Saturday, August 17, 2024

రామాయణమ్. 28
.
ఆ రోజంతా వారికి విశ్వామిత్రమహర్షి కధలే ,అబ్బ ఎంత ఉత్తేజకరంగా వున్నాయవి! ఎందుకుండవు! ఒక సాధారణ రాజు ,ఒక మనిషి! హిమాలయాలకన్నా ఎత్తు ఎదిగి మహామనీషిగా మారిన కధలు ఎవరికి స్ఫూర్తి నివ్వవు? .ఆ కధలలో మునిగి తేలారు అన్నదమ్ములిద్దరూ శతానందులవారు తీయతీయగా చెబుతూ వుంటే! .
.
తదుపరి రోజు విశ్వామిత్రమహర్షి రాకుమారులిరువురినీ వెంటపెట్టుకొని యాగశాలకు తీసుకు వెళ్లాడు! .
.
జనకుడిని చూసి ,రాజా నీవద్ద చాలా గొప్పదయిన శివధనుస్సు ఉన్నదటకదా ! వీరిరువురకూ దానిని చూడాలని కుతూహలంగా ఉన్నది అని అడుగుతాడు! .
.
సుర,అసుర,గరుడ,ఉరగ,కిన్నర,కింపురుషాదులుకూడా దానిని తాకి కదల్చలేకపోయినారు ,అది సామాన్యమైన ధనుస్సుకాదని మీకు తెలుసు .ఈ ధనుస్సు మహాదేవుడు దక్షయజ్ఞమప్పుడు ఎక్కుపెట్టినది దానిని దాచివుంచమని నిమిచక్రవర్తికి ఇవ్వగా, అటనుండి నాకు ముందు ఆరవతరమువాడైన దేవరాతుని వద్దకు చేరినది! 
.
నేను ఒకప్పుడు యజ్ఞమునిమిత్తము భూమిని పరిశుద్ధముచేయుటకు దున్నుచుండగా నాకు భూమియందు ఒక ఆడపిల్ల దొరికినది! ఆమె పేరు సీత ! ఆవిడను వివాహమాడవలెనన్న ,
 పరాక్రమమే శుల్కము ! (వీర్యశుల్క).
ఈ ధనుస్సు ఎక్కపెట్టినవారినే ఆమె వరిస్తుంది! .
.
ఎందరో మహావీరులైన రాజులు ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే వున్నారు! ఎక్కుపెట్టడం మాటదేవుడెరుగు కనీసం ముట్టుకొని కదల్చలేకపోయినారు!  అని జనకుడు పలికాడు.
.
బాలురవలే ఉన్న రామలక్ష్మణులను చూసి వీరు బాలురు ,పైగా నరులు! వీరివల్ల సాధ్యమవుతుందా అని అనుమాన పడ్డాడు! 
.
అయినా విశ్వామిత్రమహర్షి కోరికను ఆదేశముగా స్వీకరించి ఆ దివ్యధనుస్సును సభకు తెప్పించాడు జనకుడు ! 
.
ఆ ధనుస్సు సామాన్యమైనదా! 
.
పది వేల మంది మహాయోధులైనవారు లాగుతుండగా చక్రాలపెట్టెలో ఉంచిన ధనుస్సు సభాప్రాంగణానికి తేబడింది!.
.
ఆ ధనుస్సును మహర్షికి జనకుడు చూపగనే! విశ్వామిత్రుడు రామునితో నాయనా ! ఇదిగో ఆ మహాధనుస్సు ! దీనిని నీవు ఎక్కపెట్టు! అని ఆదేశమివ్వగా దానిని శిరసావహించి శ్రీరాముడు ధనుస్సును సమీపించాడు!.
.
ఆ ధనుస్సు ఎలావుందంటే ! 
.
చిరకాలము భూమినిమోసి అలసినిద్రిస్తున్న మహానాగుడైన ఆదిశేషుడిలాగ ఉన్నదట! 
.
మేఘమండలంలోని కరిమబ్బులలోదాగిఉన్న మెరుపులాగ ఉన్నదట! .
.
రాముడు ధనుస్సును తాకబోతుంటే విశ్వామిత్రుడు శాంతివచనాలు చెపుతున్నాడు ! 
.
ఓ భూదేవీ నీవు అదరకు గుండెచిక్కబట్టుకో! రాముడువిల్లు ఎక్కుపెడుతున్నాడు! 
.
ఓ శేషాహి(ఆదిశేషుడు) నీవు ఉలికిపడి కదలకు! రాముడు విల్లు ఎక్కపెడుతున్నాడు! 
.
ఓ దిగ్గజాలలార (దిక్కులను మోసే ఏనుగులు) మీరు బెదిరి చెదరకండి రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు! 
.
ఓ లోకబాంధవుడా సూర్యుడా గడగడవడకబోకు రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు! 
.
ఓ జంతుసంతతులారా జడిసిపోకండి! రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు! .
.
శ్రీ రామచంద్రమూర్తి ధనుస్సుకు భక్తిపూర్వకముగా ప్రదక్షిణ చేసి దానిమీద చేయి ఆన్చాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

No comments:

Post a Comment