Monday, July 22, 2024

***అందువలన మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే

 శీర్యతే ఇతి శరీరమ్"
నాశనమయ్యే స్వభావం కలది కాబట్టి దీనిని శరీరం అంటున్నాము. భిన్న దేహాలను ఒకదాని తరువాత మరొకటిగా జీవుడు స్వీకరిస్తాడు. తన కర్మల ననుసరించి జీవుడు వివిధ దేహాలను పొందుతాడు. జీవునికి లభ్యమయ్యే దేహాలలో మానవ దేహం ఉత్తమమైనది. శాస్త్రాలు అలాగే చెప్తున్నాయి. శాస్త్రాలు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆత్మ, దేహం ఒకటి కాదని ముందు గ్రహించాలి. ఇతర దేహాలకు లేని ప్రాధాన్యత మానవ దేహానికి ఎందుకని ఇచ్చారు ఇతర దేహాలు పూర్వ కర్మ ఫలాలను అనుభవించటానికి మాత్రమే. మానవ దేహం నూతనంగా కర్మలను ఆచరిన్చాగలదు. అదే ముఖ్యమైన తేడా. పశువుల జీవితాలు ఆహార స్వీకారం, నిద్ర మొదలైన వాటిలో గడిచిపోతున్నాయి.
"దండో ద్యత కరం పురుషమభిముఖముపలభ్యమాం
హంతు మయమిచ్చతీతి పలాయితుమారంభతే"
పశువులు ఎవరైనా కర్ర తీసుకొని వస్తే పారిపోతాయి.
"హరితతృణ పూర్ణ పాణి ముపలభ్యతం ప్రత్యభి ముఖీ భవంతి"
చేతిలో పచ్చగడ్డితో వస్తే అతనిని సమీపిస్తాయి. పశువులకు తెలిసిందంతే. కానీ మానవుదలా కాదు భగవద్దత్తమైన బుద్ధి కారణంగా మోక్షాన్ని కూడ సంపాదించగల యోగ్యతను కలిగియున్నాడు. అతని బుద్ధి వ్యవహరించే తీరును బట్టి ఎదైనా సాధించగలదు. అందువలన మానవజన్మ విశేషమైనదని శాస్త్రంలో చెప్పబడింది.
"మహతా పుణ్య పణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా
పారం దుఃఖోదధేర్గన్తుం తర యావన్న భిద్యతే!!"
మానవదేహం ఒక నావలాంటిది. చాల ధనాన్ని వెచ్చించి దానిని ఖరీదు చేశాం. మరొకటి దొరుకుతుందో లేదో తెలియదు. దానితో ఒక మహాసాగరాన్ని దాటాలి. దానికి మధ్యలో బీటలు పడి, మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నావ ఎక్కువకాలం ఉండదనీ విదితమే. అలా పడిన బీటలు వారే లోపల, ఆ పడవను ఖరీదు చేసిన ఉద్దేశ్యం నెరవేర్చుకున్నట్లయితే అటువంటి వానిని తెలివైన వాడనాలి.
ఇంతకీ ఆ మహాసాగరం ఏమిటి? జనన మరణ వలయమే ఒక మహాసాగరం. మానవ జీవిత సార్ధకత జ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది. కానీ మరో దానితో కాదు. మానవ దేహాన్ని పొందిన తరువాత కూడా జ్ఞాన సముపార్జనకై ప్రయత్నించని వారు మానవ జన్మను వృథా చేసినట్లే.అటువంటి వారు పశువులుగా జన్మించటమే మేలు. ఎందువల్లననగా పశువులకు ప్రత్యవాయం అంటూ ఉండదు కాబట్టి.
అపి మానుష్యకం లబ్ధ్వా భవంతి జ్ఞానినో న యే!
పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్!!
సంధ్యావందనాన్ని మనం నిర్ణీత సమయంలో చేయకపోతే పాపం వస్తుంది. కానీ పశువు సంధ్యావందనం చేయకపోతే ఏ పాపమూ రాదు. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుని కంటే పశువే ఉత్తమమైనది.
అందువలన మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే అని తీర్మానం. మనం జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్ధకమొనరించుకోవాలి.

No comments:

Post a Comment