస్తే, సమస్య సమసిపోయి, అలక అలంకారంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య రగిలిన కలతలు బంధాలను విచ్చిన్నం చేసి, అనుబంధం ఆత్మీయత ఒక బూటకం గా తయారవుతుంది. అహంకారం కారణంగా ఆత్మీయులకు దూరమై చివరి దశలో ఒంటరివాడై విలపిస్తాడు. ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనిషిలో ఆత్మన్యూనతా భావం, కుంగుబాటుకు లోనవడం జరుగుతుంది. సంతోషమే సగం బలం అనే ఇంగితం లేక నిత్యం నిట్టూర్పులతో సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ, తిప్పలు పడుతూ ఉండడం గమనార్హం. మనసు కోరికల భాండాగారం, అంతులేని కోరికలు సమస్యలకు హేతువులు. మనసును వశం చేసుకుని, కోరికలను అదుపులో పెట్టుకున్న వాడే నిత్య సంతోషి. చిత్తం చిత్తం అంటూ దాస్యం చేయకూడదు.మనసుకు ప్రియమైన మాటలు చెప్పే వారికంటే, కఠినమైనా హితమైన మాటలు చెప్పే వారికి విలువ నివ్వాలి.... ఎల్లప్పుడూ ఆత్మీయంగా మాట్లాడేవారు, ఇతరుల సంపదను చూసి ఈర్ష్యపడని వారు, క్రోధాన్ని నిగ్రహించుకోగల శక్తి కలవారు,సమస్యల వలయం నుంచి విముక్తులు కాగలరు. పాజిటివ్ దృక్పథం సానుకూల ఆలోచనలకు ప్రేరణనిస్తుంది. సానుకూల ఆలోచనలతో నిండిన మనసులో వేదనకు తావుండదు... అదే సమస్యల తోరణం కు అసలుసిసలైన సమస్యా పూరణం........ పోలిన రామకృష్ణ భగవాన్.... రాజమండ్రి.

No comments:

Post a Comment