🔱 అంతర్యామి 🔱
🍁చిత్తవృత్తి నిరోధకం యోగమని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. ఆలోచనలు దుఃఖానికి మూలం. ఈ ఆలోచనలవల్లే మనసుకు, శరీరానికి దుఃఖం కలుగుతుంది. మరి ఆలోచన లేకుండా మనిషి ఎలా మనుగడ సాగించగలుగుతాడు... అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడే వివేచన అక్కరకొస్తుంది ప్రతికూలమైన ఆలోచనల వల్ల మనసుకు, శరీరానికి దుఃఖం కలుగుతుంది కనుక మనిషి ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచించాలి. అంటే మేలు కోరే తలపులనే మనసులో కలిగి ఉండాలి.
🍁మనసులో ప్రతికూలమైన ఆలోచనలు ఉంటే వాటి ప్రభావం శరీర ఆరోగ్యంపైన పడుతుంది. మనసును ప్రక్షాళన చేసుకోనంతవరకూ అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే మనసులోను ప్రతికూలమైన ఆలోచనలను తీసి పారేస్తాడో అప్పుడే అతనికి ఆరోగ్యం కుదుటపడుతుంది. అంతవరకూ ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం ఉండదు. అందుకే పెద్దలు 'మనోవ్యాధికి మందులేదు' అని ఏనాడో
చెప్పారు.
🍁లోకంలో మంచికి, చెడుకు మధ్య నిరంతరాయంగా పోరు సాగుతూనే ఉంటుంది. ఆ రెండింటిలో దేని పక్షాన నిలవాలో ఆలోచించుకోవాల్సింది ఎవరికి వారే. సత్యమార్గంలో పయనించేవాళ్లకు కష్టనష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని భరించి, సహించి సన్మార్గంలోనే ముందుకు సాగడానికి ఓపిక చాలా అవసరం. ఆ ఓపికకు, మనో నిబ్బరానికీ మూలం- మళ్లీ మంచి ఆలోచనలే. అసత్యమార్గంలో పయనించేవాళ్లు
సత్యమార్గాన్ని అనుసరించేవాళ్లకు ద్రోహం
చెయ్యాలని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు.
'ఫలానావాళ్లు ద్రోహం చేశారు, అన్యాయం
చేశారు...' అని మనసులో పదే పదే తలచుకుని బాధపడుతూ కూర్చుంటే దుఃఖం, బాధ అంతకంతకూ పెరుగుతాయే తప్ప తరగవు. ఆ దుఃఖం, బాధ పెరుగుతున్నకొద్దీ మనసులో ప్రతికూలమైన ఆలోచనలు కూడా పెరుగుతూనే ఉంటాయి.
🍁 పచ్చటి చెట్టును చెదలు కొరుక్కు తిన్నట్టుగా అవి ఏ మనిషినైనా సరే లోలోపల నుంచి నలిపేస్తాయి. దానివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటూ పోతుంది. ఇతరులు చేసిన, చేస్తున్న కీడుకన్నా ఎవరికి వాళ్లుగా ప్రతికూలమైన ఆలోచనలవల్ల చేసుకుంటున్న కీడు ఎక్కువన్న సత్యాన్ని గుర్తించడం చాలా అవసరం. ఒక్కసారి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ప్రతికూలమైన ఆలోచనలు మనసులోకి రావు.
🍁మనసు నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రతికూలమైన ఆలోచనలు లేనప్పుడు జ్ఞాన సముపార్జన, అభివృద్ధి, సత్కార్యాలు, సత్సంబంధాల గురించి ఆలోచనలు చెయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక అంతా మంచే జరుగుతుంది. ఆ దిశగా ఆలోచన మొదలైనదే తడవుగా బుద్ధి, చైతన్యం ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి పరిశ్రమించడం ప్రారంభిస్తాయి. కొంతకాలం తర్వాత సత్ఫలితాలు రావడం ఆరంభవుతుంది. ఇదే నవజీవన మార్గానికి అవసరమైన సిసలైన యోగం.
🍁'చిత్తవృత్తి నిరోధకః యోగః' అన్న సూత్రానికి నిజమైన అర్థం. చిత్తవృత్తిని నిరోధించడమంటే అసలు ఆలోచనలే చెయ్యవద్దని అర్ధం కాదు. ప్రతికూలమైన ఆలోచనలు చెయ్యవద్దనీ అనుకూలమైన ఆలోచనలు చెయ్యమని అర్థం. వాటిని సాకారం చేసుకోవడానికి కావాల్సిన బుద్ధిని ప్రేరేపించమని అర్ధం. ఎవరికి వారుగా సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న పదిమందినీ సంతోషంగా ఉంచే ఆలోచనలు చేయమని అర్థం. మనిషి జీవితానికి ఇదే నిజమైన పరమార్థం. ఇదే సిసలైన నవ జీవన యోగం.🙏
✍️- మల్లాది వేంకట గోపాలకృష్ణ
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment