Monday, July 22, 2024

****జీవిత సాక్షాత్కారం

 🔱 అంతర్యామి 🔱

# జీవిత సాక్షాత్కారం #

🍁చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు.

🍁దయతో జీవితం అడుగడుగునా తన ప్రేమను మనపై కురిపిస్తే అంతకంటే అదృష్టం లేదు. జీవితం శపించకూడదు, జీవనం నిరర్థకమైపోకూడదు. ఒకే ఒక్కటి జీవితం. రెండోసారి దొరకదు. దాని విలువను గ్రహించాలి. ఏ కుటుంబంలో పుట్టామో, ఏ ఊరు గాలి పీల్చి బతికామో, ఏ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నామో వాటన్నింటికి పేరు తేవాలి. నీ పేరుతో ఆ ఊరు బతకాలి. నీ ఉనికి ఆ దేశం కీర్తి దశదిశలా వ్యాపించాలి.

🍁ప్రతి అనుభవమూ జీవన ప్రయాణంలో ఒక మజిలీ. జీవితం ఒక గొప్ప గ్రంథం. ఎన్నో అనుభూతులతో నిండి ఉన్న జీవనం మధుర కావ్యం. చీమకు జీవితం ఉంది. అడవిలో ఏనుగుకు జీవితం ఉంది. అందరికి సహాయం చేసే మనసున్న మనుషులకూ జీవితం ఉంది. బతుకు ఇంకొక బతుకుని బతికించాలి. దీప మరో దీపాన్ని వెలిగించినట్లు.

🍁జీవితం మనకి పూర్ణకుంభంతో స్వాగతం పలకకపోవచ్చు. నుదుటి రాత క్షణక్షణం అడ్డుపడవచ్చు. విధి వికృతమై విసిరి కొట్టడానికి ప్రయత్నం చెయ్యవచ్చు. దయగల జీవితం ఎన్నడూ మోసం చెయ్యదు. విషాదంతో కుంగిపోయి రథం దిగి, నేలకొరిగిన అర్జునుడినే భుజం తట్టి లేపి శ్రీకృష్ణుడి రూపంలో అండగా నిలబడింది. ఘనకీర్తిని ఇచ్చి చరిత్రలో నిలబెట్టింది. అవతార మూర్తులకు కూడా జీవితాలున్నాయి. వ్యక్తిత్వాలున్నాయి. వాళ్లు ఏ కారణంతో భూమ్మీద జన్మించారో ఆ ఎరుక వాళ్లకి ఉంది. వాళ్లూ సామాన్య వ్యక్తుల్లాగా ఎన్నో కష్టాలూ బాధలూ అనుభవించారు. మానవ జీవన గొప్పదనాన్ని లోకానికి చాటారు.

🍁జీవితం అవగాహనకు వస్తేనే జీవనసత్యాలు తెలుసుకోగలుగుతాం. బహిర్ముఖమైన జీవితాన్ని లోతుగా పరిశీలిస్తేనే అంతర్ముఖత్వానికి దారి ఏర్పడుతుంది. జీవితం మార్మికంగా ఉంటే మన శోధన ఒక ఆటగా మారుతుంది. అందుకే జీవన చదరంగం అన్నారు. జీవితం తెరిచిన పుస్తకంగా ఎన్నడూ ఉండదు. సాధించి శోధించాలి.

🍁ఎనిమిది చేతులతో ప్రత్యక్షమైన మహిషాసుర మర్థనిలా జీవితం తన పూర్ణ స్వరూపాన్ని ఎవరికి చూపిస్తుందో ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకోక ఈ జన్మలోనే తన జీవన పరమార్ధం నెరవేర్చుకుంటాడు.

🍁పువ్వు పరిమళాన్ని తోటలోకి తీసుకువెళ్తుంది. అందంగా ఏపుగా పెరిగిన తోటను చూస్తే, దాన్ని కాపుకాసే తోటమాలి గుర్తుకువస్తాడు. తోటమాలి క్రమశిక్షణ, పట్టుదల చూస్తే అతడి యజమానిని చూడాలని అనిపిస్తుంది. చూసిన తరవాత అతడిని ప్రశంసించాలని అనిపించినట్లు మన సర్వానికి ఆధారమైన జీవితం గొప్పది అనిపిస్తుంది.
🍁 ఎందుకంటే దేహంలో ఉన్న ఆత్మను అనుభూతిలోకి తెచ్చేది దేహమే. దానికి అనుసంధానమైన ఈశ్వరుణ్ని కూడా చూపిస్తుంది. తల్లిదండ్రులకు నమస్కారం. ఈ జీవితం గొప్పదని తెలియజేస్తున్న మహాత్ముల జీవితాలకు ప్రణామం. 🍁జీవిత సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారానికి దారి.🙏

-✍️ ఆనందసాయి స్వామి

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment