[7/13, 14:13] +91 90404 36395: *శ్రీరమణీయభాగవత కథలు- 22 - (1)*
( బాపు-రమణ )
జరిగిన కథ:
శ్రీశుకమహర్షి పరీక్షిత్తునకు అంబరీషుని గాధ ను తెలుపుచున్నాడు.
దుర్వాస మహర్షి, సుదర్శన చక్ర బారినుండి తప్పించుకొనుటకు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరగా, వారు అంబరీషుని వద్దకు పంపారు.
అంబరీషుడు శ్రీసుదర్శనచక్రమునకు నమస్కరించి, దుర్వాస మహర్షిని విడవమన్నాడు.
ఇక చదవండి...
*****
*గజేంద్రమోక్షణము - 1*
శుక : ఓ రాజా! ఒకొక్కమారు భూతాల వలె మీదకు వచ్చే శాపాలు శుభం చేకూర్చడం, వరప్రసాద వాక్యాలు మధురం అనిపించినా చేటు చెయ్యడం జరుగుతూ వుంటుంది.
పరీ : దేవా! ఆ రెండూ నా పట్ల నిజంగానే జరిగాయి కదా?
శుక : నీకా? ఏవిధంగా?
పరీ : ముందుగా - 'నువ్వు గొప్పవాడివయ్యా. నీ రాజ్యంలో మదమత్సరాలకి చోటే లేదుకదా' అని కలిపురుషుడు పొగిడితే ఆనందంగా నమ్మేశాను. (నవ్వి) మదాన్ని జయించానన్న అహం వల్లనే ముని వద్ద శాపం పొందాను.
శుక: మరి మరణిస్తావన్న శాపం నీకేమి మేలు చేసింది?
పరీ : మరణ భయంనుండి మనసును మళ్లించింది, శ్రీ శుకబ్రహ్మ ముఖతః భాగవతాన్ని ఆకర్ణించే అదృష్టం లభించింది కదా!
శుక : (చేయెత్తి దీవిస్తూ) శుభం! శ్రీమన్నారాయణుడి చక్రం వలన ప్రాణం విడిచి ఉత్తమ జన్మను పొందిన రెండు జీవుల కథ చెబుతాను. అదే గజేంద్ర మోక్షణం.
క్షీర సముద్రం మధ్యన త్రికూటం అనే గొప్ప పర్వతం వుంది. ఆ కొండ సానువులలో ఫలపుష్పాలతో మనోహరంగా వుండే వరుణోద్యానం అనే చిట్టడవి. అందులో విశాలమైన చక్కని సరస్సు వుంది. ఒకనాడు
ఒక గజరాజము తన రాణులతో వచ్చి ఆ కొలనులో జలక్రీడ లాడసాగింది.
ఆ కొలనులో ఎంతో కాలంగా వుంటున్న ఒక మొసలి ముందుకురికి ఏనుగు కాలును పట్టుకుంది.
ఏనుగు విదిలించి కొట్టబోయింది గాని మొసలి పట్టు విడవ లేదు. రెండూ పెనుగులాడ సాగాయి. నీరు కాబట్టి స్థానబలం ఎక్కువ గల మొసలిని ఏనుగు బలం ఏం చేయ్యలేకపోయింది.
సాయపడబోయిన ఆడ ఏనుగులు మిగతా మొసళ్లను చూసి దూరంగా పోయాయి. ఈ విధంగా కరిమకరముల
పోరాటం వేయేండ్లు సాగింది. క్రమంగా ఏనుగు శక్తి తగ్గిపోయింది. అహం చచ్చింది. దేవుడు గుర్తుకొచ్చాడు.
దేవుడే కాపాడగలడని గ్రహించింది. పరిపరి విధాల ప్రార్ధించ సాగింది ఏనుగు.
*ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనియందు డించు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు - అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!*
*లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు అతని నే సేవింతున్*
అంటూ ఆర్తనాదం చేసింది.
*లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్ మన్నింపం దగున్ దీనునిన్ - రావే ఈశ్వర కావవే వరద - సంరక్షింపు భద్రాత్మకా!*
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)
[7/13, 14:13] +91 90404 36395: *శ్రీరమణీయభాగవత కథలు- 22 - (2)*
( బాపు-రమణ )
జరిగిన కథ:
కొలనులో దిగిన ఏనుగును మొసలి పట్టుకొనింది. వెయ్యేండ్లు ఏనుగు పోరి, అలసిపోయి, పరమేశ్వరుడి వేడుకోవడం మొదలిడింది.
ఇక చదవండి... ..
******
*గజేంద్రమోక్షం - 2*
*వైకుంఠం*
కరీంద్రుడి ఆర్తనాదం వైకుంఠ నాథుడిని చేరింది.
*అల వైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు నాపన్నప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై*
నీవే తప్ప ఇంతఃపరంబెరుగ నన్న ఆర్తనాదానికే ఎదురు చూస్తున్న శ్రీహరి దిగ్గున లేచాడు.
*సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం బన్నింపడు అకర్ణికాంతర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహియై*
భక్తుని కోసం భగవంతుడు అంత సంరంభిస్తూ బయలుదేరగానే
*తన వెంటన్ సిరి, లచ్చి, వెంట నవరోధవ్రాతమున్ దాని వెన్కను బక్షీంద్రుడు వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజినీ కాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునం గలుగు వా రాబాల గోపాలమున్.*
సుదర్శనం, విష్ణుహస్తం చేరింది. ఆయన ప్రయోగించగా వెళ్లి మొసలి తల నరికింది. పెనుకేకతో అది ప్రాణం విడిచింది. కరీంద్రుడు కూడా భయపడి ఘీంకారం చేశాడు.
ఇంతలో లక్ష్మీదేవి గరుడాళ్వారు విష్వక్శేనుడు నారదుడు పరివారం అంతా శ్రీహరి వెనక చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు.
దేవదుందుభులు మోగాయి- పూలవాన కురిసింది. ఏనుగులోంచీ మొసలిలోంచీ ఇద్దరు గంధర్వులు రూపు ధరించి శ్రీహరికి నమస్కరించారు.
మొసలి: దేవా! ధన్యుడిని. నేను హూహూఅనే గంధర్వుడిని. మదం కొద్దీ దేవల మహర్షితో
చెలగాటమాడి శాపం వల్ల ఈ రూపంలో వెయ్యేళ్లుగా పడివున్నాను. ఈ మకర జన్మకు నువ్వు విధించిన మరణ దండనే నాకు వరప్రసాదమై శోభ ప్రదమై కరుణించింది. శిక్ష ద్వారా కూడా శుభం చేకూర్చే దేవదేవా! సెలవు.
ఏనుగు: జగన్నాథా! నేనుకూడా అగస్త్య మునీంద్రుని శాపం వల్ల ఈ రూపంలో జన్మనెత్తి ఇంత కాలం హింసపడ్డాను. నీ పుణ్య స్పర్శవల్ల నా గంధర్వ రూపం నాకు లభించింది. ధన్యుణ్ణి!
అంటూ వందనం చేసి పైకి ఎగిరిపోయారు.
శుక : *దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన బొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన! దేవదేవ! మహేశా*.
పరీక్షిత్తు తలవంచి నమస్కరించాడు.
శుక : *నారయణః పరంధామ ధ్యానం నారాయణః పరః నారాయణ పరోధర్మో నారాయణ నమోస్తుతే!*
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)
No comments:
Post a Comment