Tuesday, July 16, 2024

*****మనో విన్యాసం

 ఈరోజు మనో విన్యాసం గురించి తెలుసుకుందాం.

         మనిషిలో  పైకి  కనిపించే  ఆకారం కాదు,  కనిపించని  మనసే  ముఖ్యమైనది. ఇది  తెలుసుకోవడమే  పరిణతి. ఒకప్పుడు  మహోన్నత  ఆచార్యుల సంరక్షణలో  మొక్కదశలోంచి సంపూర్ణ ఫల, పుష్పాలను  అందించే  వృక్ష  దశలోకి మారిన  యువత  ఉత్తమ సంస్కారవంతులుగావెలుగుతూ ఉండేవారు సంఘానికి  తమ  వంతు  సేవ  చేసేవారు. ఒకప్పటి  మహర్షులు, మాననీయులు, శాస్త్రజ్ఞులు ,కళాకారులు, నాయకులు మనసుతోనే  విశ్వవిఖ్యాతులు  అయ్యారు. నేటికీ  మన్ననలను అందుకుంటున్నారు.

 మొదటి  చూపులో  ఎదుటివారి  పట్ల సదాభిప్రాయమో , దురభిప్రాయమో, కలగడానికి  మనసే  కారణం. పంచేంద్రియాలు సేకరించి  అందించిన విషయాలను  క్రోడీకరించి  మనసు తీసుకునే  అభిప్రాయం  ఆ  మనిషి వ్యక్తిత్వం  మీద  ఆధారపడి  ఉంటుంది. కొంతమందిని  చూస్తే  పెట్టబుద్ది అవుతుంది .మరి  కొంతమందిని  చూస్తే మొట్టబుద్ధి  అవుతుందనే సామెత అలా పుట్టిందే .మనిషి  నికార్సైన  వ్యక్తిత్వంతో నిప్పులా  బతకడానికి,  గడ్డిపోచ కన్నా తేలికైపోవడానికి  మనసు  ప్రధానం. శరీరానిదేముంది , మనసెటు  తిప్పితే అటు  నడుస్తుంది. చేయమన్నది  చేస్తుంది. శరీరం సుఖపడిన ,బాధపడిన మనసుదే  ముఖ్య  పాత్ర. శారీరక, మానసిక ,ఆరోగ్యాలకు  మనసే  హేతువు.రోగి శరీరాన్ని పరీక్షలతో మనసును మాటతో, అంచనా  వేసి మందివ్వగల వైద్యుడే  రాణిస్తాడు. మనలో  ఉండి  మనల్ని  తప్పుదారి పట్టించేది  మనసే . మనోవిన్యాసం ఊహాతీతం . తాడును  పాముగా భ్రమింప చేస్తుంది.  ఎండమావుల  వెంట పరిగెత్తిస్తుంది . తెల్లని వన్నీ  పాలు ,నల్లని ఇవన్నీ  నీళ్లుగా, నమ్మిస్తుంది.  మంచిని చూడలేనంతగా ,నిజాన్ని నమ్మలేనంతగా, కళ్ళకు  పొరలు  కమ్మిస్తుంది .మనసు గారడీ  అర్థం  కాదు . ఒక్కోసారి  నిజాన్ని నిలదీస్తుంది .అబద్ధాన్ని  అవలోకగా  నమ్మి అనుసరిస్తుంది . అలవాటైన  దాని నుంచి కొత్త  మార్గానికి  పోనివ్వదు. భయపెడుతుంది.  రకరకాల  ఆలోచనలతో  మనసు  నలువైపులకు దారి  తెన్ను  లేకుండా  పరిగెత్తే  గుర్రం అవుతుంది .

 కొంతమంది  మనసు పారదర్శకంగా  ఉంటుంది . లోపల  ఒకటి, బయట  వేరొకటిగా  ఉండదు. వీరి  సంఖ్య చాలా  తక్కువైనా  సమాజ  రుజువర్తనకు మూలకారకులవుతారు. ధర్మరక్షణ ప్రథమ విధి .పరుల  సేవ  పరమధర్మం. మరికొంతమంది  కపటంతో  కూడుకున్న తీయని  మాటలు , కమ్మని  చేతలతో ఎదుటి  మనసులకు  గాలం వేసి ,నమ్మించి మోసం  చేస్తారు .మనుషుల్లో  అభద్రత అపనమ్మకం  పెంపొందడానికి  వీరు కారణం. భూమి, గాలి, నీరు ,ఆకాశం, కలుషితమైనట్టు  మనిషి  మనసు స్వచ్ఛతను  కోల్పోతుంది .ఒకప్పటి మానవుడి  మనసుకు  , ఇప్పటి  మనిషి మనసుకు  పొంతన  లేదు.  తెల్లని  మల్లె లాంటి  మనసుకు  మసి  పట్టించే విషయాలు  ఇప్పుడు  కోకొల్లలు .స్పర్శ, గ్రహింపు, ఆకలింపు, అభ్యాసం,  లాంటివి మనసు  విషయంలో  అర్థం  కోల్పోయిన పదాలు.
ఇప్పటి  వేగం, అత్యంత  వేగంగా పయనించే  మనసును  సైతం అయోమయానికి  గురిచేస్తుంది. అస్తవ్యస్తంగా  పరుగులు  తీస్తోంది. ప్రవర్తన, సమాజ అభ్యున్నతీ,నూతన ఆవిష్కరణలకు  మూల  కారణమయ్యే మనసుకు  తగినంత  సమయం కేటాయించలేకపోవడం  దురదృష్టం. ప్రశాంతమైన  మనసుతో  మనిషిగా ఎదగడంలోనే  జీవితార్ధం ఉంది .ఇది తెలుసుకోవడమే  పరమార్ధం. ఇలాంటి మనసుకు ముక్కుతాడు వేసేది కేవలం ధ్యానం మాత్రమే.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment