శ్రీమద్రామాయణము.
(238 వ ఎపిసోడ్),,
""సహస్రాణ్యపి మూర్ఖాణాం యద్యుపాస్తే మహీపతిః,
అథవాప్యయుతాన్యేన " నాస్తి'తేషు సహసయతా|, అయో.కాం.100-24),
రాజైన వాడు తాను ఉదారుడనియో,తెలువిగలవాడననియో మూర్ఖులకు వేయి మందికి కాదు పదివేలమందికి ఆశ్రయమిచ్చినా సమయము ఆసన్నమయినప్పుడు వారి నుండి ఒక్కరితో కూడ ప్రయోజనము ఒనగూరదనుట నిశ్చయము.
రామాయణములో అయోధ్యకాండములో వనవాసములో చిత్రకూటపర్వతమునందుగల శ్రీరాముని ఆశ్రమమునకు భరతుడు వచ్చిన సందర్భములో రాముడు భరతుని కుశలప్రశ్నలను వేసి అతనికి రాజనీతి ధర్మాలు విశధీకరిస్తాడు.
""కచ్చిత్ సహస్రాన్మూర్ఖాణాం ఏకమిఛ్చసి పండితమ్,
పండితో హ్యర్థకృచ్చ్రేషు కుర్యాన్నిశ్రేయసం మహత్""(100-23),,
ఓ ప్రియమైన తమ్ముడా భరతా! నీ చుట్టు వేలమంది మూర్ఖులు సంచరించుచున్నను , సమస్యలు వచ్చినప్పుడు వారితోగాక సమస్త విషయములు ఎరింగిన ఒక్క పండితునితో మాత్రమే మంత్రాంగము నెరపవలయును. కారణము స్థిరబుధ్దితో సముచితముగ యోచనచేయు సమమర్థుడైన ఆ ఒక్కడే రాజునకు రాజపుత్రునకు శ్రేయస్సు కలిగించురీతిలో సలహాలను ప్రసాదించగలడు.
"" కాలాతిక్రమణాశ్చైవ భక్తవేతనయోర్భృతాః,
భర్తుః కుప్యంతి దుష్యంతి సో~నర్థః సుమహాన్ స్మృతః""100-34),
ఓ భరతా!నీ క్రింది ఉద్యోగులకు నెలసరి బత్యములు కాలాతిక్రణ జరుగకుండగ ఇచ్చుచున్నావా లేనిచో వారు నీ మీద కుపితులై తూలనాడెదరు. అది పెక్కు అనర్థములకు దారితీయును.
"" అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్,
శ్రేష్టాన్ శ్రేష్టేషు కచ్చిత్ త్వం నియోజసి కర్మసు||,(100-27),
నాయనా భరతా! ప్రలోభములకు లొంగనివారిని, తరతరములనుండి యున్నత పదవులు అలంకరించుచు వస్తున్న వారిని, త్రికరణశుధ్దిగలవారిని ముఖ్యమైన రాజకార్యములయందు అమాత్యులుగ నియమించవలయును.
"" కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయమ్,
క్షిప్రమారభసే కర్తుం న దీర్ఘయసి రాఘవాః""(100-20),
ఓ సహోదరా భరతా! రాజ్యములో ప్రజలకు స్వల్పమైన సాధనససంపత్తితో అత్యధిక లాభములను చేకూర్చు పనులు చేపట్టి వాటిని త్వరితగతిగ పూర్తి చేయుటయందు ఎటువంటి విలంబము ఏర్పడకుండగ చూచుకొనవలయును.
"'కచ్చిన్న తర్త్కైర్యక్త్యా వా చాప్య పరికీర్తితాః,
త్వయా వా తవవామాత్యైః బుద్ద్యతే తాత! మంత్రితమ్""(100-22),
నాయనా ముఖ్యముగ నీవు గమనించవలసినది రాజ్యసంక్షేమము కొరకు నిశ్చయింపబడిన ముఖ్యకార్యములు నీవుగానీ, నీ అమాత్యులుగానీ లేదా తత్సంభదీకులుగానీ ప్రజలముందు ప్రకటించకముందే ఇతరుల చర్చలద్వారాగానీ మరేఇతర ఉపాయనముల ద్వారాగానీ,ప్రజల ఊహల ద్వారా గానీ తెలియకుండేలా యంత్రాంగాన్ని సమర్థవంతముగ నిర్వహించుకొనవలయును.
"" కచ్చిదర్థేన వా ధర్మమ్ అర్థం ధర్మేణ వా పునః,
ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే""(100-63),
పుర్వాహ్ణ సమయము ధర్మాచరణకు అనువైన కాలము.ఆ సమయములో ధనార్జన చేయరాదు.అలాగని అపరాహ్ణ సమయమున ధర్మకార్యములయందు మునిగి ధనార్జన చేయకుండగ ధనసంపదకు భంగము కలిగించరాదు. సుఖాభిలాషయందు మనస్సు కేంద్రీకరించి ధర్మార్థములకు హాని కలిగించరాదని భరతునకు రాముడు రాజనీతి ధర్మములు తెలియచేస్తు భరతుని రాజ్యపరిపాలనవైపు సుముఖినిగ మళ్లించే ప్రయత్నము చేస్తున్నాడు.
నేటి రాజకీయాలకు కూడ ఈ రాజనీతి ధర్మాలు చాలా అత్యవసర మైనవని తెలుసుకొని రామాయణము లోని ధర్మాలు పాటిస్తుంటే రాష్ట్రపురోభివృధ్ది అసాధ్యమేమి కాదని గ్రహించగలము.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment