Sunday, July 21, 2024

అసలు ఈ ఆషాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో..? ముందు తెలుసు కుందాం.

 గురు పౌర్ణిమ

గురుర్బ్రహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

అనాది కాలంనుంచీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. మరియు దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణనలోనికి తీసుకుని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిథి కావున ఆ భగవానునియొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతున్నది.

అసలు ఈ ఆషాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో..? ముందు తెలుసు కుందాం.

దీనికి ఒక చక్కని ప్రాచీన గాథ కలదు. పూర్వం "వారణాశి" లో కడు పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. వానియొక్క భార్యపేరు 'వేదవతి'. వీరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతాన భాగ్యము కొరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు.

ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికి' ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఒకరోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే "వేదనిధి" వాని పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలో కోరుకో అంటాడు. మహానుభావా!

రేపు నా తండ్రిగారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా కోరిక!  అని బదులు చెప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. 

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి' తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తారు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి ఉచిత ఆసనముపై కూర్చుండబెట్టి అతిథి సత్కారము లతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు 'సాలగ్రామము', తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు.

వారి పూజ అనంతరం ఎంతోశుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా! మీకు ఏమి వరంకావాలో కోరుకోండి అంటాడు. అందులకు ఆ దంపతులు ఓ మహానుభావా! మేము ఇంతవరకు నోచని నోములూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ ఆదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు. అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని 'వేదనిధి' ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు..!

"శృణు విప్రతవేచ్ఛా చేత్ దర్శనార్థం తదాత్వయా పూజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం" అని

అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందులకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చెప్తాను, వినండి.

ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యా లను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన అతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పారాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.

అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర విశ్వంయొక్క పూర్వవృత్తాంతం; పురాణ మున్నగునవి విప్పి చెప్పాలంటే వారి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చెప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి "ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వార్కి "గురుపూజ" చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుతునే ఉన్నది అని మనము గమనిస్తున్నాము గదా!" - మరి.

అది విన్న 'వేదనిధి' మరోమారు వ్యాసభగవానుని ప్రశ్నిస్తాడు. మహాత్యా! తమను ఏయే రోజుల్లో ఏవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటారు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః: ఆషాఢ శుక్ల పక్షేతు పూర్ణిమాయాం గురౌతథా పూజనీయో విశేషణ వస్త్రాభరణ ధేనుభిః  దక్షిణాభిః సుపుష్పాభిః మత్స్యరూప ప్రపూజయేత్ ఏవం కృతే త్వయా విప్ర: మత్స్య రూపస్య దర్శనం భవిష్యతి నసందేహోమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రాహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక 'గురువారము' అయిన ఎడల అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, ఆభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కి నా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస భగవానులు చెప్పిన పై శ్లోకాలే మనకు ప్రామాణికమవుచున్నవి. కావు అట్టి ఆషాఢ పౌర్ణిమ, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది.

ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి "ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మాండ పురాణంలోనూ "స్వధర్మసింధు" అనే గ్రంథము లోను వివరంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః

అట్టి పరమ పవిత్రమైన "గురుపౌర్ణమి" పుణ్యదినం మనమంతా విశేషంగా జరుపుకుని ముందు తరాలవార్కి మార్గదర్శకుల మౌతూ, పునీతులౌదాము.

No comments:

Post a Comment