*శ్రీ గురుభ్యోనమః*
భగవాన్ తో ఒక భక్తుడు .. నేను ఏదో సాధన చేసుకుంటున్నాను, మీ దయ కూడా నాకు కావాలి అని అడిగాడు. దానికి భగవాన్ .. దయ నువ్వు అడిగితే ఇచ్చినట్టు, నువ్వు అడగకపోతే ఇవ్వనట్టా అన్నారు. *ఏ జ్ఞాని దయ లేకుండా ఉండడు. మీరు అడగలేదని జ్ఞాని దయ ఇవ్వకుండా ఉండడు.
మీ పిల్లలు ఆడుకుంటున్నారనుకోండి .. వాళ్ళు మరిచిపోయినా, టైమ్ కి మీరు ఆటలు మానిపించి అన్నం పెడతారు. అలాగే భగవంతుడు మన తల్లి ! ఆయన స్వరూపమే దయ ! ఆయన ఇవ్వకుండా ఎలా ఉంటాడు ?
కృష్ణా .. కృష్ణా ..
రామా .. రామా ..
శివా .. శివా ..
రమణా .. రమణా ..
ఇలా ఏదైనా నామం చేసుకుంటున్నారు అనుకోండి .. మీకు భక్తి లేకపోయినా, కాలక్షేపం కోసం చేసుకున్నా, తెలియక చేసుకున్నా మీ లోపల ఉన్న అజ్ఞానానికి నిప్పు అంటుకుంటుంది. భగవంతుడు మీ అహంకారానికి కోత కోస్తాడు. మీరు నిప్పుమీద తెలియక చెయ్యి వేసినా అది అంటుకుంటుంది. అలాగే మీరు సరదాకోసం అనుకున్నా *భగవంతుని నామం మీ అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అట్టిది నామం !*
*గురువు ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు.* అశాంతిగా ఉండడు. గురువు అశాంతిగా ఉంటే నీకు శాంతిని ఏం పంచిపెడతాడు ? పాపం రెండు రకాలుగా వస్తుంది. శరీరానికి రోగం, మనసుకి బెంగ, మనసుకి అశాంతి. అశాంతి పాప ఫలం ! రోగం కూడా పాప ఫలం ! కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ అశాంతిగానే ఉంటారు. పూర్వ జన్మలో చేసిన పాపం అశాంతి రూపంలో వస్తుంది.
మీరు బజార్లో డబ్బు పెట్టి శాంతిని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి మీరు జ్ఞానాన్ని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి మీరు ధర్మాన్ని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి మోక్షాన్ని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి వస్తువులు కొనుక్కోగలరు. డబ్బు పెట్టి మీరు బోగాన్ని కొనుక్కోగలరు. కానీ, జ్ఞానాన్ని కొనుక్కోలేరు.
*శ్రీ నాన్నగారి అనుగ్రహ భాషణం -*
*మురమళ్ళ :* 2005 / 02 / 09
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment