రామాయణానుభవం.....367
శ్రీరామ చంద్రస్వామి సువేల పర్వతము దిగి లంకను పూర్వము అనుకున్నట్లుగా ముట్టడించదలిచాడు.
నీలుడు తూర్పు దిక్కు, అంగదుడు దక్షిణంవైపు, హునుమంతుడు పశ్చిమం వైపు సైన్య మధ్యలో సుగ్రీవుడు ముప్పై ఆరు కోట్ల వీరులతో, ఉత్తరము (రావణుడున్న) వైపు స్వయంగా రామ లక్ష్మణులు యుద్ధ సన్నద్ధులైనిలిచారు.
ప్రతి ద్వారము ముందు కోటి వానర సైన్యాన్ని సుగ్రీవుడు నిలిపాడు. సుగ్రీవుడు మధ్యలో నుండి ఉత్తర ద్వారము దగ్గర నిలిచిన రామలక్ష్మణులను, దక్షిణ ద్వారము దగ్గర ఉన్న అంగదుని ఆదుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు.
క్షణాలలో లంకా నగరం యొక్క అన్ని ద్వారాల వద్ద వానరులు నిండిపోయారు. లోపలి వారిని బయటకు రానీయకుండా బయటి వారిని లోనికి పోనీయకుండా కట్టడి చేశారు.
శ్రీ రామచంద్ర ప్రభువు రావణాసురునికి మరొక అవకాశమివ్వదలచి రాయబారాన్ని పంపాలనుకొన్నాడు.
హనుమ, సుగ్రీవుల బలాన్ని రాక్షసులు ఇది వరకే రుచి చూశారు. కనుక అంతవాడైన అంగదుని దూతగా ఈ సారి పంపాలనుకొన్నాడు.
"అంగదా ! నీవు ఈ ప్రాకారము పైకి ఎగిరి లంకానగరంలోపల దూకు. అక్కడ రావణుడు సపరివారంగా ఉంటాడు. వాని ముందుకు వెళ్లి నిర్భయంగా నేను చెప్పిన మాటలను తెలుపు "రావణా! నీవు ఋషి కన్యలను అప్సరసలను, దేవగందర్వ కన్యలను అపహరించి, వారికి మన్నించరాని మహాపరాధం చేశావు. దాని వలన నీ తపోబలము
నా భార్యను అపహరించి నిన్ను శిక్షించే అవకాశము నాకు ఇచ్చావు.
ఏ బలగర్వంతో సీతను అపహరించావో, ఆ బలాన్ని మగవాడివి అయితే నా ముందు చూపు. నిన్ను ఒక్కడిని సంహరించడమే కాదు, నిన్ను బలపరిచే రాక్షసులనెవ్వరిని మిగిలను. నాకంటబడితే నిన్ను భస్మము చేయకుండా వదలను.
ధర్మాత్ముడైన విభీషణుడు లంకానగరాన్ని పరిపాలించుటకు సమర్ధుడు. ఆయనకు ఇదివరకే సముద్ర తీరంలో పట్టాభిషేకం జరిపించాను. ఇక లంకా సింహాసనము ఆయనదే. అందువలన నిన్నువధించుట తప్పదు. దగంత
భయంకరమైన నా బాణాగ్నికి భస్మం కాకుండా మిగులాలంటే, సీతాదేవిని నాకు సమర్పించి, నన్ను శరణువేడు (అప్పుడు శరణాగతుడవైన నీకు అయోధ్యా సామ్రాజ్యాన్ని అప్పగిస్తాను.
ఇక నీవధ తప్పదు. నీవు సపరివారంగా సంహరింపబడుతావు. కనుక నీ మరణం తరువాత నీకు తద్దినము పెట్టే వారు మిగలరు. కనుక యుద్ధానికి వచ్చే ముందే “జీవశ్రాద్ధము” పెట్టుకొనిరా.”
అంగదుడు ప్రాకారముపై నుండి రావణుని ముందు దుమికాడు. తన పేరును తెలిపి శ్రీరామచంద్రుని సందేశాన్ని ఉన్నదున్నట్లు వినిపించాడు.
తన ముందుకు ఒకరి తరువాత ఒకరు వానర వీరులు వచ్చితమ పరాక్రమాన్ని ప్రదర్శించి వెళ్లడం రావణునికి నచ్చలేదు.
అందువలన ఆయన సైనికులతో "ఈ దుష్టుణ్ని పట్టుకొండి, కొట్టండి చంపండి” అని ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు.
రాక్షస వీరులు చుట్టుముట్టి అంగదుని పట్టుకున్నారు. కావాలనే వారికి అంగదుడు పట్టుబడ్డాడు. వారిని తన చేతులలో బిగించి, పామును బంధించిన గరుడుని వలె ప్రాకారము చివరి దాకా తీసుకెళ్లి క్రింద పడవేశాడు. రాక్షసరాజు కళ్లముందే ఆయన భటులు క్రిందపడి, కీళ్లు విరిగి, హతులయ్యారు.
అంతే కాదు ఆ భవన శిఖరాన్ని అంగదుడు పిండిపిండి చేశాడు. ఆశిఖరము రావణుని పాదాల ముందే ముక్కలైపడిపోయింది.
తన బలాన్ని మచ్చుకు రుచి చూపించి అంగదుడు రావణుడు చూస్తుండగానే పైకి ఎగిరి శ్రీ రాముని సన్నిధిలోవాలాడు. ఈ అంగదుని అద్భుత కార్యము రాక్షసులలో మహాభయాన్ని వానరులలో మహోత్సాహాన్ని నింపింది.
రావణుడు కోపావిష్టుడై యుద్ధానికి బయలుదేరుమని ఆజ్ఞాపించాడు. అనేక ఆయుధాలను ధరించి సైనికులు యుద్ధానికి బయలుదేరారు.....
.........సశేషం........
చక్కెర.తులసీ కృష్ణ.
No comments:
Post a Comment