Monday, August 26, 2024

 రామాయణమ్..38
.
అద్దంలో తన ప్రతిబింబం తనే తనివితీరా చూసుకునే విధంగా తన ఎదురుగా నిలబడ్డ రాముని కనులారా చూసుకున్నాడు.
.
 ఆయనను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు దశరధమహారాజు! 
.
చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పాడు ! 
.
రామచంద్రుడు తండ్రివద్ద సెలవు తీసుకొని తల్లి మందిరానికి బయలుదేరాడు .
.
ఆయన అటు వెళ్ళాడో లేదో మరల దశరధుడి మనసులో ఏదో ఆందోళన, చెప్పలేని ఏదో తెలియని ఆవేదన,
.
 మరల సుమంత్రుని పిలిచాడు రాముని మరియొక్కసారి శీఘ్రంగా ఇక్కడికి తీసుకురా ! .అని ఆజ్ఞాపించాడు.
.
రాజాజ్ఞపాటించాడు సుమంత్రుడు .
.
తండ్రికి ఎదురుగా కూర్చుని మరల నన్ను పిలిపించారెందుకు? అన్నట్లుగా చూశాడు రామచంద్రుడు !.
.
దశరధుడప్పుడు, నాయనా! నీ పట్టాభిషేకమహోత్సవము ఎంతత్వరగా జరిగితే అంత మంచిది ,నాకెందుకో అమంగళకరమైనదేదో జరుగబోతున్నదనిపిస్తున్నది ,శకునాలు కూడా అవే చెపుతున్నాయి. క్రూర గ్రహాలు రవి,కుజ,రాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించినట్లు దైవజ్ఞులు చెపుతున్నారు .
.
ఇవ్వన్నీ చూస్తుంటే నాకు మృత్యవైనా సంభవించవచ్చు లేదా అంతటి గొప్ప ఆపద అయినా కలుగవచ్చు .
.
నాయనా నేను ఈ లోకంలో జన్మించినందుకు అన్ని సుఖములు అనుభవించాను ,క్షత్రియధర్మాలన్నీ నెరవేర్చాను ! 
.
దేవ ఋణము ,ఋషి ఋణము, పితృదేవతా ఋణము ,బ్రాహ్మణ ఋణము అన్నీ తీర్చివేశాను .
.
ఇక నీకు రాజ్యాభిషేకము చేయడమొక్కటే నేను చేయవలసిన పని .
.
మనిషి మనసు చంచలమయినది ఏ నిమిషానికి అది ఏమి ఆలోచిస్తుందో ఏమి జరుగనుందో ఎవరికీ తెలియదు ! నా మనస్సులో వేరొక ఆలోచన రాక పూర్వమే నీకు పట్టాభిషేకం జరుగవలె! .
.
భరతుడు ఈ నగరంలో లేనప్పుడే నీకు పట్టాభిషేకం జరుగవలెనని నా అభిప్రాయం.
.
సోదరుని గూర్చి ఇదేమి ఆలోచన తండ్రీ! అని అడుగుతావేమో! 
ఆతడు ధర్మాత్ముడే! 
నిన్నుఅనుసరించిఉండేవాడే,ఇంద్రియనిగ్రహముకలవాడే ,సత్పురుషులు వెళ్ళేదోవలోచరించేవాడే,దయాశీలుడే ...కానీ...ఎంతటి వాడి మనస్సయినా చంచలము నాయనా ! 
.
ఈ రోజు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు రేపు పుష్యమితో కూడుతాడు రేపు సరి అయిన సమయమని దైవజ్ఞులు చెపుతున్నారు .
.
ఇక నీవు వెళ్ళిరా అని అనుమతించాడు.
.
రాముడు తల్లి మందిరం చేరుకున్నాడు ,అప్పటికే ఈ వార్తవిని సుమిత్ర,లక్ష్మణుడు అక్కడికి చేరుకున్నారు ! 
.
సీతను కూడా రప్పించారు.
.
NB.
.
యజ్ఞములు చేస్తే దేవతా ఋణము
.
స్వాధ్యాయాధ్యయనములు చేస్తే ఋషిఋణము
.
సంతానం కనటం వల్ల పితృఋణము
.
దానాదులచేత బ్రాహ్మణ ఋణము ....తీరుతాయి
.
ఈ పనులన్నీ సమృద్ధిగా చేశాడు దశరధ మహారాజు.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

No comments:

Post a Comment